ఆకాశంలో మెరుపులా
తలలో ఆలోచనలు
ఎపుడు పుడుతాయో
ఎపుడు వెలుగుతాయో
ఆకాశవాణిలో పాటలా
గాంధర్వ గానం
ఎపుడు వినిపిస్తుందో
ఎపుడు విందునిస్తుందో
గగనంలో నీలిరంగులా
చక్కని వస్త్రము
ఎపుడు లభిస్తుందో
ఎపుడు ధరిస్తానో
నింగిలో మబ్బుల్లా
మనసులో భావాలు
ఎపుడు కూడుతాయో
ఎపుడు కవితారూపందాల్చుతాయో
నభంలో హరివిల్లులా
హృదయంలో అందచందాలు
ఎపుడు దర్శనమిస్తాయో
ఎపుడు పరవశపరుస్తాయో
ఆకసంలో సూర్యునిలా
గుండెలో కిరణాలు
ఎపుడు ప్రసరిస్తాయో
ఎపుడు ప్రభవిస్తాయో
మింటిలో జాబిలిలా
కంటిలో కాంతిలా
ఎపుడు వెన్నెలవెదజల్లుతుందో
ఎపుడు ఉల్లముత్సాహపడుతుందో
అంబరవీధిలో తారకల్లా
కాగితాలపై అక్షరాలు
ఎపుడు కూర్చుంటాయో
ఎపుడు అల్లుకుంటాయో
అంతరిక్షంలోని నౌకలా
పదాల సమూహాలు
ఎపుడు ఆవిర్భవిస్తాయో
ఎపుడు పైకెగురుతాయో
మిన్నులో చినుకుల్లా
సెలయేటి పరుగుల్లా
ఎపుడు కవితలుకూర్చబడతాయో
ఎపుడు ప్రవహించుతాయో
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి