తగిన శాస్తి:- సరికొండ శ్రీనివాసరాజు
 జగదీశ్ తుంటరి బాలుడు. అతని తుంటరి పనుల వల్ల ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. వారు జగదీశ్ తల్లికి ఫిర్యాదు చేసేవారు. ప్రతీసారీ తన కొడుకు అలాంటి వాడు కాదని వెనకేసుకొని వచ్చేది.
      ఒకరోజు జగదీశ్ ఒక ఆవిడ కుండలో మంచినీళ్ళు మోసుకుంటూ వెళ్తుండగా జగదీశ్ గుల్లేరుతో రాయిని ఆ కుండకేసి కొట్టాడు. కుండ నెత్తి మీదే ముక్కలై నీళ్ళు కారి ఆమె తడిసిపోయింది. జగదీశ్ అక్కడి నుంచి పారిపోయాడు. మరోసారి ఒక ఆవిడ నడుచుకుంటూ వెళ్తుంటే జగదీశ్ గుల్లేరు సహాయంతో రాయిని తేనెతెట్టకు కొట్టి మెరుపు వేగంతో పారిపోయాడు. ఆ తేనెటీగలు ఆవిడను బీభత్సంగా కుట్టాయి. మరొకసారి పిల్లలు తొక్కుడు బిళ్ల ఆడుతుంటే జగదీశ్ వెనుక నుంచి అరటి తొక్క ఆ అమ్మాయి ముందు వేశాడు. ఆ అమ్మాయి పొరపాటున ఆ తొక్కను తొక్కి జారిపడి పోయింది. జగదీశ్ అక్కడ నుంచి పరారయ్యాడు. తల్లిదండ్రులు గారాబం చేసి వెనకేసుకొని వస్తున్నారు.
      జగదీశ్ అల్లరి పనులు శ్రుతి మించినాయి. ఒకరోజు ఒక పెద్ద మనిషి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. పరమేశం అనే అబ్బాయి మామిడి కాయల కోసం చెట్టు మీదకు పెద్ద బరువైన రాయి విసిరాడు. అది గురితప్పి ఆ పెద్ద మనిషి తలకు తగిలి బలమైన దెబ్బ తగిలింది. ఆ పెద్ద మనిషిని ఆసుపత్రికి తరలించారు. రాయి ఎవరు విసిరారు అని విచారణ చేసారు. ఎవరూ చూడలేదు. చాలా మంది అనుమానం జగదీశ్ మీద. జగదీశ్ విసిరాడు అని చెప్పారు. కొంతమంది తాము ప్రత్యక్షంగా చూసామని అబద్దం చెప్పారు. ఇలా అయినా జగదీశ్ మీద కసి తీర్చుకోవాలి అని. జగదీశ్ మీద కేసు నమోదు అయ్యింది. తాను తప్పు చేయక పోయినా నిస్సహాయుడు అయ్యాడు. మొదటి నుంచీ మంచిగా ఉంటే ఈ పరిస్థితి రాకపోయేది కదా అనుకున్నాడు. తల్లిదండ్రులు తమ గారాబంతో ఇలా జరిగిందని, తమను తామే తిట్టుకున్నారు.  చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం?

కామెంట్‌లు