సునంద భాషితం:- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయములు-773
అకాలే కృత మకృతం స్యాత్ న్యాయము
*****
అకాలే అనగా కాని కాలంలో , అవసరం లేని సమయంలో.కృత అనగా చాలును,వలదు.అకృతం అనగా చేయబడనిది,సరిగా చేయబడనిది,అసమగ్రమయినది, మూర్ఖుడు.స్యాత్ అనగా ఉన్నది అని అర్థము.
కాని సమయంలో ఏదైనా చేయబడినది అనగా చేసినట్లయితే అది చేయబడినదియే అవుతుంది.అనగా దాని వల్ల ఉపయోగము ఉండదు.విహిత కాలమున విహితకర్మ ఆచరింపక అవిహిత కాలమున అదే కర్మను ఆచరింప పూనుకోవడం నిరర్థకమే అవుతుంది అనగా నిష్ప్రయోజనం అవుతుంది.పైగా ప్రత్యవాయము కూడా సంభవింపగలదు.ఈ విషయమే గ్రంథకారులతో చెప్పబడినది.అదెలా అంటే " స్వకాలే యద కుర్వంస్తత్కరో ద్యధ చేతనః,ప్రత్యవాయోస్తి తేనైవ నాభావేన స జన్యతే"అనునట్లు.
 పై విషయాన్ని వివరణాత్మకంగా చెప్పాలంటే  చేయాల్సిన పని చేయాల్సి వచ్చినప్పుడు చేయకుండానే అవసరం లేని సమయంలో చేస్తే..అది ఎంత గొప్ప పనైనా ఎవరినీ ఆకట్టుకోదు.తనకంటూ గుర్తింపు పొందదు. పైగా కొన్ని నష్టాలే జరుగుతుంటాయి.
 అందుకే మన పెద్దవాళ్లు  "దేనికైనా సమయం,సందర్భం తప్పకుండా" ఉండాలి అంటుంటారు. ఉదాహరణకు  ఒకానొక పెళ్ళి తలపెట్టినప్పుడు దానికి సంబంధించిన ముహూర్తాన్ని ముందే నిర్ణయించుకుంటాం. పెళ్ళి తంతులో చేయవలసిన పనులు అప్పుడే చేయాలి.  అలా విహిత కాలమున చేయాల్సిన పని చేయకుండా ఆ తర్వాత చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు కదా!  అందుకే మన పెద్దలు "ఎప్పటి మేలు అప్పుడే తలవాలి" అని కూడా అంటుంటారు.
 ఈ "అకాలే కృత మకృతం స్యాత్" న్యాయము ప్రకారం "జీవితంలో ప్రతి పనినీ దానిని నిర్దేశించిన సమయంలోనే చేయాలి" అని అర్థం చేసుకోవచ్చు. కొందరు కొన్ని పనులను వాయిదాల పద్ధతిలో చేస్తూ ఉంటారు. దాని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుంది.
కాబట్టి  నిర్దేశించిన పనిని నిర్దేశించిన సమయంలోనే చేయాలి. అలా చేయకపోతే రెండు రకాలైన నష్టాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక రోగి అనారోగ్యంతో వైద్యుడి వద్దకు వెళ్ళినప్పుడు అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని చెప్పినప్పుడు  అప్పుడే చేయించుకోవాలి. అంతే గానీ తర్వాత వీలును బట్టి చేయించుకుంటానంటే... దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో  ఊహించుకోవచ్చు.
 ఈ న్యాయము ఏ ఒక్క విషయానికి మాత్రమే పరిమితం కాదు .ఇది ఆకాశమంత విశాలమైనది .నిత్య జీవితంలో ప్రతి సందర్భంలోనూ, ప్రతి అంశంలోనూ దీనిని అన్వయించుకోవచ్చు.
దీనిగురించి ముఖ్యంగా  పిల్లలు వారి చదువుల విషయంలో దీనిని అన్వయించుకోవచ్చు.
అందుకే ఈ న్యాయమును ఎప్పుడూ మననం చేసుకుంటూ ఉందాం.ఆ విధంగా మన జీవితాన్ని ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ , ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడే చేస్తూ ఆనందంగా ముందుకు అడుగులు వేస్తూ, అనుకున్న విజయాల్ని సాదిద్ధాం.

కామెంట్‌లు