కవితోదయం :- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఈ ఉదయం
నా హృదయం
ఊగిసలాటమీద పడింది

నల్లగా కనపడుదామా
నీలంగా అగుపిద్దామా అని
ఆకాశం ఊగిసలాడుతుంది

చినుకులు రాలుద్దామా
జోరువాన కురిపిద్దామా అని
మేఘాలు ఊగిసలాడుతున్నాయి

వేగంగా వీద్దామా
మెల్లగా కదులుదామా అని
గాలి ఊగిసలాడుతుంది

కొమ్మలను కదిలిద్దామా
గమ్ముగా ఉండిపోదామా అని
చెట్లు ఊగిసలాడుతున్నాయి

గూటిలో ఉందామా
గాలిలో ఎగురుదామా అని
పక్షులు ఊగిసలాదుతున్నాయి

ఎరుపుగా వెలుగుదామా
తెల్లగా ప్రకాశించుదామా అని
సూర్యుడు ఊగిసలాడుతున్నాడు

ఆనందంగా ఆడుదామా
శ్రావ్యంగా పాడుదామా అని
మది ఊగిసలాడుతున్నది

మాటలు వదులుదామా
మూతిని బిగిద్దామా అని
నోరు ఊగిసలాడుతున్నది

కవితను కూర్చుదామా
గేయాన్ని వ్రాద్దామా అని
మనసు ఊగిసలాడుతున్నది

ప్రణయగీతం పాడుదామా
ప్రభోధగేయం ఆలపిద్దామా అని
ఉల్లము ఊగిసలాడుతున్నది

పాటను విందామా
కైతను చదువుదామా అని
పాఠకులు ఊగిసలాడుతున్నారు

కవితోదయం అయ్యింది
శుభోదయం చెప్పింది
ఊగిసలాట ముగిసింది


కామెంట్‌లు