న్యాయాలు -593
పానక రస లేదా ప్రపానక రస న్యాయము
******
ప్రపానక అనగా త్రాగుట.పానకం అనగా బెల్లము , ఏలకులు , మిరియాలు మొదలైనవి చేర్చి చేయు పానీయము.రస అనగా సారము, ద్రవము, నీరు, మద్యము రుచి,రుచికల పదార్థము, అభిరుచి, వీర్యము,పాదరసము, విషము అనే అర్థాలు ఉన్నాయి.
ప్రపానక రసం అంటే తాగే పానకంలో రుచిగల పదార్థాలు కలిసి వుండటం అని అర్థము.
అయితే పానకము,రసము మొదలైనవి తత్కారణములకంటే భిన్నములైనట్లు. మామూలుగా తీపి పదార్ధాలను ఆయా పేర్లతో పిలుస్తాం.కానీ తద్భిన్నంగా అంటే పంచదార లేదా బెల్లం, మిరియాలు వేసి చేసిన దానిని పానకం అంటాం.అలాగే రసము అంటే నవరసాల్లో ఏదైనా కావచ్చు.కానీ సామాన్యమైన అర్థంతో చూస్తే చింతపండు పులుసు, మిరియాలు మొదలైనవి కలిపి మరిగించి చేసే దానిని రసం అంటాం.వీటిని విడివిడిగా చెప్పేటప్పుడు అంతగా ప్రత్యేకత ఉండదు కానీ వాటిని కలిపినప్పుడు ఒక ప్రత్యేక పదార్థంగా మారుతుంది.పదార్థాలు అవే కానీ కలిపినప్పుడు రుచి భిన్నంగా, ప్రత్యేక పేరుతో పిలువబడుతుంది.
అలాగే పదాలు కూడా. మాములుగా వాటికంటూ అర్థాలు ఉంటాయి.కానీ వాక్యాల్లో ఉపయోగించినప్పుడు పదము యొక్క అర్థం సందర్భానుసారంగా మారుతుంది.అందుకే పదము కంటే వాక్యం భిన్నంగానూ పదార్థము కంటే వాక్యార్థము భిన్నంగానూ కనిపిస్తుంది.
పదార్థాల గురించి చెప్పుకున్నాం. మరి పదాల అర్థాలు ఎలా మారుతాయో చూద్దామా.
అలా మారిన పదాలతో కూడిన వాక్యాలు ఇవిగో...
"1.మిమ్ముమాధవుడు రక్షించుగాక"2."మానవ జీవనం సుకుమారం" అనే రెండు వాక్యాల్లో ఒకే పదం రెండు వేర్వేరు అర్థాలను కలిగిస్తుంది.అదెలా అంటే "మిమ్ము మాధవుడు రక్షించు గాక - ఇందులో మాధవుడు అంటే విష్ణువు అని అర్థము. అలాగే "మిమ్ము ఉమాధవుడు రక్షించు గాక " అంటే ఉమాధవుడు అంటే మనకు తెలుసు శివుడు అని. అలాగే రెండవ వాక్యం "మానవ జీవనం సుకుమారం" అందులో ఏముంది ప్రత్యేకత మానవ జీవనం సుకుమారం( మనిషి జీవనం)అంతేగా అని ఒక అర్థం అయితే మా 'నవ జీవితం' సుకుమారంలో నవ అంటే ఆధునిక అని అర్థం. ఇలా పదం లేదా శబ్దం ఒకటే అయినా వాక్యంలో సందర్భానుసారంగా వేర్వేరు అర్థాలను కలిగి వు ఉండటం. ఇలా "మావిడాకులు తెచ్చివ్వండి", వాడి కత్తి తీసుకోండి", "ఆమె లత పక్కన నిలుచున్నది"... ఇలా ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు.ఇలాంటి వాటిని శ్లేషాలంకారాలు అంటారు.
ఎలాగూ సందర్భం వచ్చింది కాబట్టి ఒకే పదాన్ని వాక్యంలో పక్కపక్కనే ఉపయోగిస్తే ఆ పదాలకు రెండు రకాల అర్థాలు ఎలా వస్తాయో చూద్దాం.
మాములుగా తేలు అనే పదం తీసుకుంటే వాక్యాలను బట్టి, ఉపయోగించే విధానం బట్టి రెండర్థాలు వస్తుంటాయి. తేలు అంటే నీటిలో, మరేదైన వాటిలో పైకి తేలు అనే అర్థంతోను "తేలు కుడుతుంది" అంటే 'తేలు'ను ఒక జీవిగానూ చెప్పడం. ఇక పదాన్ని వాక్యంలో పక్కపక్కనే చేర్చితే రెండర్థాలుగా మారుతుంది. ఉదాహరణ-"తేలు తేలుతుంది". "తొక్క తొక్కరాదు". లాంటి వాక్యాలు.ఇలా ఒకే పదాలను రెండింటినీ పక్క పక్కనే చేర్చిన వ్యాక్యాలను ఛేకానుప్రాస అలంకారాలు అంటాం.
ఇలా ఒక పదం వాక్యంలో చేరినప్పుడు వాక్యం భిన్నంగా మారడం.అలాగే పదార్థం కూడా.. వాక్యంలా కొన్నింటిని కలిపినప్పుడు భిన్నంగా మారడం. పద అర్థము మరియు పదార్థము అర్థము మారడం. ఇందులో కూడా శ్లేషార్థం స్ఫురిస్తుంది కదా!
పై వాటిల్లో పదాలు వాక్యాల్లో ఉపయోగించినప్పుడు అర్థాలు మారి వాక్యాలు వేర్వేరు అర్థాలను ఇవ్వడం చూశాం. ఈ "ప్రపానక రస న్యాయము" కూడా అదే అర్థాన్ని ఇస్తుంది.విడిగా ఉన్న పదార్థాలు మామూలుగా అనిపిస్తూనే వాటిని కలిపినప్పుడు భిన్నంగా అనగా పేరు మారడం జరిగింది.దీనినే పెద్దవాళ్ళు ఏమంటారంటే "మనిషి వ్యక్తిగతంగా ఒక్కడే కానీ వివిధ సమూహాల్లో చేరినప్పుడు సమూహంగా వివిధ పేర్లతో పిలవబడతాడు" అంటారు.అనగా మనం చేసే పనిని బట్టి, వృత్తిని బట్టి అంటే విద్య, వైద్య, వ్యవసాయ రంగానికి చెందిన వారిగా పిలవబడటం అన్న మాట.
ఈ విధంగా పదాలు, పదార్థాలు,వ్యక్తులు ఆయా సందర్భాలను, వృత్తి, వ్యాపకాలను బట్టి వివిధ అర్థాలతో కూడిన వాక్యాలు,సంస్థలు సమూహాలుగా మారడమే ఈ "ప్రపానక రస న్యాయము" లోని అంతరార్థము.ఇప్పుడు మనకు తెలిసి పోయింది కదా!


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి