భయమే నీ శత్రువు : -సరికొండ శ్రీనివాసరాజు

 శ్రీపురం ఉన్నత పాఠశాలలో చదువుతో పాటు అప్పుడప్పుడు విద్యార్థుల మధ్య కథల పోటీ,  చిత్ర లేఖనం పోటీ,  పాటల పోటీ వంటివి జరుగుతుంటాయి.  పాటల పోటీలో శ్రావ్య, అమృత,  గీతాంజలి చాలా బాగా పాడేవారు. ఎప్పుడు ఎవరు ఫస్ట్ వస్తారో చెప్పడం కష్టం.  టీచర్లు ఎప్పుడూ ఈ అమ్మాయిలపై ప్రశంసల వర్షం కురిపిస్తారు.  
       ఒకసారి జరిగిన పాటల పోటీలో శ్రావ్య మొదటి బహుమతి సాధించింది.  ఆ తర్వాత 8వ తరగతి చదువుతున్న శ్రుతి అనే అమ్మాయి శ్రావ్య వద్దకు వచ్చి,  "చాలా బాగా పాడినావు అక్కా!" అని మెచ్చుకుంది. శ్రావ్య శ్రుతిని నిర్లక్ష్యంగా చూసి,  ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. అప్పుడు అలివేలు శ్రుతి వద్దకు చేరి,  "చూశావా శ్రుతి! శ్రావ్యకు నువ్వంటే ఎంత చిన్నచూపు! అలాంటి వారికి దూరంగా ఉండటం మంచిది." అన్నది. "అవును." అన్నది శ్రుతి. 
         జాతీయ పర్వదినం రోజున విద్యార్థులకు బహుమతులు ఇస్తున్నారు. పాటల పోటీలో గీతాంజలికి మొదటి బహుమతి వచ్చింది.  ఆ కార్యక్రమానికి శ్రుతి తల్లి కూడా వచ్చింది.  శ్రుతిని దగ్గరకు పిలిచింది.  "నీకు బహుమతి ఎందుకు రాలేదు?" అని అడిగింది. "నేను పాటల పోటీలో పాల్గొనలేదు." అన్నది శ్రుతి.  "అదేంటి? నువ్వు ఇంటి దగ్గర పాటలు బాగా పాడుతుంటావు కదా! ఆపమన్నా ఆపవు.  మా చెవులు చిల్లులు పడుతుంటాయి.  అయినా నీ ప్రతిభకు ఏం తక్కువ? పాటల రాగం చాలా అద్భుతంగా ఉంటుంది. " అన్నది శ్రుతి తల్లి.  "అమ్మా! నేను పోటీలో అందరి కంటే బాగా పాడలేను. నా కంటే బాగా పాడేవారు చాలామంది ఉన్నారు. బయట అందరి ముందు పాడాలంటే నాకు చాలా భయం." అన్నది శ్రుతి. 
           వీరిద్దరి సంభాషణ శ్రుతితో పాటు అక్కడకు వచ్చిన అలివేలు విన్నది.  అలివేలు టీచర్ దగ్గరకు వెళ్ళి ఈ తల్లీ బిడ్డల సంభాషణ పూసగుచ్చినట్టు చెప్పింది. టీచర్ శ్రుతిని దగ్గరకు పిలిచింది.  ఈరోజు నువ్వు అందరి ముందు మంచి పాట పాడాల్సిందే. " అన్నది.  "టీచర్! నాకు అందరి ముందు పాడాలంటే భయం ప్లీజ్ టీచర్! నేను పాడలేను." అన్నది.  "ఇక్కడ ఎవరూ లేరనుకో.  మీ అమ్మవైపు మాత్రమే చూస్తూ పాడు.  నువ్వు మంచిగా పాడితే నీకు 500 వందల రూపాయలు బహుమతిగా ఇస్తాను. ఇప్పుడు అస్సలు పాడకపోతే నాతో నువ్వు ఎప్పటికీ మాట్లాడ వద్దు." అన్నది.  టీచర్ శ్రుతిని స్టేజ్ మీదకు పిలిచింది.  శ్రుతి "నీ ధర్మం,  నీ సంఘం,  నీ దేశం నువు మరవద్దు." అనే పాటను చాలా అద్భుతంగా పాడింది.  ఆ పాట విన్న ఆ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథి శ్రుతికి అప్పుటికప్పుడు 1000 రూపాయలు బహుమతిగా ఇచ్చారు. కిందికి వచ్చిన శ్రుతిని గీతాంజలి దగ్గరకు తీసుకుని అభినందించింది. శ్రావ్య ముఖం వెల వెల బోయింది.

కామెంట్‌లు