ఒక ఊరిలో ఒక రాజు వుండేవాడు. అతను చాలా మంచోడు. జనాలను సొంత బిడ్డల్లా చూసుకునేటోడు. ఎవరికి ఏ ఆపద వచ్చినా నిమిషాల్లో ఆదుకునేవాడు. చిన్నా పెద్దా, ధనికా పేదా, ఆడామగా తేడా లేకుండా అందరినీ సమానంగా చూసేవాడు. జనాలు గూడా అతన్ని దేవునిలెక్క కొలిచేవారు. అలాంటి రాజుకు ఒకే ఒక చెడ్డ అలవాటు వుంది. అది తిండి యావ. ఒకరోజు తినింది మరొకరోజు తినేవాడు కాదు. దేశ విదేశాలలో వున్న రకరకాల వంటకాలన్నీ తెప్పించుకొని పూటకో రకం ఆవురావురుమని లాగించేసేవాడు. అతను రుచి చూడని కూర లేదు. తాగని పానీయం లేదు. కొరకని పండు లేదు. తినని వంట లేదు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు ఒక వందమంది వంటవాళ్ళు దేశదేశాలు తిరుగుతా, రకరకాల వంటల గురించి తెలుసుకుంటా రాజును చక్కని రుచులతో మెప్పించేవాళ్ళు. బహుమతులు పొందేవాళ్ళు. అలా చాలాకాలం రాజుకు మూడు తినుబండారాలు, ఆరు పానీయాలు అన్నట్టు కాలం హాయిగా గడిచిపోయింది.
కానీ లోకంలో కొత్త కొత్త వంటలు ఎన్నని వుంటాయి. పూటకో రకం వంట అంటే చేయడం సులభం కాదుగదా... రాజు దాదాపు అన్ని రకాల రుచులూ చూసేశాడు. దాంతో వంటవాళ్ళు ఇక కొత్త వంటలు చేయలేక చేతులెత్తేశారు. గరిటలు దించేశారు. దాంతో రాజు చివరిసారిగా ఇంతవరకూ తినని ఒక కమ్మని వంట తిని ఈ తిండియావకు ముగింపు పలకాలి అనుకున్నాడు.
దాంతో రాజు "నా జీవితంలో ఎప్పుడూ తినని ఒక కొత్త వంట ఎవరైతే చేసి పెడతారో వాళ్ళకి పదివేల బంగారు వరహాలు బహుమానం" అంటూ దేశమంతా దండోరా వేయించాడు.
పదివేల బంగారు వరహాలంటే మాటలు కాదు కదా... జీవితాంతం కాలు మీద కాలేసుకొని హాయిగా బతికేయవచ్చు. దాంతో దేశదేశాల నుంచి పేరు మోసిన వంటగాళ్ళంతా రావడం మొదలు పెట్టారు. ఎంతో ఖరీదయిన వంటకాలు వండి పెట్టసాగారు. కానీ రాజు దేనిని రుచి చూసినా “ఓస్ ఇదా... దీన్ని ఎప్పుడో తిన్నా" అంటూ ఆ వంట పేరు చెప్పేసేవాడు.
నెల రోజులు తిరిగే సరికి “ఇంక ఈ భూమ్మీద ఈ రాజుకు తెలియని వంట చేయడం ఎవరి తరమూ గాదు” అనుకుంటూ వచ్చిన వంటవాళ్ళంతా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. దాంతో రాజుకు విచారం
పెరిగిపోయింది. ఎప్పుడూ అదే ఆలోచన. తీరని కోరికతో జబ్బు పడ్డాడు. ముఖం పీక్కుపోయింది. జీవకళ తగ్గిపోయింది. గడ్డం పెరిగిపోసాగింది. బట్టలు వదులు కాసాగాయి. మంచం మీద నుంచి లేవలేకపోతున్నాడు.
ఇలాగే ఇంకో పది రోజులుంటే రాజు మనకు దక్కడం అనుమానమే. ఇంత మంచోడు, జనాలను కన్నబిడ్డల్లా చూసుకునేటోడు భూమిలో కలిసిపోతున్నాడే... గోడ మీద బొమ్మ కాబోతున్నాడే అని దేశమంతా కన్నీళ్ళు పెట్టుకోసాగింది.
ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి ఊరి చివర చిన్న పాకలో వుండే ఒక ఎనభై ఏళ్ళ అవ్వకు చేరింది. ఎలాగైనా రాజుని బతికించుకోవాలని తెగ ఆలోచించింది. చివరికి ఒక ఉపాయం తోచింది. పెదవులపై చిరునవ్వు మెరిసింది. కొంగు బిగించి కోటకు బైలుదేరింది.
అందరూ ఆ అవ్వని చూసి “ఒసే ముసలిదానా! పెద్దపెద్ద చేయి తిరిగిన వంటగాళ్ళకు, దేశవిదేశాలలో పేరు మోసిన వంటగత్తెలకే చేత కాలేదు రాజుని మెప్పించడం. అలాంటిది నీతో ఏమవుతుంది. బంగారు నాణేల మీద ఆశపడి పరుగెత్తుకుంటా వచ్చినట్టున్నావు. ఫో... ఫో... ఇక్కన్నుంచి” అన్నారు.
ఆ ముసలామె బోసినోటితో చిరునవ్వు నవ్వి “నాకెందుకు నాయనా ఈ ముసలి వయసున ఆ బంగారు వరహాలు. చచ్చాక పాడె మీద పరుపులా పరిపించుకుంటానా. గుంతలో నిండుగా పోషించుకుంటానా. మా రాజు మంచోడు. జనాలంతా మెచ్చినోడు. అందరి గుండెల్లో నిలిచినోడు. కలకాలం భూమ్మీద పచ్చని చెట్టులా వెలిగిపోతా పేదవాళ్ళకు నీడనిచ్చి కాపాడవలసినవాడు. కళ్ళ ముందే కోరిక తీరక కాటికెళ్ళి పోతావుంటే ఎలా తట్టుకునేది. అందుకే వురుక్కుంటా వచ్చా" అనింది.
ఆ మాటలు విన్న మహారాణి "ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు. ఆమె పని ఆమెను చేయనివ్వండి" అంది.
అవ్వ నాలుగు ఉల్లిగడ్డలు తెచ్చింది. కమ్మని వాసన వచ్చేదాకా ఎర్రని నిప్పుల మీద వేసి అటూ యిటూ తిప్పింది. వేరుశెనగ బుడ్డలు పెనం మీద ఒకటి కూడా నల్లబడకుండా దోరగా వేయించింది. వాటికి పచ్చి మిరపకాయలు, పచ్చి టమోటాలు కలిపి రోటిలో వేసింది. చింతపండు, జిలకర, ఒక చిన్న బెల్లంముక్క, తగినంత ఉప్పు కలిపి బాగా మెత్తగా దంచింది. వేలితో కొంచెం తీసి నాలిక మీద వేసుకొని చప్పరించింది. చిరునవ్వుతో గిన్నెలోకి నున్నగా ఎత్తింది.
అన్నంగిన్నె తెచ్చి సగందాకా నీళ్ళు పోసి కట్టెలపొయ్యి మీదికి ఎక్కించింది. బాగా మరిగినాక అరగంట నానబెట్టిన బియ్యాన్ని అందులో పోసింది. అన్నం మెతుకులు బాగా ఉడికినాక రెండింతల రాగిపిండిని కొంచెం కొంచెంగా పోసి... ఉంటలు కట్టకుండా బాగా కలిపి ఉడకబెట్టింది. చేతికి వెన్న పూసుకొని రాగిముద్దలు తయారు చేసింది.
ఒక పళ్ళెంలో రెండు వేడి వేడి రాగిముద్దలు, రోటి పచ్చడి, కమ్మని నెయ్యి పోసి రాజు ముందు పెట్టింది. అందరూ అది చూసి లోపల్లోపల నవ్వుకోసాగారు.
రాజు దానికేసి వింతగా చూశాడు. అలాంటి వంట జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అదే మొదటిసారి. తిందామా వద్దా అని అనుమానపడుతూనే నెయ్యి వేసిన రాగిముద్దను కొంచెం రోటిపచ్చడితో కలిపి నోటిలో పెట్టాడు.
కారంకారంగా, పుల్లపుల్లగా, తీయ తీయగా, వేడివేడిగా గొంతులోంచి నెమ్మదిగా జారింది. ఆ కమ్మని రుచికి రాజు మొగం ఒక్కసారిగా వంద చందమామల వెలుగులు విరజిమ్మింది.
“ఆహా... అమోఘం... అపురూపం... నా జీవితంలో ఇలాంటి వంట తినడం ఇదే మొదటిసారి" అంటూ ఆనందంతో గట్టిగా అరిచాడు.
ముద్ద మీద ముద్ద... వరుసగా కడుపు నిండా కమ్మగా చిరునవ్వుతో లాగించేశాడు. అది చూసి అందరూ సంబరపడ్డారు. ఆనందంతో అవ్వను గాలిలోకి ఎత్తి చిందులు తొక్కారు.
రాణి పరుగు పరుగున వచ్చి మంచం మీద నుండి లేచి సంబరంగా తిరుగుతున్న మొగున్ని చూసింది. ఆనందంతో అవ్వ దగ్గరికి వెళ్ళి “అవ్వా... దేశదేశాల్లో ఎవరికీ రాని ఆలోచన నీకెలా వచ్చింది" అంది.
అవ్వ చిరునవ్వు నవ్వి “చూడు తల్లీ మీది రాజవంశం. ఖరీదైన వంటలే తప్ప పేదవాళ్ళు తినే వంటలు ఎంత రుచిగా వున్నా అంతఃపురంలోకి అడుగు పెట్టలేవు. వచ్చిన వాళ్ళందరూ ఎక్కడా దొరకని రకరకాల కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలు తెచ్చి ఎంతో విలువైన వంటలు చేసి పెడతారే తప్ప పల్లె రుచుల గడప తొక్కరు. అందుకే ఆ నమ్మకంతోనే రాజు ఎప్పుడూ రుచి చూసి వుండడని తలంచి ఆ వంట చేసి పెట్టా" అంది.
రాణి సంబరంగా అవ్వను గట్టిగా ముద్దు పెట్టుకొంది. మెడలోని ఖరీదైన రతనాల హారాన్ని తీసి ఆమె మెడలో వేసింది.
**********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి