వారసులారా..! మీకు వందనం..?:- కవి రత్న సాహిత్య ధీర సహస్ర కవి భూషణ్ పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాదు
అమ్మానాన్నల 
వారసత్వపు సంపదలు..?
వెండి కంచాల్లో వడ్డించిన
వివాహపు విందులే...ఆరగించండి..! 
అనుభవించండి...కానీ వారు 
చేసిన పాపాల ఎంగిలిస్తరాకులు 
ఎత్తివేసేందుకు సిద్దంగా ఉండండి...!

అమ్మా నాన్నల ఆస్తులు 
ఇహలోక ఇంద్ర భవనాలే...
హాయిగా అనుభవించండి...కానీ గుర్తుంచుకోండి...వాళ్లు నాటిన 
పాపపు విత్తనాల ప్రతిఫలమే...
మీ జీవిత పొలాల్లో శ్రమల పంటలు..! 

ఆస్తుల కోసం తెగ ఆరాటపడే 
ఓ ఆశబోతు బిడ్డలారా...మరువకండి 
తల్లిదండ్రుల పాపాలకు లెక్కలుండవు
ఆర్జించిన ఆస్తులకు...ఆస్తిపత్రాలు తప్ప 
మీ శ్వాసలు ఆగేవరకు కఠినశిక్షలు తప్ప 

ఔను ఓ వారసులారా..! తెలుసుకోండి 
వారి నేరాల నకిలీ సంతకాలు...మీ 
కర్మలపై అదృశ్యంగా ముద్రించబడ్డాయ్..!

ఆర్జించిన ఆస్తులు రిజిస్టర్ కావచ్చు...
కానీ వారి పాపాల పత్రాలు...మీ కర్మల...
మీ రక్తకాణాల ఆన్లైన్లో నమోదయ్యాయి.! 

అమ్మా నాన్నలు వారసత్వంగా 
ఇచ్చిన తమకు నచ్చిన ఖరీదైన 
విలాసవంతమైన విశాలమైన 
బంగారుభవనాల్లో శయనించే మీరు..!
 
వారి గత జన్మ పాపాల
శాపాల నరక కూపాల నీడలో 
సైతం నివసించాలి...మీరంతా 
మీ జీవన యాత్రలో నిశ్శబ్దంగా 
అదృశ్యంగా శిక్షలు అనుభవించాలి..!

ఆస్తి లెక్కలు బహిర్గతమే...
పాపాల పత్రాలూ అంతర్గతమే...
అమ్మానాన్నల ఆస్తులే గొడుగులు... 
పాపాలే రేపు మీనెత్తిన పడే పిడుగులు..!

వారసత్వంగా...
వంశపారంపర్యంగా... 
గతజన్మ కర్మఫలంగా...
అందేను ఆస్తుల అమృత ఫలాలు... 
పాపపుణ్య కార్యాల ప్రతిఫలాలు కూడా..! 

అమ్మా నాన్నలు చెమట చుక్కలతో 
వ్రాసిన ఆస్తిపత్రాలు అందిన తేనెతుట్టెలే.!
గతజన్మలో వారి పాప కర్మలు 
మీ పాలకుండలో రాలిన విషపు చుక్కలే.!

తల్లిదండ్రుల పాపాల నదులు కడకు 
కలిసిపోయేది మీ జీవితపు కడలిలోనే..!

ఔను మీ అమ్మానాన్నల
ఆస్తులకు...అప్పులకు 
ఆశీస్సులకే కాదు మీరు వారసులు..!
గతజన్మలో వారు చేసిన 
ప్రతి పాపానికి...ప్రతి ఘోరానికి... 
ప్రతి నేరానికి కూడా మీరు వారసులే..!

ఇది ఆ దైవ నిర్ణయం... 
ఇది అందరికీ అర్థం కాని 
అంతుచిక్కని ప్రకృతి ధర్మం..సృష్టి మర్మం.



కామెంట్‌లు