సునంద భాషితం;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -628
బ్రాహ్మణ పరివ్రాజక న్యాయము
****
బ్రాహ్మణ అనగా  సమూహము,వేద భాగము.పరివ్రాజక అంటే సన్యాసి,సంచారి, సమస్త భవ బంధాలను విడిచి పెట్టినవాడు, సంసారాన్ని వదిలివేసిన యతి... ఇలా అనేక అర్థాలు ఉన్నాయి.
 పరిత్యజ్య సర్వం ప్రజాతీతి పరివ్రాట్" అని అమరం చెబుతోంది.అంటే  సర్వం వదిలేసిన వారే పరివ్రాజకులు. మళ్లీ  వీరిలో నాలుగు రకాల వాళ్ళు ఉంటారు.కుటీచక,బహూదక,హంస, పరమహంసలనే నాలుగు విధాల సన్యాసులు ఉన్నారు.
కుటీచకులు అంటే ఇల్లు వదిలి పోకుండా  కుటుంబంలో పుత్రుడు పెట్టే భిక్షను స్వీకరించి జీవనం సాగించే వాడు. బహూదకుడు అంటే సంప్రదాయ పద్ధతిలో సన్యాసం స్వీకరించి నిరంతరం సంచారం చేస్తుండే వాడు. ఇతడు గ్రామంలో ఒక రోజు, పట్టణాల్లో మూడు రోజులు, పుణ్య క్షేత్రాలలో ఐదారు రోజులు సంచారం చేస్తూ గృహస్థుల ఇళ్ళలో భిక్ష స్వీకరించే వాడు. ఇక హంస పరివ్రాజకుడు గ్రామాలలో అతి తక్కువ సమయం అంటే ఒక రోజు కంటే ఎక్కువ ఉండని వాడు. నాల్గవ వాడైన పరమ హంస ఆత్మ నిష్ట కలవాడు.
 ఇలా సన్యాసులు లేదా పరివ్రాజకులు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక ,ధార్మిక చింతనలో వుంటారు. పరివ్రాజకుడు తన వల్ల సకల భూతాలకు అభయం, ఆ భూత జాలం వల్ల తనకు  అభయం పొందగలిగిన వారు.
ఈ సన్యాసులు లేదా పరివ్రాజకులకు ఎలాంటి కోరికలు ఉండకూడదు.భవబంధాల పాశంలో చిక్కుకోకూడదు. వారెప్పుడూ ధర్మాచరణ చేస్తూ లోక కల్యాణం కోసం తపిస్తూ, ప్రజల దుఃఖాన్ని పోగొట్టటానికి ప్రయత్నిస్తూ వుంటారు.వీరిలో ముఖ్యంగా గౌతమ బుద్ధుడు, వర్థమాన మహావీరుడు మొదలైన వారు ముఖ్యులు.
వీరు ఎల్లప్పుడూ సంచారం చేస్తూ ప్రజలకు ధర్మం గురించి బోధిస్తూ వుంటారు.వీరు పరమోత్కృప్టమైన  స్థితిలో ధ్యానం చేస్తూ ఉంటారు.
జాతికి ఆదర్శంగా నిలిచిన ఈ పరివ్రాజకులు న్యాయము , ధర్మం , పాటిస్తూ,సహనంతో  వంటివి సమాజంలో నెలకొల్పాలనే భావన కలిగి  నిరంతర సమాజ శ్రేయస్సుకు కృషి చేస్తారు. ఉత్తమ సంస్కారాల సంపదకు వేదం తొలి చిరునామా అయితే ఈ సంపదను ప్రజలకు అందించినది మాత్రం పరివ్రాజకులే.
 మరి ఈ "బ్రాహ్మణ పరివ్రాజ న్యాయము"ను మన  పెద్దలు చెప్పడంలో కారణం ఏమిటంటే:మనము ఎంతగా సంసార సాగరాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ  ఏవేవో అవరోధాలు తప్పవు.అవి ఎదురైనప్పుడు పరివ్రాజకునిలా నిశ్చింతగా ఉంటే వాటి వల్ల ఎలాంటి వత్తిడి,బాధ కలగవని అంటారు.మన ప్రమేయం లేకుండా జరిగే సంఘటనలకు చింతించకుండా సాక్షి భూతంగా ఉండాలనీ, ధర్మాన్ని అనుసరించి సాగిపోవాలని చెప్పడమే ఈ న్యాయము లోని అంతరార్థము.
ఇవన్నీ శిష్యులుగా అంది పుచ్చుకున్న మనం వాటిని ఆచరణలో చేసి చూపుతూ సన్మార్గంలో నడుస్తూ సంతోషంగా ఉందాం.

కామెంట్‌లు