న్యాయాలు -564
దేహ కేశ న్యాయము
*****
దేహ అంటే శరీరము, దేహము, తనువు,మేను. కేశ అంటే వెంట్రుక,రోమం అనే అర్థాలు ఉన్నాయి.
దేహము నుండే వెంట్రుకలు పుడతాయి అని అర్థము.
దేహము నుండే వెంట్రుకలు పుడతాయి దీనికి ఎలాంటి సందేహమూ లేదు కదా!
మరి దేహంలో మొలిచే ఈ కేశాలకు సంబంధించిన కొన్ని విషయాలు, కొంచెం సమాచారాన్ని తెలుసుకుందామా.
మానవ శరీరంలోని చర్మం మీద పుట్టే వెంట్రుకలను రోమాలు లేదా కేశాలు అంటారు.ఈ వెంట్రుకలు తలమీద, కనురెప్పలు, కనుబొమ్మలు ఛాతీ, మూతీ, చుబుకం,చంక, జననేంద్రియాల మీద మొలుస్తాయి.
అయితే ఈ వెంట్రుకలు దేహంపై ఉండే చర్మంలో ఒక భాగం. ఇవి నలుపు, తెలుపు గోధుమ రంగుల్లో ఉండటానికి కారణం ఐదు పిగ్మెంట్లు ( రంగుతో కూడిన పదార్థాలు).ఈ పిగ్మెంట్లలో మెలానిన్ అనేది చాలా ముఖ్యమైనది.ఇది దేహంలోని మెలనోసైటిస్ అనే కణాల నుండి ఉత్పన్నమవుతుంది.ఇది తక్కువ పాళ్లలో ఉంటే శరీరం తెల్లగానూ, ఎక్కువగా వుంటే నల్లగానూ ఉంటారు. వెంట్రుకలకు కూడా ఇదే వర్తిస్తుంది.వయసు పెరిగేకొద్దీ మెలనోసైటిస్ కణాలు తక్కువ శాతంలో మెలానిన్ ను ఉత్పత్తి చేయడం వల్ల తల నెరుస్తుంది. ప్రతి వెంట్రుక ఒక పారదర్శకంగా ఉండే సన్నని గొట్టంలా ఉంటుందట.మెలానిన్ అందక పోతే గొట్టం మొత్తం ఖాళీ అయిపోయి తెల్లగా కనిపిస్తుందన్ప మాట. వృద్ధాప్యంలో వెంట్రుకల రంగు తెల్లగా మారడానికి కారణం అదన్నమాట.
మరి ఈ వెంట్రుకల వల్ల ఏం ఉపయోగం అంటే కనుబొమ్మల వెంట్రకలేమో దుమ్ము ధూళి చెమట నుండి కళ్ళను రక్షించేందుకు సహాయం చేస్తాయి అలాగే ఆశ్చర్యం, ఆనందం కోపం మొదలైన భావోద్వేగాల ప్రదర్శనలో ముఖ్య పాత్ర వహిస్తాయి.తలపై వెంట్రుకలు అధిక వేడి నుండి రక్షిస్తాయి.
ఇక ఈ వెంట్రుకలకు సంబంధించి కొన్ని సామెతలు భలే వుంటాయి. ఎవరైనా అతిగా, గొప్పగా మాట్లాడే వారిని ఉద్దేశించి వాళ్ళు నచ్చనప్పుడు అలాంటోళ్ళను "తలెంట్రుకలంత మందిని చూశాను" అంటారు. ఎవరైనా పంచాయతీకి వచ్చి అంతు చూస్తా. అది చేస్తా ఇది చేస్తా అని బెదిరించినప్పుడు "తలలో ఒక్క వెంట్రుకను కూడా లాగలేడు" అనడం పరిపాటి. కొందరిని తిరస్కరించేటప్పుడు "తలెంట్రుకతో సమానం" అనడం వింటుంటాం. ఏదైనా ప్రమాదం తృటిలో తప్పిపోతే "వెంట్రుక వాసిలో" తప్పించుకున్నాం అంటుంటారు.ఇవండీ! దేహ కేశాలకు సంబంధించిన సామెతలు.
మనం వెంట్రుకల గురించి కొంత సమాచారం తెలుసుకున్నాం కదా!
మరి దీనిని న్యాయముగా చెప్పడంలో ఆంతర్యం ఏమిటో తెలుసుకుందాం.
దేహము నుండి వెంట్రుకలు పుట్టినట్లు మనసు నుండి ఆలోచనలు పుడుతుంటాయి.అయితే వృద్ధాప్యంలో వెంట్రుకల పెరుగుదల ఆగిపోయింది. అలాగే మనిషి యొక్క ఆలోచనా ధోరణి కూడా మారిపోతుంది.పరిధి పరిమితం కాబడుతుంది.
అందుకే దేహంలో పుట్టే కేశాలకు మనసులోని ఆలోచనలకు ముడిపెట్టారు మన పెద్దవాళ్ళు.
"జుట్టున్నమ్మ ఏ కొప్పైనా వేసుకోగలదు" అన్నట్లు వయసులో వచ్చే బోలెడు ఆలోచనలను సక్రమమైన మార్గంలోకి మళ్ళిస్తే ఏ మంచి పనినైనా అవలీలగా చేయవచ్చు అంటారు మన పెద్దలు.
జుట్టు లేదా వెంట్రుకలకు సరైన పోషణ లేకపోతే రకరకాల సమస్యలు వచ్చినట్లే మనసులో పుట్టే ఆలోచనలను సరియైన విధంగా మలుచుకోక పోతే అనేక రకాల మానసిక రుగ్మతలు వస్తాయి.
మరి "దేహకేశ న్యాయము"ను ఎందుకు చెప్పారో తెలిసిపోయింది కదా! మన తలపై జుట్టును తలలోని ఆలోచనలను ప్రభావితం చేసే అంశాల పట్ల సరైన అవగాహన కలిగి వుందాం. సత్ఫలితాలను పొందుదాం.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి