అనుబంధం:- సత్యవాణి కుంటముక్కుల

  కాకి పిడచ తినడం లేదు. కాకి పిడచ తినండం లేదు. ఒకరితో వొకరు  ఇంట్లో వాళ్ళూ, ఇటికి వచ్చిన చుట్టాలు మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్పుకొంటున్నారు.
       అవును పాపం బాధ్యతలన్నీ అలా వుండగానే పోయాడు. ముద్దెలా ముట్టుకుంటాడు . అన్నారు  ఒకరు.
      అవును  పాపం  పెళ్ళికెదిగిన పిల్లకు పెళ్ళి గానీ, పిల్లాడికి వడుగానీ చేయకుండానే పోయాడు.మరెవరో అన్నారు సానుభూతిగా.
    అవును పిల్లల్ని కన్నాడు కానీ, ఓ ముద్దూ ,ముచ్చటా చూడనేలేదు.పాపం  దురదృష్టవంతుడు  .ఇంకెవరో అన్నారు.
         ఆ అన్నగారు పిల్లలకు లోటు చేయనని మాటిచ్చి, దణ్ణం పెట్టుకొంటే పిండం కాకి ముట్టుకొంటుంది.  అన్నాడు ఒక దగ్గరి బంధువు.
           ఆ రోజుకి కాంతారావు పోయి పదకొండవ రోజు. పది పదకొండవ రోజుల కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. 
      కాంతారావుకి ఇద్దరు కొడుకులు వున్నా, పెద్దవాడు నారాయణకి వడుగు అవ్వని కారణంగా, కాంతారావు అన్నగారు కొండ్రాజే ఈ కార్యమాలన్నీ నిర్వహిస్తున్నాడు. ప్రాణంలో ప్రాణమైన, తనకంటే ఇరవై ఏళ్ళు పైగా చిన్నవాడైన  తన తమ్ముడి శ్రాధ్ధ కర్మలు తన చేతులతో చేయడం ఎంతటి బాధాకరమో అతడికి మాత్రమే తెలుసు.
        కొండ్రాజుకి  కాంతారావు, భానుమూర్తులు తమ్ముళ్ళు. తమ్ముళ్ళిద్దరూ తనకంటే వయసులో చాలా చిన్నవాళ్ళు.
అన్నగారి మాట వేదం తమ్ముళ్ళిద్దరికీ! వాళ్ళను తెలిసినవారంతా రామలక్షణులంటే కొండ్రాజు అన్నదమ్ములే అంటారు. 
    వాళ్ళ అక్కచెల్లెళ్ళు, తమ అన్నదమ్ములను చూసుకొని మా అన్నదమ్ముల్లాంటి అన్నదమ్ములు లోకంలో వుండరు అని గర్వపడుతుంటారు. అదేమాట ఊళ్ళో వాళ్ళూ ,బంధువులూ కుడా చెప్పుకొంటారు.
      కొండ్రాజు రెండవతమ్ముడు భానుమూర్తి ఉద్యోగం నిమిత్తం వేరే వేరే ఊళ్ళలోవున్నా ,కాంతారావుమాత్రం పెళ్ళై పాతిక ముఫ్పై ఏళ్ళు కావస్తున్నా తండ్రి కట్టిన ఇంట్లోనే అన్నావదినలతో కలసి ఉమ్మడిగానే వుంటున్నాడు.
       తోడికోడళ్ళిద్దరూ సహజంగా  ఏదో ఒకదానికి మాటా మాటా అనుకొన్నా, అన్నదమ్ములు పొలాలనుంచి ఇంటికి వచ్చేసరికి గప్ చుప్ గా అయిపోయేవారు.మళ్ళీ క్షణాల్లో మాటా మాటా కలుపుకొని మామూలుగా అయిపోయేవారు. నిజానికి రిద్దరి సంస్కారం వల్లనే ఆ సంసారం అన్ని ఏళ్ళు కలసి వుండగలిగారన్నది జగమెరిగిన సత్యం. 
       అలాగే వారిద్దరి పిల్లలు అన్నదమ్ముల పిల్లల్లో ఎవరెవరి పిల్లలో బయటి వారికి తెలియనంత ఆత్మీయానురాగాలతో వుంటారు.
       ' కలవారి కోడలు కలికి కామాక్షి 'పాటలోలాగ కాంతారావు బావమరిది  ఏ పండగకో,పబ్బానికో తన చెల్లెలిని తనతో తీసికెళ్ళడానికి వచ్చి కాంతారావునడిగితే ,"అన్నయ్యనడగండి  .అనేవాడు.వాళ్ళు అలాగే అడిగేవారు.
      "కాంతం! అమ్మాయిని వాళ్ళన్నయ్య తీసికెళతాడట " అంటే, తమ్ముడు "సరే" అనేవాడు.
         అలాగే  వారం పదిరోజులక్రితం కాంతారావు భార్య సుందరమ్మని వాళ్ళ అన్నయ్య  సంక్రాంతి పండగకని తీసికెళ్ళాడు. పిల్లలు మాత్రం ఇక్కడే వుండిపోయారు. ఆ ఇంటి పిల్లలకు మేనమామల ఇళ్ళలో అంత స్వేఛ్ఛగా అనిపించదు.ఆ పట్టణాల వాతావరణాలు,ఆ టౌను పిల్లలు చూపించే  అతిశయాలూ వారికంతగా నచ్చవు. అందుకనే చిన్నప్పుడెప్పుడైనా తల్లులతో చుట్టాలింటికి వెళ్ళేరేమోగాని,జ్ఞానం తెలిశాకా   వెళ్ళడంలేదు. తోడికొడళ్ళకిది మామూలే. కొండ్రాజు భార్య భానుమతి పెళ్ళిళ్ళకు, పేరంటాలకూ వెళితే , సుందరమ్మ వుంటుంది కనుక,  వారంరోజులకని వెళ్ళిన ఆమె నెలరోజులవరకూ నిశ్చింతగా వుండిపోతుంది. అలాగే సుందరమ్మకూడా నెలా, రెండు నెలలు అన్నదమ్ముల దగ్గర వున్నా  భర్తా, పిల్లలగురించిన బాధలేదు. ఇది ఆదర్శవంతమైన  వీరి ఉమ్మడి కుటుంబంలో మాత్రమే జరుగుతుంది. ఆ తోడికోడళ్ళకు ఒకరిపై ఒకరికిగల నమ్మకం.
        రేపు భోగి పండుగ అనగా ఆరోజు రాత్రి పదిగంటలవరకూ  పొలంపనులగురించి ,ఇవ్వవలసినవి పుచ్చుకోవలసిన వాటిని గురించి రోజూలాగే అన్నదమ్ములిద్దరూ మాట్లాడుకొని ఎవరి గదులలోకి వాళ్ళు వెళ్ళారు.
        అలాగదిలోకి వెళ్ళి పడుకొన్న కాంతారావు మరి మర్నాడు ఈదయం నిద్ర లేవలేదు. ఆమాట విన్న కొండ్రాజు "కాంతం  ఈవయసులో ఉన్న నన్నొదిలి ఎలా వెళ్ళగలిగావురా? అంటూ బేర్ మన్నాడు. అంతే ఆతర్వాత అసలేమీ జరగనట్లుగానే, బ్రాహ్మడు చెప్పిన విధంగానే కర్మకాండలన్నీ యధావిధిగా నిర్వహించేడు. అయితే అలా చేస్తున్నప్పుడు, కందగడ్డలా ఎర్రబారిన అతడి మొఖం, వణుకుతున్న చేతులూ అతడి  లోలోని దుఃఖాన్ని  తెలియజేసేవి.
       భర్త కాంతారావు పోయిన మూడవ రోజుకు రాగలిగింది సుందరమ్మ అన్నగారితోకలసి.భర్త పోయిన విషయం చెప్పకుండా, వంట్లో బాగాలేదట అనిమాత్రం చెప్పి అన్నగారు తీసికొచ్చాడు ఆమెని.
      అంత దూరాన్నుండి  ఆశతో  వచ్చిన ఆమె ఈ చేదు వార్త విని  ఎలాతట్టుకొంటుందో, అమె అని బంధు జనులు ,ఊరిలోని అశేషజనం  ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. ఆమె అన్నకైతే తన చెల్లెలు ఏమౌతుందో భర్త నిర్జీవ కాయాన్ని చూసి, అనే భయంతో  గజగజలాడిపోయాడు.
         సుందరమ్మ వచ్చీ రాగానే భర్త పార్థివ దేహం వద్ద కూర్చుని అతడి మొఖంలోకి తదేకంగా చూస్తూ, "మీరు అన్నయ్య చెప్పేడని వెళ్ళమంటున్నానుకానీ,ఎందుకో నాకంతగా నువ్వు ఊరెళ్ళడం ఇష్టం లేదోయ్ !"అన్నారు. మీకిష్టంలేదని చెప్పినందుకా నాకింత శిక్ష వేశారు?"భర్తమొఖంలోనికి చూస్తూ అడిగింది.
           అందరూ తలోరకంగా  ఆమెను ఓదారుస్తున్నారు. ఆమె చెవులకు ఆమెకు అవేమీ వనపడటం లేదు. కళ్ళనుండి నీరుమాత్రం ధారలుగా కారుతుండగా చుట్టూ పరికించి చూసింది. బంధు జనులు అందరూ  చుట్టూ వున్నారు, అతడొక్కడే లేడు.
     వెంటనే తోడికోడలి మొఖంలోకి చూస్తూ "బావగారేరి " అడిగింది సుదరమ్మ.
    అమ్మకి నోటమాటరావండం లేదు. తను పన్నెండు సంవత్సరాలకు కాపరానికి వచ్చేసరికి తన పెద్దమరిది ఈ కాంతారావు తనకంటే ఒక ఏడాది చిన్నవాడు. చిన్నమరిది భానుమూర్తి మరో రెండేళ్ళు చిన్న. అయినా వరుసలో వదిన గనుక, తనపట్ల గౌరవ మర్యాదలు చూపించేవారు వారిద్దరూ.
      అయితే చిన్నమరది చదువులకోసం చిన్నతనంలోనే, అక్కగారింటికి వెళ్ళి పట్నంలో చదువుకొంటూ, సెలవలని, పండగ పబ్బాలనీ రావండం జరిగేది కానీ, కాంతారావు  మాత్రం పెళ్ళైనా, పిల్లలు కలిగినా ఈ ఉమ్మడి కుటుంబంలోనే వుండటంవలన అతడితో
అనుబధం మరింత బలపడిందామెకి. కష్టసుఖాలను మరిది కాంతారావుతో ,స్నేహితుడికి చెప్పుకొన్నట్లు చేప్పుకొనేది. అతడికి ఏదిష్టమో ఆ వదినగారికే తెలుసు.
     ఈరోజు తనకు మిత్ర సమానుడైన మరిది కాంతారావు హఠాత్తుగా మరణించడం అన్నది  ఆమెను నిశ్చేష్టురాలను చేసింది.
          సుందరమ్మను పిల్లలెవరో చేయి పట్టుకొని కొండ్రాజు వద్దకు తీసికెళ్ళారు.
      దుఃఖంతో గడ్డకట్టుకు పోయిన కొండ్రాజుకు మరదలిని ఓదార్చవలసి వస్తే ఎలా ఓదార్చాలో తెలియక ఆమె రాగానే లోపలి గదిలోకి వెళ్ళిపోయాడు. 
           సుందరమ్మ తన తమ్ముడు కాంతారావు చెయ్యి పట్టుకొని ,ఈ ఇంటికి వచ్చేసరికి ఆమెకు పదహారేళ్ళు. ఆ బావగారు ఆమెను తమ్ముడి భార్య మరదలుగా ఎన్నడూ చూడలేదు. తన పెద్దకుతురు గానే చూశాడు. అమ్మా!అని తప్ప ఏనాడూ పేరు పెట్టి పిలువలేదు. భార్యకూ ,మరదలికి చిన్న తగువైయ్యిందని తెలిసినా, "ఎందుకే! ఆ అమ్మాయితో నీకు తగువు. పాపం చిన్నపిల్ల,వదిలెయ్ "అనేవాడు భార్యతో .
      ఈనాడు "ఈమెకు ఇంత కష్టం వచ్చింది. ఎలా ఓదార్చను ?"అని మదనపడుతున్నాడు అతడు.
      సుందరమ్మ  బావగారి గదిలోకి వచ్చింది. మరదలి మొఖం చూడగానే కొండ్రాజు దుఃఖం కట్టలు తెగింది.
       "అమ్మా! నీకూ,నాకూ, భగవంతుడు అన్యాయం చేశాడమ్మా!"  దుఃఖం అతడి  మాటలను మింగేసింది.
       " బావగారూ! దేవుడు నాకన్యాయం చేశాడు సరే, చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకొని, మీలోనే నా తండ్రిని చూసుకొంటున్న నన్ను, మీరు కూడా అన్యాయం చేస్తారా? మీరు ఆరోగ్యంగా వుండి నన్నూ ,నాపిల్లలనూ గట్టెక్కించరా? మీరు ,మీ తమ్ముడి గురించే ఆలోచించి అంతంత మాత్రమైన మీ ఆరోగ్యం పాడుచేసుకొంటే, నేనూ ,నా పిల్లలూ  రేపు రోడ్డున పడతాం! " నిబ్బరంగా మాట్లాడుతున్న మరదలిని చూసి కొండ్రాజుకే కాదు, చుట్టాలకీ, బంధువులకూ కూడా ఆశ్చర్యంవేసింది. ఆ బావా మరదళ్ళ ఆత్మీయతకు అందరూ అబ్బురపడ్డారు.
       మరదలి మాటలు మంత్రంలా పనిచేసి పది పదకొండు రోజుల కార్యక్రమాలు యధావిధిగా జరపడానికి ధైర్యం తెచ్చుకొని జరిపించాడతడు.
           ఇదిగో ఈరోజు కాకి పిండం ముట్టుకోలేదని అందరూ కలవర పడుతున్నారు. సమయం రెండు గంటలు  దాటిపోతోంది. 
        అందరూ అనేక రకాలైన హామీలిస్తున్నారు.  కొండ్రాజుచేత కూడా  బ్రాహ్మలు అనేక హామీలిప్పిస్తున్నారు. " నీ పిల్లలకు సక్రమంగా అన్ని కార్యక్రమాలూ జరిపిస్తాను. "నీ కుటుంబానికి   ఎటువంటి లోటూ రానివ్వను." బ్రాహ్మడు చెప్పినట్లు చెపుతున్నాడతడు వణుకుతున్న గొంతుతో. అసలే కడుపు నిండిన దుఃఖం, పిడచ కాకి ముట్టుకోవటంలేదేమిటనే ఆందోళన, బంధుజనుల సానుభూతి మాటలు, పిల్లలందరి రోదనల  మధ్య అతడి బలహీనమైన శరీరం వణుకుతోంది. అక్కడక్కడే తిరుగుతున్న కాకి ఎందుకు పిడచ ముట్టడంలేదన్న  అనుమానంతో కూడిన బాధ ,హృదయన్ని పిండేస్తూ, కొండ్రాజును నిస్త్రాణలో పడేస్తోంది.
      పిడచ కాకి ముట్టడంలేదన్న మాట మూలగదిలో  వున్న  సుందరమ్మ చెవిన పడింది.
      అక్కడే వున్న తోడికోడలుతో "అక్కయ్యగారూ! బావగారు అన్నం తినకుండా, మీ మరిది ఎప్పుడైనా  ముందుగా అన్నం తిన్నారా? బావగారికి ముందు అన్నం పెట్టండి. కాకి అదే వచ్చి తింటుంది."అంది.
      కొండ్రాజు భార్య భర్తచేతరెండంటే రెండుముద్దలు పెరుగన్నం, బలవంతంగా తినిపించింది. అంతే ! పిడచ తినడం మొదలు పెట్టింది కాకి.
         చూసే వారందరి కళ్ళలో ఆశ్చర్యంతో కూడిన భాష్పాలు.
అవి ఆనందభాష్పాలనే సందర్భం కాదు కనుక అలా అనలేం, ఆశ్చర్చంతోకూడా కన్నీళ్ళు వస్తాయనడనికి,అన్నదమ్ముల ఆత్మీయతకూ ఇది ఒక నిదర్శనం.
    
     
కామెంట్‌లు