శ్రీ శిరిడీసాయి లీలామృతం:- సి.హెచ్.ప్రతాప్
 శిర్డీ సాయిబాబా ఒక మహానుభావుడు, సమతా, శాంతి మరియు భక్తికి ప్రతీకగా భావించబడతారు. ఆయన మహారాష్ట్రలోని శిర్డీ గ్రామంలో నివసించారు మరియు హిందూ, ముస్లిం సముదాయాల మధ్య ఏకత్వం కోసం జీవితం అంతా కృషి చేశారు. సాయిబాబా భక్తులను "సబ్ కా మాలిక్ ఏక్" అనే సందేశంతో మనుషుల మధ్య భేదాభిప్రాయాలను తొలగించేందుకు ప్రేరేపించారు.అయన అద్భుతాలు, దయా గుణం మరియు ప్రేమతో లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నారు. సాయిబాబా ఆయుర్వేదం, ఉర్దూ, హిందూ గ్రంథాలు మరియు ఖురాన్ విషయంలో ప్రావీణ్యం కలిగి ఉండేవారు. ఆయన ప్రజల బాధలు తీర్చేందుకు సద్భావనతో పనిచేశారు. ఆయ‌న బతుకు తత్వం చాలా సాధారణమైనది – "శ్రద్ధా" మరియు "సబూరీ" అనే రెండు మూల సూత్రాలపై ఆధారపడింది.
శిరిడీలో  ఉన్న సాయిబాబా మందిరం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల గమ్యస్థలంగా ఉంది. ఆయ‌న జీవితం మరియు బోధనలు ఈ కాలంలో కూడా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. సాయిబాబా మనిషి మానవతా విలువలను గుర్తు చేయడం, సేవా భావం పెంపొందించడంలో మార్గదర్శకుడిగా నిలిచారు.
ఒక సందర్భంలో శిరిడీలో ఒక గొప్ప తుఫాను సంభవించింది. నల్లని మేఘాలు ఆకాశాన్ని కప్పివేశాయి. గాలి తీవ్రం గా వీచి అందరినీ భయకంపితులను చెసింది. ఉరుములు, మెరుపులతో కూడిన కుంభవృష్టి కురిసి శిరిడి అంతా జల దిగ్భంధం లో చిక్కుకుంది. శిరిడీ లో వున్న శనేశ్వరుడు, మారుతి, ఖండోబా, శివపార్వతులు, గణపతి మొదలైన ఆలయాలన్నీ నీట మునిగాయి. ప్రజలందరూ మశీదుకు పరుగులు తీసి శ్రీ సాయి కాళ్ళపై పడి, కన్నీరు మున్నీరుగా ప్రార్ధించి తమను రక్షించమని కోరుకున్నారు. ఆపదలో వున్న తన భక్త జనావళిని చూసిన శ్రీ సాయి హృదయం కరిగిపోయింది.వెంటనే ఆయన సట్కా తీసుకొని మశిదు బయటకు వచ్చి “ ఆగు ! నీ తీవ్రతను తగ్గించు” అని గర్జించారు. క్షణాలలో వాతావరణం ప్రశాంతతను సంతరించుకుంది. తుఫాను తగ్గిపోయింది. శిరిడీ గ్రామం లో ప్రవేశించిన నీరు అంతా బయటకు పారింది. ఆకాశం నిర్మలమై పోయింది. ప్రజలందరూ శ్రీ సాయిని స్తుతిస్తూ తమ తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు. ఆశ్చర్యకరం గా గ్రామం లోని ఆలయాలు నీట మునిగినా వాటికి వీసమెత్తు నష్టం కూడా జరగలేదు. మర్నాటి నుండి అందులోని దేవతలు యధాతధంగా శిరిడీ జనుల పూజలందుకున్నారు.హిందూ దేవతలను అపహాస్యం చెసినా, విగ్రహాలను నిర్లక్ష్యం చేసినా శ్రీ సాయి అగ్రహానికి గురి కాక తప్పదని పై లీలల ద్వారా మనం గ్రహించాలి.

కామెంట్‌లు