యుద్ధం నేర్పిన గుణపాఠం! :- - బోగా పురుషోత్తం, తుంబూరు.

 కౌశాంబి రాజ్యాన్ని కౌశవేంద్రుడు అనే  పాలించేవాడు.  అతను మహా కోపిష్టి, గర్విష్టి. .  తన కోపం కారణంగా తన అనాలోచిత  నిర్ణయాలవల్ల  ప్రజలు తీవ్ర ఇబ్బందులు  ఎదుర్కొనేవారు.  తరచూ ప్రజలను  శిక్షల పేరుతో  వేధించేవాడు.  ఇది  భరించలేని ప్రజలు  రాజుపై  ఎదురు  తిరిగారు.  కౌసవేంద్రుడిని  రాజ్యం  నుంచి  భహిష్కరించారు.  అప్పటి నుంచి   కౌశవేంద్రుడు  ఒంటరిగా జీవనం సాగిస్తూ ఓ దట్టమైన అడవిలో గడుపుతుండేవాడు.
   కౌశవేంద్రుడు తన  వింత ఆలోచనలతో  అడవి జంతవులను వెంటాడి  వేటాడి తన  యుద్ధ కాంక్షను కోరికను నెరవేర్చుకునేవాడు. ఎప్పటికైనా  తాను మళ్లీ ఓ పెద్ద రాజ్యానికి రాజుని కావాలని,, తనను ద్వేషంతో రాజ్య  బహిష్కరణ చేసిన  ప్రజలపై కక్ష  తీర్చుకోవాలని  ఎదురు చూడసాగాడు. ఇందుకోసం అడవిలో  ఒక్క  జంతువునూ తిరగనివ్వకుండా సంహరించి తానే  అడవికి  రాజునని  ఉప్పొo గిపోయేవాడు. జంతువులన్ని తనకు దాసోహమయ్యాయని తాను రాజునని గర్వించేవాడు. తన  అనుమతి లేకుండా చీమకూడా  అడవిలోకి  రావడానికి  వీలులేదని ఆగ్రహించేవాడు. 
   ఓ సారి పక్క రాజ్యాధిపతి పాకాల రాజు ప్రదీపుడు తన పరివారంతో వేటకు అడవికి వెళ్లాడు. అతడిని చూసిన కౌశవేంద్రుడు కోపంతో ‘‘ ఎవరు నువ్వు.. ఇలా వస్తున్నావేమిటి?’’ అని అడ్డగించాడు.
ప్రదీపుడు ‘‘నేను పాకాల రాజుని ’’ అని చెప్పడంతో కౌశవేంద్రుడు ‘‘ కాదు.. నేనే రాజుని... నాకన్నా గొప్ప రాజు ఈ భూమిమీద మరొకడు లేడు..!’’ అని కోపోద్రిక్తుడయ్యాడు.
  దీన్ని గమనిస్తున్న రాజు పరివారం కౌశవేంద్రుడిపై దాడి చేసింది.
   కౌశవేంద్రుడు మరింత రెచ్చిపోయి తన క్రూరత్వంతో ప్రదీపుడిని సంహరించాడు.  
    ఆ తర్వాత పాకాల రాజ్యాధీశుడయ్యాడు.  అప్పటి నుండి పాకాల ప్రజలు నరకయాతన పడ్డారు. యుద్ధ పిపాసి అయిన కౌశవేంద్రుడు పాలనలో నియంతృత్వం అధికమై  తరచూ యుద్ధాలు సంభవించి  ప్రాణనష్టం జరిగి ప్రజల్లో అభద్రత ఏర్పడి భయభ్రాంతులయ్యారు.  చిన్నారులను కోల్పోయి వేదనకు గురయ్యారు. శాంతి లోపించింది. అభివృద్ధి క్షీణించింది. ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. పరరాజులు సైతం కౌశవేంద్రుడికి పాదాక్రాంతమయ్యారు. స్వేచ్ఛ కోల్పోయి బానిస బతుకులు బతికారు.
   చాలా కాలం తర్వాత ఓ పెద్ద రాజ్యం చంద్రగిరిపై కౌశవేంద్రుడు దండెత్తాడు.
   చంద్రగిరి రాజు చంద్రయ్య చాకచక్యంతో తమ బలగంతో అందరినీ కలుపుకుని కౌశవేంద్రుడిపై దండెత్తాడు.  ఈ యుద్ధంలో కౌశవేంద్రుడు తన పరాక్రమం ప్రదర్శించాడు. ఐక్యంగా దాడి చేయడంతో కౌశవేంద్రుడు ఓ కన్ను, కాలు కోల్పోయాడు. ఆ తర్వాత తన క్రూరత్వం పూర్తిగా అణిగిపోయింది.  రారాజులా బతికిన కౌశవేంద్రుడు మానవత్వం మరిచి  క్రూరత్వంతో ప్రవర్తించి  ఆపద కొని తెచ్చుకున్నాడు. పర రాజుల సైన్యం ధాటికి తప్పించుకు పారిపోయి మళ్లీ ఓ అడవిలో తలదాచుకున్నాడు.
 కొన్నాళ్ల తర్వాత కోలుకుని నెమ్మదిగా అడుగులు వేశాడు.  కన్ను లేని కారణంగా దూరంగా వెళ్లలేకపోయాడు. యుద్ధం తన జీవితాన్ని ఎలా అంధకారం చేసిందో  స్వయంగా తెలుసుకున్నాడు. తను చేసిన యుద్ధంలో తనలా ఎంతమంది వికలురుగా మారారో  ఊహించుకుని లోలోన కుమిలిపోయాడు. యుద్ధం నేర్పిన గుణపాఠాన్ని తలుచుకుంటూ ఒంటరిగా కుమిలిపోతూ  జీవించసాగాడు కౌశవేంద్రుడు.

కామెంట్‌లు