అడవిలో కుందేలు ఒక చెప్పుల అంగడి పెట్టింది. నెల రోజులు దాటినా ఒక్క జంతువు కూడా కొనడానికి రాలేదు.
కొనమని వాటిని అడిగితే "మాకెందుకు చెప్పులు. సర్రున మండే ఎండలైనా, కసుక్కున దిగే ముల్లులైనా మమ్మల్ని ఏమీ చేయలేవు. చెప్పులు లేకుండానే పుట్టినాం. చెప్పులు లేకుండానే పెరిగినాం. చెప్పులు లేకుండానే సస్తాం. అనవసరంగా ఎందుకు డబ్బులు దండగ" అనసాగాయి.
కుందేలుకు అంగడి బాడుగకు సరిపోయేంత డబ్బు కూడా రావడం లేదు. ఒకరోజు నక్కమామ అక్కడికి వచ్చింది. అది చానా తెలివైనది. వ్యాపారం అస్సలు జరగడం లేదన్న విషయం తెలుసుకొని "చూడు అల్లుడూ... నాకో వంద రూపాయలు గనుక కొడితే... చేతిలో పావలా పెట్టి జేబులో పది రూపాయలు కొట్టేసే మంచి ఉపాయం ఒకటి చెబుతా" అంది.
కుందేలు సరే అని వంద రూపాయలు ఇవ్వగానే దాని చెవిలో ఏం చేయాలో వివరించి చెప్పింది.
తర్వాత రోజు కుందేలు అడవిలో ఇంటింటికి వెళ్లి "మా చెప్పుల గొప్పతనం గురించి తెలియడానికి మా కంపెనీ వాళ్ళు అడవిలో అందరికీ ఉచితంగా ఇస్తున్నారు. తీసుకోండి. వేసుకోండి" అంటూ అందరికీ చెప్పులు పంచసాగింది.
'ఉచితంగా వస్తున్నాయి కదా' అని జంతువులన్నీ వాటిని తీసుకున్నాయి. నెమ్మదిగా చెప్పులు వేసుకుని తిరగడం మొదలుపెట్టాయి. ఇంతకుముందులా కాళ్లలోకి ముల్లులు దిగడం లేదు. ఎండకు సుర్రుమనడం లేదు. బురద అంటుకోవడం లేదు.
ఆరు నెలలు గడిచేసరికి వాటి కాళ్లు మెత్తగా తయారయ్యాయి. చెప్పులు లేకుండా అడుగు బయటికి వేస్తే చాలు సుర్రుమని కాళ్ళు కాలి బొబ్బలెక్కసాగాయి. చిన్న చిన్న రాళ్లు ముల్లులు గుచ్చుకొని అరికాళ్ళు మంటలెక్క సాగాయి. దాంతో చెప్పులు లేకుండా ఒక్క అడుగు కూడా బయటికి వేయడం మానుకున్నాయి.
మరో మూడు నెలలు దాటేసరికి నెమ్మదిగా ఒకొక్కదాని చెప్పుల తాళ్లు తెగిపోసాగాయి. కింద అరిగిపోసాగాయి.
దాంతో అప్పటికే చెప్పుల కోసం అలవాటు పడ్డ ఆ జంతువులు కొత్త చెప్పుల కోసం కుందేలు దగ్గరికి రావడం మొదలుపెట్టాయి. వ్యాపారం నెమ్మదిగా పుంజుకోసాగింది. కుందేలు ఇదే సందనుకొని రెండింతల ధరకు అమ్మసాగింది. అప్పటికే అవి చెప్పులకు అలవాటయ్యాయి కదా... దాంతో ఎంత ధర అయినా సరే కిమ్మనకుండా ఇవ్వడం మొదలుపెట్టాయి.
దాంతో కుందేలు సంతోషంగా నక్క దగ్గరికి వెళ్లి "గురువా... నీవు చెప్పింది నిజమే. గింజలు చూపించకుండా పిట్టను పట్టలేం. మీ దయవల్ల మూడు పువ్వులు ఆరు కాయలు లాగా వ్యాపారం జరుగుతూ ఉంది" అని చెప్పి ఆ నక్కకు కూడా కొత్త చెప్పులు ఇచ్చి వచ్చింది.
**********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి