సుప్రభాత కవిత ; - బృంద
కడలి కెరటాల హంగులన్నో
వెడలి తీరం తాకే క్రమంలో
నీలమంత మాయమై
నురుగు మాత్రం మిగిలేలా..!

ఉధృతంగా పైకెగసి
ఉప్పెనగా ముందుకు దూకి
ఊపేసి విసిరేసే వేగం కూడా
చప్పున మాయమై మౌనమయేలా..!

రగులుతున్న మంటలేవో
తరిమినట్టు పరుగు తీసి
దరిని తాకగానే తనకుతానే
సర్దిచెప్పుకుని తగ్గిపోయేలా..!

మనసులోని తలపులన్నీ
మాటవేపు పరుగుతీసి
పెదవి గడప దాటకనే
నాలుకకు సెలవిచ్చేలా..!

కడుపులోని సెగలన్నీ
కళ్ళలోకి తోసుకొచ్చినా
కళ్ళెమేసి చూపులను
కదలకుండా కాపుకాసేలా...!

కడుపులో బడబానలం
దాచుకున్న కడలికన్నా
కన్నీళ్ళను కలతలనూ
కట్టివేసి నవ్వేసే మనసే మిన్న..

ప్రకృతిలో సాగరం 
అంతులేని అద్భుతమైతే
జీవన చిత్రంలో మనసు
అంతు దొరకని అతిశయమే!

మరపన్నది లేకపోతే
మనిషి జీవితం కష్టమంటూ
రేపటిపై ఆశను నింపుతూ
రోజూ ఓదార్చి ఒడ్డుకు చేర్చే

అతిశయమైన వేకువకు

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు