నీ కలల సామ్రాజ్యంలో...!:- కవి రత్న సాహిత్యధీర సహస్ర కవి భూషణ్ పోలయ్య కూకట్లపల్లి, అత్తాపూర్, హైదరాబాద్
నరుడా..! ఓ నరుడా..!
కలలు కను...ఆ కలలే నీగమ్యం కావాలి
కలలు కలకాలం కలలుగా ఉండరాదు..!
నీ కలలు సాకారమయ్యేంత వరకు...
నీ కన్నీళ్లు... 
ఆనంద బిందువులుగా మారేంతవరకు...!
కన్నులు మూయకు...కునుకు తియ్యకు..!

నీ కలలో...
నీవు సూర్యుడివైతే...
చీకట్లను చీల్చే కాంతిరేఖగా వెలిగిపో..!

నీవు చంద్రుడివైతే...
చీకటిరాత్రిలో చల్లని వెన్నెలను పంచు..!

నీవు నీలి మేఘమైతే...
చిరుజల్లుల చిరునవ్వులు కురిపించు..!

నీవు వైద్యుడివైతే...
రోగి వేదనను తీర్చి నమ్మకాన్ని పెంచు..!

నీవు ఇంజనీరువైతే...
సమాజాన్ని అభివృద్ధి పథంలో 
నడిపించే "ప్రేమ సౌధాలు" నిర్మించు..!

నీవు రక్షక భటుడిడైతే...
అన్యాయాన్ని 
అడ్డగించు న్యాయాన్ని నిలబెట్టు..!

నీవు న్యాయమూర్తివైతే...
నిజం వైపే నిరుపేదల వైపే 
నిలబడి న్యాయమైన తీర్పులు చెప్పు..!

నీవు ఎడారిలో ఒయాసిస్ వైతే...
దాహార్తుల ఆశలకు తృప్తిని నింపు..!

నీవు కృషివలుడివైతే...
చెమట చుక్కలు చిందించు...
భూమిలో పచ్చదనాన్ని పండించు..!

నీవు శిశువులా మారితే...
నలుగురికి నీ నవ్వుల 
పువ్వుల పరిమళాల్ని పంచు..!

నీవు పశువుగా మారితే...
స్త్రీల గౌరవాన్ని భంగ పరచకు... 
పెరిగే మొక్కల రెక్కలు విరవకు..!
 
నీవు విద్యార్థివైతే...జ్ఞానాన్ని నేర్చుకో...
నీవు గురువువైతే...ప్రేమతో బోధించు..!

నీవు జననేతవైతే...
రామరాజ్యాన్ని స్థాపించు...
సుపరిపాలనను అందించు... 
ప్రజల హృదయాల్ని గెలుచుకో...
కానీ రాక్షసరాజువై ప్రజలను వేధించకు..!

నీవు కాషాయ వస్త్రధారివైతే...
శాంతిసందేశాన్ని విశ్వమంతా వినిపించు.!

నీవు భక్తుడివైతే...
ఆ దైవాన్ని భక్తిశ్రద్ధలతో పూజించు...కానీ 
“నేనే దైవమని" అహంకారంతో విర్రవీగకు.!

ఓ నరుడా..! ఈ క్షణం నీదైనా...
మరుక్షణం ఎవరిదో ఎవరికెరుక..?
గుంటనక్కలా మృత్యువు
గుమ్మంచాటునే దాగివుందని గుర్తుంచుకో.!

అందుకే…నరుడా..! ఓ నరుడా..!
సృష్టి మర్మాన్ని...
ప్రకృతి ధర్మాన్ని... 
పంచభూతాలను ప్రశ్నించకు...
సృష్టి కర్తనే శాసించకు...గౌరవించు… 
సదా ప్రకృతి తల్లిని ప్రేమించు....
నీజన్మకు ఒక అర్థంముందని తెలుసుకో..!

నీ చేతులతో మేలు చెయ్...
నీ మాటలతో ధైర్యాన్ని నింపు...
నీ మనసు దయతో పొంగి పోనియ్...
నీవు నీతిగా నిజాయితీగా జీవించు...
నిర్భయంగా ఉండు…నిప్పులా మండు..!



కామెంట్‌లు