సాహితీ లబ్ద ప్రతిష్టులు శ్రీ భద్రిరాజు కృష్ణమూర్తి;- సి.హెచ్.ప్రతాప్

 ఇరవయ్యవ శతాబ్దపు భాషాశాస్త్ర కోవిదులలో ఎన్నదగ్గ వ్యక్తి ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి (19 జూన్, 1928 - 11 ఆగష్టు, 2012). భద్రిరాజు కృష్ణమూర్తి 1928 జూన్ 19న ఒంగోలులో భారతమ్మ మరియు సుబ్రహ్మణ్యం దంపతులకు జన్మించారు. అతను పాఠశాలలో సాహిత్య మరియు డిబేట్ బహుమతులు గెలుచుకుంటూ తన మేధో నైపుణ్యాన్ని ప్రారంభంలోనే ప్రదర్శించాడు. అతను 13 సంవత్సరాల వయస్సులో కవిత్వం రాయడం ప్రారంభించాడు. అతని ప్రారంభ రచన యొక్క సిన్ననాటి పద్యాలు అనే సంకలనం 1998లో ప్రచురించబడింది. భాషా శాస్త్రాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి, అధ్యాపనం చేయగల సత్తా నిరూపించుకున్న పండితుడు భద్రిరాజు కృష్ణమూర్తి. ద్రావిడ భాషాశాస్త్రవిజ్ఞానిగా ఈయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. సంప్రదాయ కవిత్వంతో పాటు ఆధునిక ప్రామాణిక భాషా విషయంలో తెలుగుభాషకు అనన్య సామాన్యమైన సేవలందించిన విశిష్ట వ్యక్తి భద్రిరాజు కృష్ణమూర్తి. తిక్కన, శ్రీనాథుల సంప్రదాయ కవిత్వాన్ని ఆరాధించి, వాళ్ళకు దీటుగా ఛందోబద్ధ కవితా రచన చేసారు కృష్ణమూర్తిగారు. నిబద్ధత, నిశిత పరిశీలన, మొక్కవోని దీక్ష ఆయనను సుప్రసిద్ధ పరిశోధకునిగా నిలబెట్టాయి. శిష్యుల పట్ల అపార వాత్యల్యాదరాలు చూపే ఉత్తమ ఆచార్యుడాయన. ఏ నిర్ణయానికైనా వెరవని పాలనాదక్షుడు. నిండైన ఆత్మవిశ్వాసం, ఆదర్శవంతమైన బోధన ఆయనకున్న రెండు కళ్ళు. అందరినీ ప్రేమించే సహృదయత మూర్తీభవించిన మహోన్నత వ్యక్తి భద్రిరాజు కృష్ణమూర్తిగారు. తెలుగు పుట్టుపూర్వోత్తరాల గురించి నిర్దుష్ట సమాచారాన్ని అందించినారు. వృత్తి పదకోశాన్ని అందించిన దక్షిణాసియా దేశాల్లో ప్రప్రథముడు. గత శతాబ్దిలో అంతర్జాతీయ స్థాయిలో గొప్ప భాషాశాస్త్రవేత్తలలో మనదేశానికి చెందిన ఇద్దరిలో ఒకరు. విద్యాబోధనలో వాడుకభాష వినియోగం గూర్చి గిడుగు, గురజాడల తర్వాత అంతటి కృషి చేసిన మహనీయులు.చిన్నారి పొన్నారి చిరుత కూకటి నా……..’ శ్రీనాథుని ప్రొడశైలిని తలపిస్తూ ‘మాతృసందేశం’ 300 వృత్త పద్యాల్లో క్విట్ ఇండియా ఉద్యమ నేపథ్యంగా రచించి పెద్దల మన్ననలు పొందారు. ‘పితృస్మృతి’ వారి మరో గ్రంథం. మాండలిక వృత్తి పదకోశాలు, ద్రవిడియన్ లాంగ్వేజెస్, కం పేరిటివ్ ద్రవిడియన్ లింగ్విస్టిక్స్, కరెంట్ పర్స్ పెక్టివ్స్, లాంగ్వేజ్ – ఎడ్యుకేషన్ అండ్ సొసైటీ అనునవి ఇతర రచనలు. వీరి సిద్ధాంత గ్రంథం ‘తెలుగు వెర్బల్ బేసెస్’ ప్రపంచ ఖ్యాతినార్జించి పెట్టింది.మెడిసిన్, ఇంజనీరింగ్ మరియు మేనేజ్‌మెంట్ వంటి వృత్తిపరమైన కోర్సులను తెలుగులో నేర్పించమని నిరంతరం ప్రభుత్వాలకు హితబోధ చేస్తుండేవారు.
కామెంట్‌లు