సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయములు-762
"అంగుల్యగ్రం న తేనై వాంగుల్య గ్రేణ స్పృశ్యతే" న్యాయము
******
అంగులి అనగా వ్రేలు బొటన వేలు, ఏనుగు తొండము చివర.అగ్రము అనగా చివర ,అన్నిటి కన్నా ముందు, ఎదురు,సమీపము, సమూహము.న అనగా కాదు, లేదు.తేనైవా అంటే అందులో.అంగుల్యగ్రే  అనగా వ్రేలు మొదట్లో లేదా వ్రేలి చివర.అస్పృశ్యతే అనగా ముట్టడానికి వీలు కానిది, తాకడానికి వీలు కానిది అనే అర్థాలు ఉన్నాయి.
ఏదేని వ్రేలి కొన ఆ వ్రేలి కొనచేతనే స్పృశింపబడదు అని అర్థము. అనగా"అంగుల్యగ్రం యథాత్మానాం నాత్మనా స్పృష్టు మర్హతి/ స్వాంశేన జ్ఞానమ ప్యేవం నాత్మానాం జ్ఞాతు మర్హతి"అన్నట్లు అంగుల్యగ్రం తన చేతనే తాను స్పృశింపబడనట్లు అనగా తాకబడనట్లు.జ్ఞానము కూడా తన యంశచే దానిని ఎరుగింపబడదు అని అర్థము.దీనిని ఇంకా తేలికగా అర్థమయ్యే రీతిలో చెప్పుకోవాలంటే తనంత తానుగా కాకుండా సందర్భానుసారంగా ఒకానొక విషయం ద్వారానో అంశం ద్వారానో తానేంటో బయట పడుతుందన్న మాట.
దీనికి ఓ మంచి ఉదాహరణ ఏమిటంటే మట్టి ఉంది కానీ దానంతట అది ఏదైనా వస్తువుగా రూపు దిద్దుకోదు.దానిని వస్తువుగా చేసేవారు ఉండాలి.అలాంటి వస్తువులను ఉపయోగించేటప్పుడు మట్టికి సంబంధించిన గొప్ప తనంతో పాటు కొంత అనుభవ పూర్వకంగా జ్ఞానం కలుగుతుంది. ఇంకా జ్ఞాన విస్తృతి పొందాలంటే ఆ మట్టికి సంబంధించి అనేక విషయాలు తెలుసుకోవడం ద్వారా కలుగుతుంది.
మరి జ్ఞానమంటే ఏమిటో దానికి సంబంధించిన వివరాలు క్లుప్తంగా తెలుసుకుందాం.
నిజంగా జ్ఞానమంటే ఏమిటో నిర్వచించడం చాలా కష్టం. ఈ జ్ఞానాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా అంటే తమదైన దృష్టి కోణంలో నిర్వచిస్తూ వుంటారు.అదెలా అంటే భగవద్భక్తులు భగవంతుని గురించి తెలుసుకోవడమే జ్ఞానం అన్నారు.శాస్త్రవేత్తలైతే జ్ఞానం అంటే ఏదైనా ఒక విషయం గురించి సంపూర్ణంగా తెలుసుకోవడమే జ్ఞానం అన్నారు."మాయా మోహముల నుండి విముక్తి కలిగించే శక్తినే జ్ఞానమని" మరికొందరు అభిప్రాయ పడ్డారు.
భారతీయ సంప్రదాయాలలో జ్ఞానాన్ని ప్రజ్ఞ లేదా విజ్ఞానం అని పిలుస్తారు.ఇలా జ్ఞానం అనేది ఒక వ్యక్తి విముక్తిని సాధించే మానసిక స్థితి మరియు ఆత్మగా కూడా పరిగణిస్తారు.ఇంకా జ్ఞానం అంటే తనను తాను సత్యంగా తెలుసుకోవడం.ఈ విధంగా కొందరు జ్ఞానానికి దేవుడుగా వినాయకుడిని మరియు జ్ఞానానికి దేవతగా సరస్వతిని కొలుస్తారు.
అయితే జ్ఞానం సిద్ధించడం రెండు రకాలుగా జరుగుతుందని దేవీ భాగవతంలో ఈ శ్లోకం ద్వారా తెలుపబడింది."జ్ఞానం తు ద్వివిధం ప్రోక్తం శాబ్దికం ప్రథమం స్మృతమ్,అనుభవాఖ్యం ద్వితీయం తు జ్ఞానం తద్దుర్లభం మతమ్" అనగా 1.పుట్టుకతోనే అనగా జన్మసిద్ధం అని,2.అనుభవంతో సిద్ధించే జ్ఞానం అనుభవ సిద్ధం.
 ఈ జ్ఞానాన్ని పొందేందుకు  సంస్కృతంలో  శ్లోకం కూడా వుంది.దీనిని ప్రతిరోజూ పఠించాలనీ, తద్వారా  జ్ఞానం  వస్తుందని మన పెద్దవాళ్ళు తాము చదువుతూ పిల్లలతో చదివించే వారు. అదేమిటో చూద్దాం.
"అసతో మా సద్గమయ/ తమసో మా జ్యోతిర్గమయ/మృత్యోర్మా అమృతం గమయ/ ఓం శాంతిః శాంతిః శాంతిః "- అనగా నన్ను అవాస్తవికం నుండి అసలైన స్థితికి నడిపించు.నన్ను చీకటి నుండి వెలుగులోకి నడిపించు.నన్ను మరణం నుండి అమరత్వం వైపు నడిపించు.శాంతి శాంతి శాంతి కలుగుగాక అని అర్థము.
కాబట్టి  ఏదేని వ్రేలి కొసను అదే వ్రేలి కొనచేత ఎలా తాకలేమో జ్ఞానం కూడా తనంత తానుగా జ్ఞానం తాకలేదు. ఒక వ్యక్తిలోని జ్ఞానం కూడా తనంత తానుగా బయట పడదు.దానికొక వాహకం కావాలి.ఆ విధంగా బయటి ప్రపంచానికి జ్ఞానం అంటే ఏమిటో తెలుస్తుంది.
పై విషయాలన్నీ చదివిన తర్వాత మనకు అర్థం అయ్యేది ఏమిటంటే  జ్ఞానం అంటే ఇదమిత్థంగా ఫలానా అని ఖచ్చితంగా చెప్పలేనిది. అలాగే  పుట్టుకతోనో , అనుభవం ద్వారానో  వచ్చిన జ్ఞానం తనంత తానుగా కాకుండా సమయం సందర్భం వచ్చినప్పుడు బయట పడుతుందని "అంగుల్యగ్రం న తేనై వాంగుల్య గ్రేణ స్పృశ్యతే న్యాయము "ద్వారా తెలుసుకో గలిగాము.
 మనలో అంతర్లీనంగానో అనుభవం వల్లనో వచ్చిన జ్ఞానం  సానరాయి లాంటి సందర్భం వచ్చినప్పుడు మేధోమథన రాపిడి అనగా దానిపై గంధపు చెక్కను అరగతీస్తే వస్తుంది.కాబట్టి మనం  అంతో ఇంతో పెంచుకున్న జ్ఞానం మన చేసే  ఆలోచనలు చేతల ద్వారా బయట పడుతుంది.

కామెంట్‌లు