బుడతలు నడయాడే ఇళ్ళు : -ఐలేని గిరి
వాడు మూరెడు లేడు 
ఎన్ని బుద్ధులో, ఎన్ని సుద్దులో
ఎన్ని ఛాయలో ఎన్ని మాయలో

వాని కళ్ళ చక్రాలచుట్టూ
ఇంటిని తిప్పుకుంటాడు
వాని పెదాల నవ్వు పై
అయస్కాంతం పులుముకుంటాడు

వాడు లేచినప్పుడే 
వెలుగు ఇంట్లోకి వచ్చేది
వాడు నడిచినపుడే 
నేల స్పృహలోకి వచ్చేది

వాడి అరచేతులతో
గోడలు పిడకలాట ఆడతాయి
వాడి కిళుక్కు నవ్వుతో గాలి
పిల్లనగ్రోవి మీటుతుంది

వాడు చేతులు చాస్తే 
పట్టుకోవాలని దిక్కులకు ఆరాటం
వాడు చూస్తే కరిగి పోవాలని
మనసుమంచుకు ఉబలాటం
                  *  *
బుడతలు నడయాడే ఇళ్ళు 
పరుగులు తీసే గడియారపు ముళ్ళు
              &&&. &&&

కామెంట్‌లు