ఓ అడవిలో ఒంటరిగా తిరిగే సింహానికి స్నేహితుడు ఎవరైనా ఉంటే బాగుండు అనిపించింది. తమ జాతి సింహాలు ఎవరూ అడవిలో లేకపోవడం తో దిగులుతో ఉన్న సింహం పరిస్థితి చూసిన ఓ కాకి ,సింహం తో స్నేహం చేయడానికి ఒప్పుకుంది.
సింహం సంతోషించింది. ఇక ఆరోజు నుండి కలిసి మెలిసి ఉండసాగాయి.సింహం ఏదైనా జంతువును వేటాడిన రోజు కాకికి పండగే. సింహం తినగా మిగిలిన మాంసాన్ని లొట్టలేసుకుంటూ తినేది కాకి. అంతే కాకుండా సింహం పంటి సందుల్లో ఇరుక్కున్న మాంసాన్ని నేర్పుగా తన ముక్కుతో బయటకు తీసేది కాకి.
ఈ రెండింటి స్నేహాన్ని చూసిన ఒక కోతి, "ఓ కాకీ...నువ్వు స్నేహం చేసేది ఓ సింహం తో అన్న విషయం మరవద్దు.కాస్త జాగ్రత్తగా ఉండు..." అని హెచ్చరించింది.
"నేను సింహం తో స్నేహం చేస్తుంటే మీకు కుళ్ళుగా ఉంది కదూ..."అంటూ కాకి రుస రుసలాడింది.
ఒక రోజు సింహం ఆహారం కోసం బయలుదేరింది.సాయంత్రం అయినా సింహానికి ఒక్క జంతువు కూడా చిక్కలేదు. సింహం ఆకలి తో విల విల లాడింది. ఇక చివరి ప్రయత్నం గా కాకిని చంపి తినాలని నిర్ణయించుకుంది.
"కాకీ..నా నోటి సందుల్లో ఇరుక్కున్న ఆహారం కాస్త తీసిపెట్టవా!" అని అడిగింది."నాకిది అలవాటేగా...."
అన్నది కాకి.
సింహం పెద్దగా నోరు తెరిచింది.
కాకి తాపీగా మాంసాన్ని తీయడానికి సిద్ధమైంది.
సింహం నోట్లోకి కాకి వెళ్ళగానే సింహం గబుక్కున నోరు మూసేందుకు సిద్ధమైంది. అపాయాన్ని పసిగట్టిన కాకి ,వేగంగా సింహం నోటి నుండి బయటపడింది.
కాకి మెరుపు వేగంతో తప్పించుకోవడం తో సింహం ఆశ్చర్యపోయింది.
"నీ సంగతి తెలుసు.కోతి చెప్పిన జాగ్రత్తలను నేను మరిచిపోలేదు.అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నా.అయినా...నువ్వు మరీ దుష్టుడివి కావు.ఆకలి నీచే తప్పు చేయించింది."అంది కాకి.
కాకి తెలివి కి సింహం ఆశ్చర్యపోయింది.
"మిత్రమా..అలా చెరువు వైపుకు వెళ్దాం పద. అక్కడ నీ కు నీళ్ళు తాగడానికి వచ్చే జంతువులు దొరకవచ్చు." అని సింహం తో అన్నది కాకి.
"నిజమే..పద" అంటూ సింహం బయలుదేరింది.
కాకి , సింహాన్ని అనుసరించింది.
ఇదంతా చెట్టుపై నుండి చూస్తున్న కోతి, "కాకి భలే తెలివైనదే" అని ఆశ్చర్యపోయింది.
(అయిపోయింది)
రచన:వడ్డేపల్లి వెంకటేశ్
హామీ పత్రం
ఈ కథ నా స్వంతం.కాపీ అని రుజువు అయితే మీరు తీసుకునే చర్యలకు భాధ్యత వహిస్తాను అని హామీ ఇస్తున్నాను
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి