ఉపకారం : సరికొండ శ్రీనివాసరాజు
 రంగాపురం ఉన్నత పాఠశాలలో పాండు, రాము 9వ తరగతి చదువుతున్నారు. ఇద్దరూ పోటా పోటీగా చదివే వారు. ఎప్పుడు ఎవరు ఫస్ట్ వస్తారో చెప్పడం కష్టం. రంగకు రాము అంటే విపరీతమైన ఈర్ష్య. రాము ప్రతిరోజూ తాను చదివింది ఎవరో ఒకరికి అప్పజెప్పాల్సిందే. తాను ఒక టీచరుగా ఫీల్ అవుతూ అవతలి వాళ్ళను స్టుడెంట్లలా భావించి, తాను చెప్పదలుచుకున్న విషయాన్ని వివరంగా చెబుతూ మరీ చెప్పేవాడు. రాము మంచితనం వల్ల అవతలి వారు శ్రద్దగా వినేవారు. ఫలితంగా వారూ చదువులో తెలివి తేటలు పెంచుకునేవారు. అలా రాముకు స్నేహితులు బాగా ఉండేవారు. రాము పుణ్యమా అని చాలామంది చదువులో చురుకైన వారు అయ్యారు. 
     పాండు ధనవంతుల అబ్బాయి. తరచూ డబ్బులు బాగా తెస్తూ స్నేహితులకు షాపులో అవీ ఇవీ కొనిచ్చి వారిని మంచి చేసుకునేవాడు. అలా పాండుకూ స్నేహితులు అయినవారూ ఉన్నారు.
       కాలం మంచులా కరిగిపోయింది. సంవత్సరాలు గడిచాయి. ఈ బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసారు. చాలామంది కలుసుకున్నారు. పాండు మంచి ఉద్యోగం చేస్తున్నాడు. కాని పాండు స్నేహితులు ఎవ్వరికీ గొప్ప ఉద్యోగాలు లేవు. వారు చదువులో ముందుకు వెళ్లలేక ఉద్యోగాలు రాక ఎదో ఒక పని చేసుకుంటూ పేదరికంలో ఉన్నారు. రాము పుణ్యమా అని అతని స్నేహితులు అంతా బాగా చదువుకొని మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు. వారు ఆ సభలో మాట్లాడుతూ తాము రాము పుణ్యమా అని, ఇంత గొప్ప స్థితిలో ఉన్నామని, తమ భవిష్యత్తుకు బంగారు బాటలను వేసింది రామూనే అని పొగిడారు. పాండు గురించి ఎవరూ మాట్లాడలేదు. అతని స్నేహితులు కూడా.

కామెంట్‌లు