అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం;సి.హెచ్.ప్రతాప్

 శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం, శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం మండలంలో అరసవల్లి అనే గ్రామంలో ఉంది. శ్రీకాకుళం పట్టణానికి సుమారు ఒక కిలోమీటరు దూరంలో గల ఈ గ్రామం శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం ద్వారా బహుళ ప్రసిద్ధి చెందింది.ఇక్కడ సూర్యకిరణాలు దేవస్థానంలోని సూర్యభగవానుడిని తాకే సమయంలో స్వామివారిని దర్శనం చేసుకుంటే విజయం తథ్యమని చాలా కాలంగా భక్తులు విశ్వసిస్తున్నారు.     ప్రతి సంవత్సరం మార్చి 9, 10, 11, 12 తారీఖుల్లో, అక్టోబర్ 1, 2, 3, 4 తారీఖుల్లో ఈ అద్భుతం ఆవిష్కృతమవుతుంది. ఈ అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే అన్నీ పాపాలు తొలగిపోతాయనే నమ్మకం ఉంది. పద్మ పురాణం ప్రకారం ప్రజల క్షేమం కోసం కశ్యప మహర్షి ఈ దేవాలయ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఆధారాలున్నాయి.
ఒకప్పుడు ఈ ఊరిని హర్షవల్లి అనే వారనీ అదే క్రమేణా అరసవల్లిగా మారిందని ప్రతీతి. మహాభాస్కర క్షేత్రంగా పిలుస్తున్న ఈ ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందని స్ధల పురాణం చెబుతోంది. ఆలయం తొలుత దేవేంద్రునిచే నిర్మితమైందని పురాణ ప్రవచనం.
అందువల్లే సూర్యకిరణాలు విగ్రహాన్ని తాకేసమయంలో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి భక్తులు లక్షల సంఖ్యలో ఇక్కడకు చేరుకుంటారు. అదే ఈ నాటి అరసవెల్లి క్షేత్రము. అనంతరం శ్రీఉమారుద్ర కోటేశ్వర స్వామి వారిని దర్శించుకొని జన్మ పునీతం భక్తులు చెసుకుంటారు. సకల జీవులకూ సంక్షేమాన్ని, ఆయురారోగ్యాలనూ, ప్రసాదించే ఈ స్వామివారి ఇరు చేతులూ అభయ ముద్రలోనే ఉంటాయి. మాములు రోజులతో పోలిస్తే మాఘ, వైశాఖ, కార్తీక మాసాల ఆదివారాల్లో ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అందులో ముఖ్యంగా రథసప్తమినాడు ఆ సంఖ్య లక్షల్లోకి చేరుకుంటుంది.దేవాలయ ప్రధానమూర్తి సుమారు ఐదు అడుగుల ఎత్తు కలిగి కమలపు రేకలతో ఏడు గుర్రాలతో ప్రక్క పద్మ, ఉష, చాయా దేవేరులతో కూడుకొని ఉంటుంది.
విగ్రహ పాదాల వద్ద ద్వారపాలకులగు పింగళ, దండులతో పాటు సనక సనందాది ౠషుల విగ్రహాలు ఉన్నాయి. సూర్య రథం, కిరణాలు కూడా చెక్కబడి ఉన్నాయి.
ప్రతి రథ సప్తమికి సూర్య కిరణాలు మూలవిరాట్ పాదాలపై ప్రసరిస్తాయి. ప్రస్తుత దేవాలయం రథం నమూనాలో చక్రాలపై నిలిచినట్టుగా నిర్మించారు.
బయటకు పోవు మార్గ ద్వారం వద్ద ఆలయానికి సంబంధించిన మూడు శాసనాలను నిక్షిప్తం చేసారు.ఆలయంలో ఐదు విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి. అవి 1. ఆదిత్య 2. అంబిక 3. విష్ణువు 4. గణేశుడు 5. మహేశ్వరుడు. ఈ విగ్రహాలన్నింటిని దర్శించిన తరువాత, భక్తులు చివరకు ఆలయంలో సూర్యుని దర్శనం పొందుతారు మరియు వారు అక్కడ స్వామిని పూజిస్తారు.
సూర్యుడు భూమిపై జీవితాన్ని సాధ్యం చేసే ప్రకాశాన్ని మరియు కిరణాలను ఇచ్చే దేవుడు. అతను శక్తికి మూలం మరియు ప్రతి జీవిలో జీవితాన్ని ప్రేరేపిస్తాడు. సూర్య నమస్కారం చేసే వ్యక్తులు మంచి ఆరోగ్యం మరియు సూర్యుని అనుగ్రహాన్ని పొందుతారు, తద్వారా వారు సమాజంలో శ్రేయస్సు మరియు స్థితిని పొందుతారు.

కామెంట్‌లు