సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -496
ఘటాల్ప దర్పణ న్యాయము
****
ఘట అనగా మట్టితో చేసిన కుండ, కూజా,నీరు పోసుకును పాత్ర, కుంభరాశి, ఏనుగు, కుంభ స్థలము, ఉచ్ఛ్వాస నిశ్వాసములను నిలుపు చేయుట,ఇరువది ద్రోణముల పరిమాణము అనే అనేక అర్థాలు ఉన్నాయి. అల్ప అనగా  ముఖ్యము కానిది, తుచ్ఛమైనది, కొంచెము, సూక్ష్మము. దర్పణము అనగా అద్దము.
ఏనుగు చిన్న అద్దంలో ఇమిడి చిన్నదిగా కనిపిస్తుంది.అవును కదా! ఎంత పెద్ద వస్తువైనా చిన్న అద్దంలోంచి చూసినప్పుడు చిన్నగానే కనిపిస్తుంది.
అలాగే  ఏనుగైనా, కొండ అయినా.అలా చిన్నవిగా కనబడ్తాయి. కానీ చిన్నవి కావు కదా!ఇది కేవలం ఏనుగుకో, కొండకో కాదు వర్తింప చేసేది. మన పెద్దవాళ్ళు మనకు కూడా వర్తింప జేయడానికే ఈ న్యాయాన్ని మనకు  అందించారు.
 మరి ఇది చదవగానే ఎవరికైనా టక్కున ప్రజాకవి వేమన గారు రాసిన పద్యం గుర్తుకు వస్తుంది.
"అనువు గాని చోట నధికుల మనరాదు/ కొంచెముండుటెల్ల కొదువగాదు/ కొండ అద్దమందు కొంచమై యుండదా/ విశ్వధాభిరామ వినురవేమ!"
అనగా మనకు తగని, మనల్ని గుర్తించని ప్రదేశంలో మనల్ని మనం గొప్పగా చెప్పుకోవడం ఎంత మాత్రం మంచిది కాదు. మనల్ని గుర్తించలేదని బాధ పడాల్సిన అవసరం అంతకన్నా లేదు.మనకు గల గొప్పతనమును, మనలోని శక్తి సామర్థ్యాలను ప్రదర్శించనంత మాత్రాన మనకున్న  ఔన్నత్యానికి ప్రతిభకు ఎలాంటి ఆటంకం కలుగదు.
దీనిని కొండ అద్దంతో పోల్చి కొండ ఎంత పెద్దదైనా అద్దంలో చూసినప్పుడు చిన్నదిగానే కనిపిస్తుంది కదా!అంత మాత్రాన కొండ చిన్నది కాదు అయిపోదు కదా అంటారు .అలాగే మన గొప్పతనం మనం చెప్పుకోనంత మాత్రాన, చెప్పుకునే ప్రదర్శించే అవకాశం రానంత మాత్రాన,ఎవరో కొందరు గుర్తించనంత మాత్రాన మనకున్న గొప్పతనం తగ్గదు అని అర్థము.
 అందుకే ఎవరో మనల్ని గుర్తించలేదని బాధ పడాల్సిన అవసరం లేదు. పూలలో  పరిమళం, మనిషిలో ప్రతిభను ఇతరులు ఎంత దాచిపెట్టినా దాగవు. అనగా గుర్తింపు లేకుండా చేయాలని చూసినా దాగవు. వాటిని  ఎంత తక్కువగా చూడాలని ప్రయత్నించినా వాటంతట అవే బయటపడతాయి.
ఇలా  ఒక ఏనుగో, కొండనో మాత్రమే కాదు ఆకాశం కూడా కుండ నీటిలోనో, బకెట్ నీటిలోనో చూస్తే ... ఇలా చిన్నవి అద్దాల్లా కనిపించే వాటిల్లోంచి చూస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది. ఇలా  ఎన్నో రకాల ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు.
 అరచేయి అడ్డు పెట్టి సూర్యోదయాన్ని అనగలమా ! లేదు కదా! గ్రహణం పట్టినంత మాత్రాన సూర్య చంద్రుల వెన్నెల, కాంతులు తగ్గి పోతాయా? పోవు  అలాగే మనకు తెలియని వ్యక్తులు మనల్ని గుర్తించలేదని బాధ పడకూడదు. సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది. అప్పటివరకు సంయమనమే మన  గొప్పతనానికి రక్షణ కవచం.
 ముఖ్యంగా  కొంతమంది ఇతరులలోని ప్రతిభను,మంచిని గుర్తించడానికి ఇష్టపడరు.వారిని ఎంతగానో తగ్గించాలని చూస్తుంటారు. అలా చూడటం కేవలం వారి మూర్ఖత్వంగా  భావించాలి. అంతే కానీ అలాంటి వారి వల్ల ప్రతిభ,మంచి, దానగుణం లాంటివి దాగవనేది ఈ "ఘటాల్ప దర్పణ న్యాయము" ద్వారా మనం గ్రహించవచ్చు.


కామెంట్‌లు