పీవీ... మన ఠీవీ- శిరందాస్ శ్రీనివాస్- హైదరాబాద్- 9441673339

 పాములవర్తి నరసింహారావు మన తెలుగు వారి కీర్తి పతాకకు ప్రతీక. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే ఉన్నత వ్యక్తిత్వం గల మహామనీషి.
బహు భాషా వేత్త, అపర చాణక్యుడిగా పేరుపొందిన  నిరాడంబర రాజకీయ నాయకుడు. 1957 లో మంథని నియోజక వర్గం నుండి శాసనసభకు ఎన్నికై  పీవీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇదే నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. 1962 లో మొదటిసారి మంత్రి అయ్యారు. 1962 నుండి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రి గా, 1964 నుండి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి గా 1967 లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా, 1968-71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రిగా ఇలా వివిధ పదవులు నిర్వహించారు.
ధన బలం లేని, తనకంటూ ఓ వర్గం లేని నిర్వివాద, మేధావి కొరుకోకుండానే ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి పదవులు కోరి వరించిన చిద్విలాసమూర్తి, చిరస్మరణీయుడు పాములవర్తి.
తెలంగాణ లోని వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28 న రుక్నాబాయి, సీతారామరావు దంపతులకు పీవీ జన్మించాడు. వరంగల్లు జిల్లాలోనే ప్రాథమిక విద్య మొదలుపెట్టాడు. తరువాత పూర్వపు కరీంనగర్ జిల్లా, భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు అతనిని దత్తత తీసుకోవడంతో అప్పటినుండి పాములపర్తి వేంకట నరసింహారావు అయ్యాడు.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా భూసంస్కరణలను అమలుపరచారు. పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం తెచ్చింది కూడా పీవీయే. 
మొదటిసారిగా లోక్‌సభకు హనుమకొండ స్థానం నుండి ఎన్నికయ్యాడు. రెండోసారి మళ్ళీ హనుమకొండ నుండే లోక్‌సభకు ఎన్నికయ్యాడు. మూడోసారి ఎనిమిదో లోక్‌సభకు మహారాష్ట్ర లోని రాంటెక్ నుండి ఎన్నికయ్యాడు. మళ్ళీ రాంటెక్ నుండే తొమ్మిదో లోక్‌సభకు ఎన్నికయ్యాడు. 
1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చెయ్యకుండా, దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా తదుపరి ప్రధాని గా కాంగ్రెసు పార్టీ అనూహ్యంగా  పీవీ అందరికీ ఆమోదయోగ్యుడుగా కనపడ్డాడు. ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుండి గంగుల ప్రతాపరెడ్డిచే రాజీనామా చేయించి, అక్కడి ఉప ఎన్నికలో గెలిచి, పీవీ లోక్‌సభలో అడుగుపెట్టాడు. నంద్యాల లోక్‌సభ నియోజకవర్గానికి 1991లో జరిగిన ఉప ఎన్నికలో ఎన్నికై పదో లోక్‌సభలో పార్ల మెంటు సభ్యుడిగా ప్రధాని పి.వీ ప్రమాణ స్వీకారం చేశారు. సాటి తెలుగువాడు ప్రధాని ఆవుతున్నాడని నంద్యాల పార్లమెంట్ సీటుకు జరిగిన ఉప ఎన్నికలలో ఎన్.టి.రామారావు అతనుపై తెలుగు దేశం అభ్యర్థిని పోటీలో పెట్టకుండా తెలుగు వారి కీర్తి పతాక పి వీ అని చాటారు. 
1980- 1989 మధ్య కాలంలో కేంద్రంలో హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖలను వివిధ సమయాల్లో నిర్వహించాడు. 1983 అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్ లో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫీడెల్ కాస్ట్రోను అబ్బురపరచాడు.
ఆనాడు ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేని పరిస్థితి. సహజ సిద్ధంగా ఉన్న తెలివితేటలు, కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో అతనుకు ఉన్న అపార అనుభవంతో క్లిష్ట సమయంలో కూడా ఐదు సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి దిగ్విజయంగా పూర్తి చేశారు. 
రాజకీయాలు తెలియని మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రి గా తీసుకు వచ్చి దివాళా తీసిన ఆర్థిక వ్యవస్థ ను గాడిలో పెట్టి శభాష్ అనిపించుకున్నారు. 
ప్రధానమంత్రుల్లో నెహ్రూ, గాంధీ కుటుంబంబాల బయటి మొదటి వ్యక్తి శ్రీ పి. వి. నరసింహారావు.  మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా ఎన్నో సవాళ్ళను అధిగమించాడు పి.వీ.  అతడి రాజనీతిజ్ఞతకు, చాకచక్యానికి పీవీ సంస్కరణలు నిదర్శనం. అందుకే అతడిని అపర చాణక్యుడు అని అన్నారు. 
పంజాబు తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేయడం లోను,  కాశ్మీరు తీవ్రవాదులు ప్రముఖులను అపహరించినపుడు వారి డిమాండ్లకు లొంగకుండా ప్రముఖులను విడిపించిడం లోనూ 
ఇజ్రాయిల్తో దౌత్య సంబంధాలు మెరుగు పరుచుకోవడం లోనూ, తీవ్రవాదానికి పాకిస్తాను ఇస్తున్న ప్రోత్సాహాన్ని బయటపెట్టి ప్రపంచదేశాల్లో చర్చకు పెట్టడం లోనూ, ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు పెంచుకోవడం, చైనా, ఇరాన్ లతో సంబంధాలు పటిష్ట పరచుకోడం లోనూ,   వంటివి విదేశీ సంబంధాల్లో పీవీ ప్రభుత్వం చూపిన చాణక్య నీతి బహుదా ప్రశంసనీయం. 
పీ వీ ప్రధానిగా ఉన్నపుడే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సమావేశానికి భారత్ తరపున తమ వాణి , బాణీ వింపించడానికి సరియైన నాయకుడు శ్రీ అట్టల్ బిహారీ వాజపేయి  గారే అని పంపించడం పి వీ రాజ నీతిజ్ఞతకు ఓ మచ్చుతునక. ఆ మీటింగ్ లో పాక్ ను కడిగి పారేశారు వాజపేయి అది వేరే ముచ్చట. 
 1998లో వాజపేయి ప్రభుత్వం జరిపిన పొఖ్రాన్  అణుపరీక్షల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఆనాటి పీవీ ప్రభుత్వమే. ఆ విషయాన్ని స్వయంగా నాటి ప్రధాని వాజపేయ్ స్వయంగా ప్రకటించడం పీ వీ పట్ల తన ఆప్యాయతను ప్రదర్శించారు వాజిపాయ్ గారు. 

రాజకీయాల్లో తీరికలేకుండా ఉన్నా, పీవీ తన ఇతర వ్యాసంగాలను వదిలిపెట్టలేదు. తనకు ప్రియమైన సాహిత్య కృషి, కంప్యూటరును ఉపయోగించడం వంటి పనులు చేస్తూనే ఉండేవాడు. అతను చేసిన సాహిత్య కృషికి గుర్తింపుగా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. అతను రచనల్లో ప్రఖ్యాతి చెందినది ఇన్‌సైడర్ అనే అతను ఆత్మకథ. లోపలిమనిషిగా ఇది తెలుగులోకి అనువాదమయింది. శ్రీ  నరసింహారావు బహుభాషాకోవిదుడు. ఇంగ్లీషు, హిందీ తో పాటు అనేక దక్షిణాది భాషలు, మొత్తం 17 భాషలలో కేవలం మాట్లాడడం, రాయడమే కాకుండా ఆ భాషల్లో ప్రావీణ్యం సంపాదించి పలు భాషల్లో రచనలు చేయడం ఆయనకే చెల్లింది.  కోబాల్, బేసిక్, యునిక్స్ ప్రోగ్రామింగ్ వంటి కంప్యూటర్ భాషలలో కూడా ఆయనకు ప్రవేశం ఉంది. 
పి వీ కి మోడీ ప్రభుత్వం భారత రత్న ప్రకటించడం యావత్తు తెలుగు జాతికి భారత రత్న ఇస్తున్నంత సంబరంగా ఉంది. 
పీవీ కి మరణానంతరం భారతరత్న ప్రకటించి మోడీ ప్రభుత్వం తెలుగు వారి చిర కాల కోరికను తీర్చి గౌరవించడం బహుదా ప్రశంసనీయం. కామెంట్‌లు