దోపిడి పీడనలేని సమసమాజం కోసం (ఆశావాహులమై):-అంకాల సోమయ్య-దేవరుప్పుల- జనగామ-9640748497
కనులారా చూడు 
ఇది మోసకారులున్న
ముదనష్టపు కాలం
ఆకలి నిత్య దారిద్ర్యం
విలయతాండవం చేసే
స్వార్థంపరులకాలం
దోపిడి దీనినైజం

కూడు గూడు గుడ్డ విద్య వైద్యం
ఎవనికందుతుందిగనుక
మొదటి ప్రాథమిక అవసరమే
అందరికీ దక్కని
అన్నపూర్ణ దేశం మనది

అయినా అన్నదాతల ఆత్మహత్యలెందుకో!?

పనిపాటలేక పూటగడవక
నిత్యం పస్తులతో
కోరిచావును తెచ్చుకునే రేపటి తరం!?

ప్రతీ ఐదేళ్లకొకసారి
ఎన్నికల జాతర

మద్యం మత్తు 
కరెన్సీ కట్టల గమ్మత్తు

నోటుకు నాటుకు ఓటమ్ముకొని
అభివృద్ధికి అడ్డంపడ్డనిస్సహాయత

ఎన్నికల మ్యానిఫెస్టోలో
ఎన్నెన్నో వండివార్చిన
ఉచిత సంక్షేమ పథకాలు
కుడిచేత్తో డబ్బిచ్చి
ఎడమచేత్తో
ఎగరేసుకెళ్ళే
రాకాసి గ్రద్దలు...

ఆకలితో ప్రేగులు ఆర్తనాదాలు
చేయగా
బీదసాదలు
పీడితులు, తాడితులు
మంచితనంతో నిండా ముంచే నయవంచకులను తుదముట్టించేదెపుడో?!

ప్రజల సొమ్మును పందికొక్కుల్లామెక్కే
దుర్మార్గులను ప్రజాక్షేత్రంనుండి
తరిమి తరిమి కొట్టేదెన్నడో?!

దోపిడి ,దౌర్జన్యం నుండి 
విముక్తెన్నడో!?

నిత్యం ఏమార్చు 
కుసమాజం నుండి 
ఏ పీడన ,వంచనలేని
సమసమాజ స్థాపన దిశగా అడుగులేసేదెపుడో!?

మానవీయ విలువలను పాదుకొల్పేదెన్నడో!?

అరమరికలులేని
మానవ సంబంధాలే సామాజిక చైతన్యానికి ప్రతీక అని నినదిద్దాం

రేపటి ఆశలతొలిప్రొద్దుకై
ఆశావహులమై 
ఎదిరిచూద్దాం!
సర్వేజనా సుఖినోభవంతు!
సర్వేసుజనా సుఖినోభవంతు!!


కామెంట్‌లు