సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయములు -744
సర్వం ఖలస్య చరితం మశకః కరోతి న్యాయము
*****
సర్వం అనగా మొత్తము సమస్తము అంతయూ.ఖల అనగా కళ్ళము, భూమి,నేల, ప్రదేశము, దుమ్ము,కుప్ప, నూనె, అడుగుమడి,నీచుడు,దుష్టుడు.ఖలస్య అనగా దుష్టుడిచేత.చరితం అనగా తిరుగుట, చరిత్ర,నడవడిక.మశక అనగా దోమ.కరోతి అనగా ఏది చేస్తుంది/తెస్తుంది అని అర్థము.
దుష్టుడు ఏదైతే చేస్తాడో అదంతా దోమ చేస్తుంది.అనగా దుష్టుడు చేసే హానీ ,కీడు, ఇతరులను బాధించడం మొదలైనవన్నీ కూడా దోమ  చేస్తుందని  అర్థము.
అందుకే దోమను దుష్టుడితోనూ, దుష్టుడిని దోమతోనూ పోల్చి దుష్టుడు చేసే దుర్మార్గపు పనులన్నీ దోమ చేస్తుందనీ.దోమ చేసే హానికరమైన పనులన్నీ దుష్టుడు చేస్తాడనీ " అంటుంటారు మన పెద్దలు.కారణం దోమ హానికరమైనదే, దుష్టుడు హానికరమైన వాడే.
ఎందుకు? ఎలా? అనే ప్రశ్నలకు ముందు దోమ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
రక్తాన్ని పీల్చి చాలా వ్యాధులకు కారణమయ్యే కీటకం దోమ.ప్రపంచంలోనే అత్యంత హానికరమైన, ప్రాణాంతకమైన వైరల్ వ్యాధులను దోమ కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.దీని దేహంలో తల, వక్షం,ఉదరం అనే మూడు భాగాలుంటాయి.మధ్య వక్షానికి ఒక జత రెక్కలు ఉంటాయి.ఆడ దోమకు గుచ్చి పీల్చే రకమైన ముఖ భాగం తొండం వలె ఉంటుంది.
ఈ దోమ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది.పైగా దీని ఆహారం మనిషి రక్తమే.మనుషుల రక్తం తాగి బ్రతుకుతుంది.అంతటితో ఆగిపోతే బాగుండు.కానీ అది రక్తం పీల్చేటప్పుడు మన శరీరంలోకి కొన్ని క్రిములను కూడా పంపుతుంది.ఆ క్రిముల వల్ల ఎన్నో రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా , మెదడు వాపు, చికెన్ గునియా... ఇలాంటివి ఎన్నో రకాల జబ్బులు  కలిగిస్తూ దోమ మానవులకు తీవ్రమైన హాని కలిగిస్తోంది.
ఇక దీనిని ఎంత తరిమికొట్టినా పోదు. చెవుల దగ్గర దాని రొద వినడానికే చాలా భయంకరంగా వుంటుంది.అది మనిషిని కుట్టేంత వరకూ అలా చప్పుడు చేస్తూనే వుంటుంది .
ఇక దుష్టుడు ఏం చేస్తాడో మనందరికీ తెలిసిందే.
"కలనైన సత్యంబు బలుకనొల్లని వాడు/మాయమాటల సొమ్ము దీయు వాడు /కుల గర్వమున పేద కొంపలార్చెడివాడు/లంచములకు వెల బెంచువాడు/ చెడు ప్రవర్తనలందు జెలగి తిరుగువాడు /వరుసవావికి నీళ్లు వదులువాడు/ముచ్చటలాడుచు కొంపముంచ జూ చెడివాడు /కన్నవారల రెంటు చున్నవాడు/తే.గీ.పుడమిలో నరరూపుడై పుట్టియున్న/ రాక్షసుడు గాక వేరౌన రామచంద్ర /కృప నిధీ ధర నాగరకుంట పౌరి/ వేణుగోపాలకృష్ణ మద్వేల్పు శౌరి!"...అని కవి రాసిన ఈ పద్యంలో  నరరూప రాక్షసుడైన దుష్టుడు ఎలా ప్రవర్తిస్తాడో చెప్పడం జరిగింది.
అలాంటి దుష్టుడికి అటూ ఇటూగా దోమ కూడా అలాంటి హానినే చేస్తుంది. దుష్టుడు  పాపపు పనిని ఒక పట్టాన వదలడు.అలాగే దోమ కూడా. దుష్టుడి బారిన పడితే  ఏవిధంగా అయితే ఆర్థికంగా,  శారీరక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటామో  దోమ బారిన పడితే కూడా శారీరక,మానసిక, ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.అందుకేనేమో మన పెద్దవాళ్ళు దోమనూ,దుష్టుడిని ఒకే గాటన కట్టారు.
దోమ దుష్టుని కన్నా వందల వేల రెట్లు చిన్నదైనా దుష్టుడు చేసే పనులన్నీ చేసి ప్రాణాంతకమై దుష్టునిగా పేరు తెచ్చుకుంది.
అందుకే "సర్వం ఖలస్య చరితం మశకః కరోతి" అని ఏకంగా దోమ దుర్మార్గపు చేష్టలను గురించి ఒక న్యాయమే సృష్టించారు.
 కాబట్టి దోమ లాంటి మనిషి కనబడ్డప్పుడు,దోమవల్ల మనిషి ఇబ్బంది పడినప్పుడు ఈ న్యాయమును తిరగేసి,మరగేసి చెప్పుకోవచ్చు.దోమ బారి నుంచి తప్పించుకోవడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి కానీ.దుష్టుడి నుండి తప్పించుకోవడమే కొంచెం కష్టమైన పని.ఎందుకంటే మనిషి ముఖం మీద దుష్టుడు అని ప్రత్యేకంగా రాసి ఉండదు కదా! అందుకే మరి చాలా జాగ్రత్తగా ఉండాలి.

కామెంట్‌లు