సుప్రభాత కవిత ; -బృంద
వేసవిలో బడలిన  వసుధకు 
ఊరటగా నింగి పంపిన 
చినుకుల సందేశం అంది
చిత్తడిగా మారిన పుడమి!

అనుకోని అతిధిలా వచ్చి
తెలియని మమతల నీడనిచ్చే
మరపురాని నేస్తాల అనుబంధం
చెప్పలేని ఆనందాల కదంబం!

ఎరుగని వారైనా చెలిమితో
ఎదకు  చేరువై నిలిచి 
ఎంతగా కలిసిపోతారో 
ఎక్కడి వరకూ కలిసి వస్తారో!

గత జన్మల కొదవలు ఏవో 
హితముగా పూర్తి చేయు మిషతో 
ఋణానుబంధ రూపముగా
దైవము కలిపిన బంధాలు!

కలిపిన కాలానికి
తెలిసిన వైనానికి
గడిపిన సమయానికి
తడిసిన రెప్పల కృతజ్ఞతలు!

అరమరికలు  లేని 
అపురూపమైన ఆత్మీయతను
అనుభవింపచేసే స్నేహలకు
అవకాశమిస్తూ అరుదెంచే వేకువకు

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
తడిసిన రెప్పల కృతజ్ఞతలు అనే భావన చాలా బాగుంది...... బాగుందండి మీ కవిత