సుప్రభాత కవిత : - బృంద
దూరమెంతో తెలియని 
దారి కూడా ఎరుగని 
బరువును ఒడుపుగా 
ఇరుభుజాలకు పంచుతూ...

అడుగులకు ఉత్సాహం 
అంతరంగానికి ఆశ్వాసం 
ఆలోచనలకు అవకాశం 
అలుపుకు ఆదరణ ఇస్తూ

అరమరికలు లేని నిర్ణయం 
అల్లుకునిపోయే చొరవ 
అనితరమైన ప్రయత్నం 
అలవాటు గా చేసుకుంటూ

ఆందోళనకు తావీయక 
ఆవేశాలకు అలుసీయక 
అదుపు తప్పని కట్టుబాటుతో 
అందరినీ కలుపుకుంటూ...

అనుభూతులు పోగేసుకుంటూ 
ఆనందాలు వెదుక్కుంటూ
అమృతాలుగా మార్చుకుంటూ..
అనృతాలతో అవసరమే లేదంటూ..

అద్భుతమైన ప్రయాణాన్ని 
అంచెలంచెలుగా కొనసాగించి
అందరూ బావుండాలని 
అందరితో కలిసుండాలని

అనుకున్న మనసుకు నచ్చేలా 
వచ్చే అరుణోదయానికి 

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు