చీకట్లో దెయ్యం!:- ఎం. వి. ఉమాదేవి
 చిట్టి పొట్టి బాలల కథలు - 6
======================
రామాపురంలో దానయ్య, శీనయ్య అనే మిత్రులున్నారు. వారు ఓ గురువు దగ్గర కొన్నాళ్ళు చదివి, కులవృత్తులయిన కుండల తయారీ, వ్యవసాయం పనుల్లో కుదురుకుని పెద్దలకి సాయంగా ఉండేందుకు నిర్ణయం తీసుకున్నారు.
    ఓసారి ఇద్దరూ కొన్ని వ్యవసాయ పరికరాల కోసం పట్నం వెళ్ళి, అక్కడ గాలీ వానా రావడంతో చిక్కుకు పోయి తిరిగి రావడం ఆలస్యమై చీకటి పడింది.
చిన్నపాటి అడవి మార్గంలో పయనించిన ఇద్దరూ, అమావాస్య దాటిన రోజులు కావడంతో గుడ్డివెన్నెలలో ముళ్ళ చెట్ల మధ్యనుండి ముందుకు వెళ్ళలేకపోయారు. 
ఆ రోజు మధ్యాహ్నం వచ్చిన దారే అయినా బాట గుర్తులు మర్చిపోయారు. చివరకి ఓ మర్రి చెట్టు కింద చేరి విశ్రాంతి కోసం నడుం వాల్చారు స్నేహితులు.
కాసేపటికి చీకటి మరింత చిక్కబడి నెలవంకని మేఘాలు కమ్మేసేయి. 
" ఒరేయ్ సీనా ! ఈ అడవిలో ఏ క్రూర మృగాలున్నాయో తెలియదు. తెల్లారేసరికి మనం బతికి ఉంటామో లేదో?" అని దానయ్య భయంగా అన్నాడు.
" యేహే పిరికిసన్నాసి! ఊరుకో. నాకైతే ఆకలి వేస్తోంది కూడా. వేకువజామునే వెళ్ళిపోదాం కాసేపు గమ్మున ఉండు!" అన్నాడు శీనయ్య.
కాసేపయ్యాక జంతువులేమీ రాలేదు గానీ, ఎక్కడ నుండో టిక్ టిక్ అని చప్పుడు వినిపించింది. 
ఈ సారి శీనయ్యకే భయం కలుగుతుంది. 
"అరే దానా! మర్రి చెట్టు మీద దయ్యాలున్నాయేమో? తప్పకుండా మనల్ని  చంపేసి నెత్తురు తాగుతాము అని సంకేతాలు ఇవ్వడం చేస్తున్నాయి. " అని గడగడ వణికిపోయాడు. దాంతో ఇద్దరూ దైవ ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నారు.
చుట్టూ చూస్తే ఓ మూల ఊగే జడలతో బాటు ఓ ఆకారం అస్పష్టంగా నిలబడి ఉండి, తల కదిలిస్తూ ఉంది. ఆ తలనుండే టక టక శబ్దం వస్తుంది. 
దాంతో ఇద్దరూ కెవ్వున అరిచి భయంతో స్పృహ తప్పి పడిపోయారు. 
కాస్త తెల్లవారి మెలుకువ వచ్చి చూస్తే, యింకా టక టక శబ్దం వస్తుంది. ఆ మూల చూస్తే ఓ వెదురు బొంగుకి తగిలించిన కొత్త కుండ కదులుతూ ఉంది.
అప్పుడు గుర్తుకు వచ్చింది. పట్నం వెళ్ళినప్పుడు దార్లో తినేందుకు కొత్త కుండలో పెరుగన్నం , ఆవకాయ కట్టిచ్చింది దానయ్య అమ్మ. ఇద్దరూ అది తినేసి, కొత్త కుండని అక్కడున్న వెదురుపొదలో బొంగుకి బోర్లించిపోయారు. 
ఓ వడ్రంగి పిట్ట వెదురుకు రంధ్రం చేసి లోపల కెళ్ళి, పై నుండి బోలుగా ఉండటంతో కుండ వరకూ వెళ్ళి  వెనక్కి తిరిగే దారి లేక ముక్కు తో టక టక కొడుతూ రంధ్రం చేసే ప్రయత్నంలో ఉంది. కుండని పైకెత్తగానే రివ్వున పిట్ట యెగిరిపొయింది.
ఆ చీకట్లో కదిలే కుండనే దెయ్యం తల అనుకున్నామని గ్రహించి మిత్రులిద్దరూ గట్టిగా నవ్వుకున్నారు!!

కామెంట్‌లు