న్యాయములు-760
క్షీరోదక సంపృక్త న్యాయము
*****
క్షీర అనగా పాలు. ఉదకం అనగా నీరు, నీళ్ళు,జలం. సంపృక్త అనగా కూడినది, అన్యోన్యంగా ఉండే, కలిసి ఉండే అని అర్థము.
పాలూ నీళ్ళూ కలిసి ఉన్నట్లు అని అర్థము.ఈ రెండూ కలిసి ఉన్నప్పుడు పాలనూ, నీటిని విడదీసి చూడలేము ఏది ఏదో విడివిడిగా తెలుసుకోలేము అని భావము.
పాలూ నీళ్ళూ వేరు వేరుగా ఉన్నప్పుడు ఇవి పాలు,అవి నీళ్ళు అని స్పష్టంగా కనిపిస్తాయి. అయితే పాలలో నీళ్ళు కానీ, నీళ్ళలో పాలు కానీ కలిపిన తర్వాత మాత్రం వాటినిక విడదీసి చూడలేము.
ఒకరికొకరు ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా బాగా కలిసిపోయి జీవించే ఇద్దరు వ్యక్తుల బంధాన్ని లేదా స్నేహాన్ని ఉదహరిస్తూ మన పెద్దవాళ్ళు ఈ" క్షీరోదక సంపృక్త న్యాయము"తో పోల్చి చెబుతారు.
వ్యక్తులే కాదు వస్తువులు కూడా ఒకదానితో ఒకటి దగ్గరి సంబంధం కలిగి వుండటాన్ని, కలిసిన తర్వాత మళ్ళీ విడదీయలేక పోవడాన్ని కూడా ఈ న్యాయముతో పోల్చవచ్చు.
కొన్ని పదార్థాలు కలిపిన తర్వాత విడదీయడం కష్టం.అలా విడదీయలేని మిశ్రమాన్ని 'సజాతీయ మిశ్రమం' అంటారు. వీటిల్లో ఉప్పు ద్రావణం,టీ,కాఫీ మరియు లోహ మిశ్రమాలు. వీటిని కలిపి మరిగించిన తర్వాత ఉదాహరణకు కాఫీ,టీ, డికాషన్లు వాటి రంగు రుచి వాసన నీటికి చేరిన తర్వాత దేనికదీ విడదీయడమనేది చాలా కష్టం. ఒక వేళ విడదీసే ప్రక్రియలు ఉన్నా అది చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకే ఈ "క్షీరోదక సంపృక్త న్యాయము"ను అలా విడదీయలేకుండా ఉన్న వాటిని గురించి చెబుతుంటారు.
పార్వతీ పరమేశ్వరుల బంధాన్ని అర్థనారీశ్వర తత్వంతో పోల్చారు. అంతే కాదు పాలు నీళ్ళలా వారి విడదీయలేని బంధం గురించి స్తుతిస్తూ రచించిన శ్లోకం కూడా ఉంది.అదేమిటో చూద్దాం.
"వాగర్థ వివ సమ్పృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే/జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ!
అనగా పదాలను మరియు వాటి అర్థాలను సరిగ్గా అర్థం చేసుకోవడంలో నాకు మార్గ నిర్దేశం చేయడానికి,ఒక పదం మరియు దాని భావం వంటి విడదీయరాని ప్రపంచ తల్లిదండ్రులైన పార్వతి మరియు పరమేశ్వరులను నేను పూజిస్తున్నాను.
అయితే కాళిదాసు ఎవరిని ప్రార్థిస్తున్నాడనే విషయంలో మరో వివరణ కూడా ఉండటం విశేషం. పార్వతీ పరమేశ్వరుడిని పార్వతీ పరామేశ్వరునిగా భావించినప్పుడు..పార్వతీప అంటే పార్వతీదేవి భర్త శివుడు అని అర్థము.ఇక రామేశ్వరుడిని రామ+ ఈశ్వరుడుగా విభజించవచ్చు. అంటే విష్ణువు రామ యొక్క ప్రభువు అంటే లక్ష్మీదేవి యొక్క ప్రభువు. ఈ విధంగా కాళిదాసు పదం మరియు అర్థం వంటి విడదీయరాని ఈ జగత్తుకు పితరౌ అనగా తండ్రులు అయిన పరమశివుని మరియు విష్ణువును ప్రార్ధిస్తున్నాడని కూడా చెప్పుకోవచ్చు.
ఇలా పార్వతీ పరమేశ్వరులు, పదం మరియు అర్థం మొదలైనవన్నీ విడదీయలేని "క్షీరోదక సంపృక్త న్యాయము"తో పోల్చి చెబుతారు.
ఈ" క్షీరోదక సంపృక్త న్యాయము"ను తరచి చూస్తే ఇంకో కోణం కూడా కనబడుతుంది.ఈ రెండింటి బంధం ఒకదాని లక్షణాలను, బాధలను ఆనందాలను ఒకటేమిటి అన్నింటినీ మరొకటి స్వీకరించడం మనం గమనించవచ్చు. పాలూ నీళ్ళూ కలిపి కాగబెడితే వేడి అనే బాధనూ,చల్లబడితే సంతోషాన్ని ,కలిపి పెరుగు చేస్తే గడ్డకట్టిన ఆనందాన్ని.. ఇన్ని రకాల లక్షణాలను కలిసి పంచుకుంటాయి.
మొత్తంగా ఇందులో కలిసిపోయే తత్వాన్ని ప్రధానంగా చెప్పుకోవచ్చు. మరి దీనిని మన పెద్దవాళ్ళు ఓ న్యాయంగా సృష్టించి చెప్పాల్సిన అవసరం ఎందుకో ఈపాటికే మనకు అర్థమై పోయింది.భార్యాభర్తల బంధమైనా, స్నేహబంధమైనా, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధమైనా,మనిషీ మరియు విచక్షణా జ్ఞానమైనా , నీతీ- నిజాయితీ,సత్యం- శాంతి,పూవు-తావి మొదలైనవన్నీ "క్షీరోదక సంపృక్త న్యాయము"వలె ఉండాలి. అప్పుడే ఈ ప్రపంచం సుఖశాంతులతో వర్థిల్లుతుంది. ఇదండీ! మన పెద్దలు ఈ న్యాయమును చెప్పడంలో గల అసలైన ఆంతర్యము.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి