నంద భాషితం :- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -741
స్వప్రకాశాశ్రయ న్యాయము
*****
స్వ అంటే తాను, ధనము.ప్రకాశా అంటే ప్రకాశించింది,స్పష్టమగు, అగపడు, వెలుగు, సూర్య ప్రకాశము,కీర్తి అనే అర్థాలు ఉన్నాయి.ఆశ్రయ అంటే ప్రాపు,బలవంతుని ఆశ్రయించుట, ఇల్లు, విశ్రాంతి స్థానము, ఆధారము,శరణాలయము,సాహాయ్యము, సంబంధము,సమీపము అనే అర్థాలు ఉన్నాయి.
వెలుతురుకు తదాశ్రయమునకు భేదము లేనట్లు, సూర్యుని ప్రకాశమునకును, సూర్యునకును భేదము యిసుమంతయు లేదు.కాని ప్రకాశముచే మనము సూర్యుని గుర్తించుచున్నాము.సూర్యజ్ఞానమునకు ప్రకాశము సాధన మవుచున్నది.
 అంటే  మనిషి లేదా వ్యక్తి  యొక్క కీర్తి ప్రతిష్టలు, మంచి చెడులు ఫలానా అని  రూపం లేకుండా వ్యక్తి అనే ఎరుకకు ఆశ్రయము అవుతాయి. వాటిని నిర్ధిష్టమైన రూపంగా చూడలేక పోయినా అతని గుణగణాలచే ఫలానా వ్యక్తి అని గుర్తిస్తున్నాం.దీనిలో వ్యాపించిన వ్యక్తి  యొక్క మంచి చెడులు నిర్గుణ ,నిరాకారం అన్న మాట.ఇవి అలా అలా వ్యాపిస్తాయి కానీ మనిషి కనబడడు.
అలాగే మంచి,చెడులకు సంబంధించి  వ్యక్తి ఫలానా రూపంలో కనిపించడమనేది సగుణ రూపం అన్నమాట.
 ఈ విధంగా సూర్యుడి యొక్క కాంతి నిర్గుణ నిరాకార రూపం.ఆ కాంతి యొక్క వెలుగు వేడిని అనుభూతిస్తాం కానీ ఒక రూపంగా చూడలేము.అనగా వాయువులా అన్నమాట.వాయువు నిర్గుణ నిరాకార రూపంలో వుంటుంది కదా!
ఇక సగుణ రూపం అంటే కంటికి కనిపించే రూపం.ఆకాశంలో సూర్యుడు సగుణ రూపంలో కనిపిస్తాడు.
ఇలా సగుణ, నిర్గుణ రూపాలని రెండు రకాలు వున్నాయి.ఆధ్యాత్మిక వాదులు ఏమంటారంటే భగవంతుడు లేదా దైవం వివిధ రూపాల్లో కనిపించినప్పుడు తాను ఒకానొక రూపానికి పరిమితమైనట్లు సగుణ రూపంలో కనిపిస్తాడు కానీ ఆ దైవశక్తి వునికి అపరిమితమైనది మరియు సర్వవ్యాప్తమైనది, నిరాకారమైనదని చెబుతారు.
 దేవుడు ప్రతి దానిలో వున్నాడని చెబుతూ స్వచ్ఛమైన దైవశక్తి విశ్వంలోని  సజీవ చేతనా శక్తియే అంటారు .ఈ శక్తినే పరమాత్మ అని పిలుస్తారు.
ఇలా పరమాత్మ అనే శక్తి ప్రతి చోటా, ప్రతి చేతనా ప్రపంచంలో అనగా విశ్వమంతటా ప్రతి స్థాయిలోనూ వ్యాపించి ఒకేలా వుంటుందని" కథా ఉపనిషత్తులో చెప్పబడింది.
 ఈ సగుణ నిర్గుణ రూపాలు గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. సగుణ నిర్గుణ అంటే ఏమిటి ?వాటి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అనేది అర్థం చేయించడానికి  యోగ సాధకులు చెప్పిన కొన్ని ఉదాహరణలను చూద్దాం.
సముద్రము నుండి తీసిన నీటి  బిందువు సముద్రంలోని భాగమే అయినా దానిని సముద్రం అనం నీటి బిందువనే అంటాం.
అలా పైకి ఎగిసిన నీటి బిందువుల  సమూహం గాలిలో  వేలాడుతూ వున్నప్పుడు దానిని పొగమంచు అనీ,అలాగే ఆకాశంలోకి చేరినప్పుడు మేఘాలు అని పిలుస్తాం.ఆ మేఘాలే నేలపై బొట్లు బొట్లుగా కురిసేటప్పుడు వాన/ వర్షం అంటాం. ఇలా నీటి బిందువు తన స్వరూపాన్ని రకరకాలుగా మార్చుకున్నా దాని యొక్క మూలం సముద్రమే.
సముద్రము అనేది ఇక్కడ  సర్వ వ్యాప్తమైన దైవ శక్తిగా యోగ సాధకులచే చెప్పబడింది.
ఇలా భక్తులు, సాధకులు భగవంతుని రెండు రూపాలుగా కొలుస్తారు.కొందరికి సగుణ భక్తి వుంటుంది. సగుణ అంటే గుణాలతో నిర్థిష్టమైన రూపంలో అని అర్థం.వారు ఇష్ట దైవాన్ని దృశ్య రూపంలో కొలుస్తారు.కృష్ణుడు, రాముడు, జీసస్ ... ఇలా మరే ఇతర దేవతైనా కావచ్చు.
ఇక నిర్గుణ అంటే గుణాలు లేనిది అని మనకు తెలుసు కదా!. అలా భగవంతుడు సంపూర్ణ ఆత్మగా, స్వచ్ఛమైన స్పృహగా ఎటువంటి పేరూ,రూపం  కలిగి లేడనే అర్థంతో నిర్గుణ అనే మాట చెప్పబడింది.
శ్రీమద్భాగవతంలో ఉద్దవుడికి శ్రీకృష్ణుడు నిర్గుణ భక్తి గురించి ఏమని వివరించాడో చూద్దాం.
"సాత్త్వికీ ఆధ్యాత్మికీ శ్రద్ధ కర్మ శ్రద్ధా తు రాజసి తమసి అధర్మే యా శ్రద్ధా మత్ సేవతుయాం" అంటే ఆధ్యాత్మిక జీవితం పట్ల నిర్దేశించబడిన విశ్వాసం మంచితనంలో వుంటుంది.ఫలవంతమైన పనిలో, పాతుకుపోయిన విశ్వాసం అభిరుచిలో వుంటుంది. అధర్మమైన కార్యకలాపాలలో  నివసించే విశ్వాసం అజ్ఞానంలో వుంటుంది.కానీ నా భక్తి సేవపై విశ్వాసం పూర్తిగా అతీంద్రియమైనది అనగా నిర్గణమైనది"అంటాడు.
 పై విధంగా "స్వప్రకాశాశ్రయ న్యాయము"ను మన పెద్దలు,యోగ సాధకులు, ఆధ్యాత్మిక వాదులు ఇలా రెండు రకాలుగా నిర్వచించారు.
మన రూపం కంటే ముందు  మన గుణగణాలు, ప్రతిభా విశేషాలు, కీర్తి ప్రతిష్టలు నిర్గుణ రూపంలో సమాజంలో వ్యాపిస్తాయి.కాబట్టి  మంచి  ఆశయాలు, మానవీయ విలువలతో సగుణ రూపంలో  వాటికి నిలువెత్తు నిదర్శనంగా ఉండాలి.అప్పుడే వానిని  ఆశ్రయించుకొన్న మన ఉనికి తెలుస్తుందని ఈ "స్వప్రకాశాశ్రయ న్యాయము"ద్వారా మనం గ్రహించాల్సిన ముఖ్య విషయము.

కామెంట్‌లు