ప్రభుత్వ పాఠశాలల్లో బహుళ తరగతి బోధనతోనే పాఠశాల పిల్లల్లో విషయ పరిజ్ఞానం పెంపొందుతుందని, ఫలితంగా వారు సత్ఫలితాలు సాధిస్తారని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ఊషన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య అన్నారు. ఆదివారం ఆయన ఊషన్నపల్లి గ్రామంలో విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ (విఈఆర్)లో 15 సంవత్సరాలలోపు బాలబాలికల వివరాల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పిల్లల తల్లిదండ్రులు లేవనెత్తిన అనేక సందేహాలను నివృత్తి చేశారు. ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ... సాధారణంగా పిల్లలు తక్కువగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఈ బహుళ తరగతుల బోధన(మల్టీ గ్రేట్ టీచింగ్) అమలు చేస్తారని, దీనివల్ల పాఠశాల పిల్లలు ఒకే సమయంలో రెండు తరగతులకు సంబంధించిన సామర్థ్యాలను పొందుతారని అన్నారు. రెండో తరగతిలో బాగా చదివే విద్యార్థి మూడో తరగతి పాఠ్యాంశాలపై అవగాహన పొందుతాడని, చదువులో వెనుకబడిన మూడో తరగతి విద్యార్థి మూడుతో పాటు రెండో తరగతికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం వల్ల అభ్యసనం బాగా జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రజల సొమ్ముతో నడుస్తున్నాయని, అవి ప్రజలందరి సమిష్టి ఆస్తి అని అన్నారు. తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలకు చెల్లించే ఫీజులో సగం డబ్బును వెచ్చించి ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలలో టీచర్లను ఏర్పాటు చేసుకొని, ఇతర అవసరాలు తీర్చుకోవచ్చన్నారు. గ్రామంలో చదువుకున్న యువతీ, యువకులను టీచర్లుగా ఏర్పాటు చేసుకోవడం వల్ల వారికి ఉపాధి దొరుకుతుందని, మన ఊరును మనమే బాగు చేసుకున్నట్లవుతుందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అంకితభావం, విశేష బోధనానుభవం ఉన్న క్వాలిఫైడ్ టీచర్లున్నారని, వారి సేవలను పిల్లల తల్లిదండ్రులు వినియోగించుకోవాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఏమీ లేదని, పిల్లల తల్లిదండ్రులు వాటిపై మోజు విడనాడాలని, వేలాది రూపాయల డబ్బును వృధా చేసుకోకూడదని ఆయన సూచించారు. ఉన్న ఊరు కన్నతల్లి లాంటి మన ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను బలోపేతం చేయాల్సిన బాధ్యత గ్రామ ప్రజలందరిపైనా ఉందన్నారు. ఊషన్నపల్లి గ్రామంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, పిల్లల తల్లిదండ్రులు, ప్రజలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని, గ్రామంలోని పిల్లలందరినీ ఊషన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలని ఈర్ల సమ్మయ్య కోరారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి