బుల్లెట్ కన్న, బాలెట్ మిన్న

 ఓటు ఎంతో పవిత్రమైనదని, ఓటుహక్కు వినియోగం మహాయజ్ఞం వంటిదని, బుల్లెట్ కన్న బాలెట్ మహా శక్తివంతమైనదని జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కుద్దిగాం ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. స్వచ్ఛంద బోధకురాలు పత్రి మంగాదేవి మాట్లాడుతూ మన సువిశాల స్వతంత్ర భారతదేశ సత్ఫలితాలకు ప్రజాస్వామ్య నేపథ్యమే ప్రధాన కారణమని అన్నారు. స్థానిక అంగన్వాడీ కార్యకర్త బోడసింగి స్వాతి మాట్లాడుతూ ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా ఓటువేసినచో, స్వచ్ఛమైన పరిపాలనకు నాంది పలికినట్లౌతుందని అన్నారు. అంగన్వాడీ కేంద్ర సహాయకులు దాసరి సాయిలీల, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు కరిమి ముద్దులమ్మ, స్థానిక పౌరులు రామినేని రమణ, బెజ్జివరపు స్వాతి, మేడిపల్లి మాధవి, ఎం.శకుంతల, పర్రి భవాని తదితరులు పాల్గొన్నారు. తొలుత తిరుమలరావు అందరిచే ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ గావించారు. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మనదేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని, మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతిఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము అంటూ అందరూ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా తిరుమలరావు ఓటు విలువ చాటే స్వీయగీతాలను ఆలపించి చైతన్యపర్చారు. అనంతరం మిఠాయి పంపకం జరిగింది.
కామెంట్‌లు