సుప్రభాత కవిత ; - బృంద
రాజు వచ్చే రాదారిలో
పాదాలు కడగాలని
నింగికెగసిన నీటి చుక్కల
చేతికందేనా అవకాశం?

దాచుకున్న మమతలన్నీ
చాచిన చేతుల నింపుకుని
వేచిన అలలకు అలజడే కానీ
అందునా  ఆకాశం?

ఎంత ఎత్తుకు ఎగిరినా
అంత వేగంగా దిగిపోవు
చిందు చినుకుల చిత్తం
పొందేనా అనురాగం?

సంబరానికి కారణం 
అంబరాన అల్లంత దూరాన
అగుపించే అపురూపమైన
ఆత్మబంధువు ఆగమనం..

చిందులేసే చిన్న పాపల
చిఱుత పాదాల కదిలే
సిరిమువ్వల సడి లాగా
మురిపించే ధ్వనులతో

ముచ్చటగా వచ్చి ముంగిట వాలి
ముదము కలిగేలా మది కోరే
వరములు  మూటగా తెచ్చి
మురిపించు వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు