ఒకూర్లో ఒక రాజున్నాడు. ఆయనకు ఏడుమంది పెండ్లాలు. కానీ ఎన్ని సమ్మచ్చరాలైనా ఒక్కరికి గూడా పిల్లలు పుట్టలేదు. దాంతో కనపడిన ప్రతి గుడికీ పోయి మొక్కుకున్నాడు. పిలిచి పిలిచి పేదోళ్ళందరికీ ఎంత కావాలంటే అంత దానాలు చేసినాడు. తీర్థయాత్రలు తిరిగినాడు. యజ్ఞాలు చేసినాడు. బావులు, చెరువులూ తవ్విచ్చినాడు. సత్రాలు కట్టిచ్చినాడు. రోడ్లకిరువైపులా చెట్లు నాటిచ్చినాడు. ఐనా పిల్లలు మాత్రం పుట్టలేదు.
ఎట్లాగబ్బా అని బాధపడతా వుంటే ఒక రోజు ఒక ముని హిమాలయ పర్వతాలకు పోతా పోతా ఆ ఊరికి వచ్చినాడు.
ఆయన చానా గొప్పోడు. మంచోడు. అంతేగాదు మస్తుగ మహిమలున్నోడు. విషయం తెల్సుకున్న రాజు పరుగు పరుగున ఆ ముని దగ్గరికి పోయి ఆయన కాళ్ళ మీద పడి కండ్ల నిండా నీళ్ళు కారిపోతా వుంటే వెక్కివెక్కి ఏడుస్తా "సామీ! సామీ! ఇప్పటికి పెండ్లయి పదేండ్లయింది. ఒక్క పిల్లోడు కూడా పుట్టలేదు. ఎట్లాగైనా కనికరించి పిల్లలు పుట్టే మార్గం చెప్పండి" అంటా వేడుకున్నాడు.
ఆ ముని అయ్యో పాపమని జాలిపడి ఏడు మంత్రించిన మామిడిపండ్లిచ్చి “ఇవి తీసుకోని పోయి నీ పెళ్ళాలకియ్యి. తొమ్మిదినెల్లు తిరిగేసరికల్లా పండంటి పిల్లలు బోసినవ్వులు నవ్వుతా నీ కండ్ల ముందుంటారు" అన్నాడు. రాజు సంబరంగా వాటిని తీసుకోని పోయి పెళ్ళాలకిచ్చినాడు. అందరూ వాటిని దేముని దగ్గర పెట్టి పూజ చేసి తిన్నారు.
చిన్న పెండ్లాం కూడా అందరి మాదిరే దేముని ముందర పెట్టి పూజ చేస్తావుంటే యాన్నుంచొచ్చిందో ఏమోగానీ ఒక మాయదారి ఎలుక వచ్చి ఆమె కండ్లు తెరిచేసరికి సగానికి సగం పండు నున్నగా తినేసింది. రాణికి దానిని తినాల్నో పాడెయ్యాల్నో అర్ధం కాలేదు. ఏమైతే అదే ఐతుందనుకోని భయపడతానే మిగిలిన ఆ సగం పండు తినేసింది.
అవి తిన్న నెలకల్లా ఏడుమంది రాణులూ నెల తప్పినారు. తొమ్మిదినెల్లు దాటినాక ఆరుమందికీ పండు లాంటి కొడుకులు పుట్టినారు గానీ చిన్నరాణికి మాత్రం ఎలుకెంతుంటాదో అంత చిన్న కొడుకు పుట్టినాడు.
పాపం రాణి చానా బాధపడింది. కానీ బిడ్డ బిడ్డనే గదా! కడుపున పుట్టినాక ప్రేముంటాది గదా. వాడు ఎలుకంతున్నా ఎవరు ఎంత ఎగతాళి చేసినా ఏమీ పట్టిచ్చుకోకుండా ప్రేమగా పెంచి పెద్ద చేసింది. మిగతా ఆరుమంది మాత్రం వీన్ని వాళ్ళతోపాటు ఆడిపిచ్చుకొనేటోళ్ళు గాదు. యాడికీ రానిచ్చేటోళ్ళు గాదు. పైగా “ఎలుకగాడు ఎలుకగాడు" అని మాటిమాటికీ ఎగతాళి చేసేటోళ్ళు.
ఒకరోజు ఆరుమంది అన్నదమ్ములు వేటకు బయలుదేరినారు. ఎలుకగాడు కూడా వురుక్కుంటా అన్నల దగ్గరికి పోయి "అన్నలారా! అన్నలారా! నేనూ మీ ఎంబడొస్తా. నన్ను గూడా తీస్కోని పోండి" అన్నాడు.
దానికి వాళ్ళు కిందా మీదా పడి నవ్వుతా “మేం పోతా వున్నది గోలీలాట ఆడ్డానికి కాదు. వేటకి... అడవిలో ఏనుగులుంటాయ్, పులులుంటాయ్, సింహాలుంటాయ్... వాటిని బాణంతో కొట్టాల. చంపాల. పట్టుకోవాల. నువ్వుండేదే అరటి పండంత. ఇంగ దాండ్లను చంపడం నీ చేతనే మయితాది. మట్టసంగా ఇంటికాడ పడుండు" అన్నారు.
కానీ ఆ చిన్నోనికి మాత్రం ఎట్లాగయినా సరే వాళ్ళతోబాటు అడవికి పోవాలని, వేటాడ్డం చూడాలని అనిపించింది.
దాంతో మట్టసంగా ఒక చెట్టు మీదకెక్కి వాళ్ళన్నోళ్ళు పోతా వున్నప్పుడు వాళ్ళకు తెలీకుండా ఎగిరి ఒకని గుర్రం తోకను కరుచుకున్నాడు. అడవిలోనికి పోయినాకగానీ వాళ్ళు వీన్ని చూసుకోలేదు. ఇంగ ఏం చేస్తారు. ఎంతయినా తమ్ముడు. మధ్యలో వదిలెయ్యలేరు గదా. సరేలే అనుకోని ఎంబడే తీసుకోని పోయినారు.
వాళ్ళు జంతువుల్ని వేటాడుతా వేటాడుతా అనుకోకుండా దారి తప్పిపోయినారు. తిరిగి ఎట్లా పోవాల్నో అర్ధంగాక కిందామీదా పడతా వుంటే ఒకచోట ఒక పెద్ద మేడ కనబడింది. 'ఈ అడవిలో ఎవరున్నారబ్బా' అని ఆశ్చర్యంగా లోపలికి పోయి చూస్తే ఒక ముసల్ది పదిమంది పిల్లలతో కనబడింది. వీళ్ళు ఆమెని చూసి "అవ్వా... మేము ఈ రాజ్యాన్నేలే రాజుగారి కొడుకులం. దారి తప్పిపోయినాం. చీకటి పడింది. ఈ రోజుకు ఈన్నే వుండి రేప్పొద్దున పోతాం" అన్నారు. దానికామె సరే అని అందరికీ మంచి మంచి పిండివంటలు చేసి పెట్టింది. అందరూ బాగా తిని, గుర్రాలన్నీ బయట కట్టేసి, ఒక గదిలో మంచాల మీద పడి హాయిగా గురకలు పెడతా నిద్రపోయినారు.
చిన్నోనికి అర్ధరాత్రి గుర్రాలరుస్తావుంటే మెలకువొచ్చింది. “ఎందుకబ్బా అవి అట్లా అరుస్తా వున్నాయి. ఏమయిందో ఏమో చూసొద్దామాగు" అని పోయి తలుపులు తెర్చడానికి చూస్తే ఎంత లాగినా ఒకటి గూడా తెరచుకోలేదు. ఎట్లాగబ్బా బైటికి పోవడం అని ఆలోచిస్తా వుంటే పక్కనే ఒక కిటికీ కనబడింది. వాడుండేది ఎలుకంతనే గదా దాంతో దాంట్లోంచి దూరి బైటికొచ్చి చూస్తే గదికి తాటికాయంత తాళమేసి కనబడింది.
"ఇదేందిరా నాయనా... ఇట్లా తాళమేసినారు" అని మట్టసంగా చప్పుడు కాకుండా అడుగులో అడుగేసుకుంటా ఒక్కొక్క గదే దాటుకుంటా ఆఖరికి గుర్రాలను కట్టేసిన చోటికి చేరుకున్నాడు.
అక్కడ చూస్తే గుర్రాలన్నీ చచ్చిపడున్నాయి. ఒక రాచ్చసి పదిమంది పిల్లలతో కల్సి ఒక్కొక్క గుర్రాన్నే పెరుక్కోని, పెరుక్కోని తింటా వుంది. చిన్నోడు అదిరిపడినాడు. 'ఓరి నాయనో! ఇది ముసల్ది కాదన్నమాట. పెద్ద రాచ్ఛసన్నమాట' అని కనుక్కోని వురుక్కుంటా అన్నల దగ్గరికి పోయి వాళ్ళను లేపి జరిగిందంతా చెప్పి "ఇంకాసేపుంటే అది గుర్రాలన్నీ తినేసి ఈడికి వచ్చేస్తాది" అని చెప్పినాడు.
తలుపుకు తాళం వేసినారుగదా ఎట్లాగబ్బా అని ఆలోచిస్తా వుంటే చిన్నోనికి మెరుపు లాంటి ఉపాయం వచ్చింది. వెంటనే ఎగిరి కిటికీలోంచి బైటకు దుంకి ఆ రాచ్చసి దగ్గరికి పోయినాడు. ఆమె పక్కనే తాళం చెవులు కనబన్నాయి. చీకట్లో వీడు దాచిపెట్టుకుంటా దాని దగ్గరికి పోయి మట్టసంగా తాళాలు తీసుకోని వచ్చేసినాడు. వాడు వురుక్కుంటా పోయి తాళాలు తీసి అన్నలను ఇడిపిచ్చినాడు.
వెంటనే అందరూ వురుక్కుంటా పోయి ఆడికి కొంచం దూరంలో వున్న ఒక పెద్ద తాటి చెట్టు ఎక్కి పైన దాచిపెట్టుకున్నారు. చిన్నోడు పైకెక్కలేక... క్రిందనే ఒక పొదలోనికి దూరినాడు.
గుర్రాలన్నింటినీ బాగా మెక్కిన ఆ రాచ్చసి ఇంగ వీళ్ళని గూడా తిందామని పిల్లలని వెంటేసుకోని గది దగ్గరికి పోయి చూస్తే ఇంకేముంది గదిలో ఎవరూ లేరు. ఎట్లా తప్పించుకున్నారబ్బా అని వురుక్కుంటా బైటికొచ్చి చూసింది. యాడా కనబల్లేదు. కుక్క లెక్కనే ఆ రాచ్చసి గూడా మనిషి యాడున్నా వాసన పసిగట్టేస్తాది. అది వాసన చూసుకుంటా, చూసుకుంటా తాటి చెట్టు దగ్గరకొచ్చింది. వచ్చి పైకి చూస్తే ఆరుమంది బిక్కుబిక్కుమంటా గట్టిగా కరుచుకోని కనఐన్నారు.
రాచ్చసీ, దాని పిల్లలూ ఆ చెట్టును తలోపక్కా పట్టుకోని కిందికీ మీదికీ వూపసాగినారు. చెట్టు వూగుతా వుంది గానీ వాళ్ళు మాత్రం కింద పల్లేదు. ఒకొక్కడు కోతుల్లెక్క గట్టిగా కరుచుకున్నారు. దాంతో ఇంక లాభం లేదనుకోని ఆ రాచ్చని పిల్లలతో “రేయ్! నేను కింద నిలబడతా... మీరు నా మీద ఒకని మీదొకడు, ఒకని మీదొకడు ఎక్కి వాళ్ళను పట్టుకోండి" అనింది. సరేనని వాళ్ళు ఒకని మీదొకడు, ఒకని మీదొకడు ఎక్కినారు.
కానీ వాళ్ళను అందుకోడానికి కొంచెం దూరం తక్కువయింది. ఎట్లాగబ్బా అని ఆలోచిస్తా వుంటే కింద వున్న రాచ్చసి ఒక పెద్ద దుడ్డుకర్ర ఇచ్చి “దీంతో కొట్టండి కింద పడతారు" అని చెప్పింది.
చిన్నోడు అది చూసి ఇట్లాగే ఇంకొంత సేపుంటే వాళ్ళన్నోళ్ళు చావడం ఖాయమనుకోని ఒక పెద్దముల్లు తీసుకోని చెట్టెక్కినాడు. అట్లా ఎక్కుతా ఎక్కుతా దాని మొగం దగ్గరకొచ్చినాడు. వీడుండేది చిన్నగ ఎలుకంతనే గదా, దాంతో ఆ రాచ్చసికి కనబడలేదు.
వాడు ముల్లు తీసుకోని బలమంతా వుపయోగించి దాని కంట్లో ఒక్క పోటు పొడిచినాడు. అంతే... అది గిలగిలగిల కొట్టుకుంటా దభీమని కింద పడిపోయింది. అదట్లా పడిపోవడం ఆలస్యం పిల్లలంతా గూడా దభీమని అంత పైనుంచి ఒకదాని మీదొకటి ఆ రాచ్ఛసి మీదనే పడి తలలు పగిలి అంతా చచ్చిపోయినారు.
అప్పుడు చెట్టుపై నున్న ఆరుమంది కిందకు దిగి “నిన్ను ఇన్ని రోజులూ ఎలుకగాడు ఎలుకగాడు అని ఎగతాళి చేసినాముగానీ, ఈరోజు నువ్వు లేకుంటే మేం బతికేటోళ్ళమే గాదు. ఇప్పటి నుంచీ మనమంతా ఒకటే" అంటూ సంబరంగా వాన్ని ముద్దు పెట్టుకున్నారు.
***********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి