సుప్రభాత కవిత : - బృంద
ఉప్పును తానుంచుకుని 
మంచినీటిని నింగికిచ్చి 
ఎగసి మురిసిపోయే 
సాగరానిదెంత  ప్రేమ!

నింగి చేరిన ఆవిరిని 
పట్టి మబ్బులోన 
పదిలంగా దాచే 
గగనానిదెంత  ప్రేమ!

కొండ కోనల జాలువారి 
కోటి మెలికల దారి సాగి 
కడలి చేరి తన ఉనికినే 
కోలుపోయే నదిదెంత  ప్రేమ!

వేసవి తాపాన రగిలిన
నేలతల్లిని ఉపశమింప 
చుక్క దాచుకోక మొత్తం 
ధారపొసే మబ్బుదెంత ప్రేమ!

చినుకు తడిపిన నేలనాటిన 
విత్తులన్నీ మొలకలెత్తి 
సత్తువంతా పంటగా మార్చి 
కరువు లేక కాపాడే నేలదెంత ప్రేమ!

బ్రతుకు నిలిపే ప్రాణశక్తి 
జగతిలోని జీవులకు 
తరిగిపోని గనిలాగా 
తవ్విపొసే గాలిదెంత ప్రేమ!

పంచభూతముల 
సంయమనంతో కలిపి 
సృష్టినంత కాపాడే 
సూర్య నారాయణునిదెంత ప్రేమ!

చిన్న సాయమే కాదు 
మంచి మాట కూడా 
పరులకోసం పలకని 
నరునికి కూడా వనరులిచ్చే

ప్రకృతి మాతకు 

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు