శ్రీ మాల్యాద్రి నారసింహ శతకము.;- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర
(తేటగీతి పద్యములు.)

తల్లిదండ్రులు నీవె నా దాత నీవె 
బంధు మిత్రుడ వీవె నా భ్రాత వీవె 
కలిమి బలిమియు నీవయ్య కమల నయన 
నన్ను పాలింపు మాల్యాద్రి నార సింహ!//


ఓ న మాలను నేర్పెడి నొజ్జ వీవె 
చదువు నేర్వగ నీచెంత చనువు తోడ 
వచ్చి పట్టితి నీ పాద పద్మయుగము
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//


గొల్ల పల్లెను దిరిగిన గోప బాల 
మనసు దోఁచెడి దొంగవే మాయజేసి 
పట్టు చిక్కని నీజాడ బయలు పరచి 
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//


జగతి నెల్ల నీమాయల జాల మందు 
ద్రిప్పు చుందువు నీ లీల తెలియలేము 
వింత నాటక మాడెడి విధివి నీవె 
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//


రాజ్య మంతయు వీడిన రాజు వీవె 
నీవు చూపెడి మార్గమే నిశ్చయముగ
ననుసరింతు నోదేవ!నీ యానతులను!
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//


కామెంట్‌లు