దళిత జాతి ఉద్దారకుడు వర్మ :- నామ వెంకటేశ్వర్లు, S A-జి. ప. ఉ. పా. అయిటిపాముల, -కట్టంగూర్ మండలం, నల్గొండ.

 భూమి మీద మానవులు ఆవిర్భవించిన తర్వాత మానవులు సంచార జీవనం గడిపేవారు, ఆ తర్వాత స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. రక్షణ కోసం గుంపులుగా నివసించేవారు.  ఎవరికి తోచిన పనిని వారు చేసుకునేవారు. కానీ వారి మధ్య ఎటువంటి అంతరాలు కాని హెచ్చుతగ్గులు కానీ ఉండేవి కావు, అనంతర కాలంలో కొంతమంది స్వార్థపరుల వలన సమాజం చీలికలు  పేలుకలుగా మారింది. వీరు ఆచరింప చేసే మూఢాచారాలను సమాజంలో కొందరు దిక్కరించినందుకు వారిని అంటరానివారుగా సమాజానికి దూరంగా ఉంచారు, మనుషులను మనుషులుగా చూడలేదు. ఆ సమయంలో తెలంగాణ ప్రాంతంలో   తన జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడి, సర్వస్వాన్ని అర్పించిన మహానీయుడు భాగ్యరెడ్డి వర్మ. అతను 1888 లో జన్మించాడు. చిన్నతనం నుండి తన చదువు పట్ల చాలా ఆసక్తి కలవాడు, తర్వాత ఆ చదివే అతనికి భవిష్యత్తు గమ్యాన్ని నిర్దేశించింది అని చెప్పవచ్చు.
 ఆనాడు సమాజంలో అణగారిన వర్గాలు అనేక రకాల అవస్థలు అనుభవించేవారు. ఆ అవస్థల నుండి ఆ జాతిని గట్టెక్కించడానికి తన జీవితకాలం అలుపెరుగని విధంగా పనిచేశాడు. తను చదివిన చదువు వలన ఆనాటి సమాజంలో ఉన్నటువంటి ఈ కుల వ్యవస్థకు గల కారణాలైన ధర్మశాస్త్రము, చరిత్రను, పురాణాలను బాగా చదివాడు. అంటరాని వర్గాల అవస్థలకు కారణమైన వాటిని నిరసించాడు. వారి కడగళ్లను అర్థం చేసుకొని వారిలో సామాజిక వికాసం కలిగించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అత్యంత ముఖ్యమైన పనికి సంబంధించిన ఆచరణ,  ఆలోచనలో ఆయన పూర్తి స్వేచ్ఛను అనుభవించి స్వతంత్రంగా పనిచేశాడు. ఈ పని చేయటంలో ప్రభుత్వం వైపు నుండి కూడా ఆయన గారికి మంచి అండ లభించింది. ఆయన గారికి ముందుగా అణగారిన కులాల నాయకులతో క్రమంగా పరిచయం పెంచుకున్నాడు. క్రమంగా ఆ నాయకులనుండి సహకారం,  నైతిక మద్దతు  కూడగట్టుకున్నాడు, మహనీయుల, సంస్కర్తల లో ఉండే చిత్తశుద్ధిని అలవర్చుకుని అంటరాని వర్గాల ఉన్నతి కోసం సంస్కరణలు మొదలుపెట్టాడు. 
        ఒకవేళ హిందూ మతం, హిందువులు తమ చరిత్రను రాసుకోవాలనుకుంటే హిందూ మత సంస్కర్తగా మొదటగా భాగ్యరెడ్డి వర్మ పేరు మొదటి స్థానంలో ఉండాలి. కానీ ఇప్పుడు కొందరు మేమే అసలైన హిందువులం, మేము చెప్పినట్లు వినాలి అంటున్నారు. కానీ ఎవరు నిజమైన హిందువులో మనం గ్రహించాలి. అణగారిన వర్గాల అభివృద్ధి కోసం తన సర్వస్వాన్ని అర్పించిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ, అంతేకాకుండా తన మేధాసంపత్తినంత అందుకోసం ధారబోసిన గొప్పవాడు. ఎటువంటి లాభ పక్ష లేకుండా తమకోసం ఎప్పటికీ పనిచేసే ఆయనను చూసి అంటరాని వర్గాలన్నీ ఆయనను తమకు తిరుగులేని నాయకుడు భాగ్యరెడ్డి వర్మ నే  అని ఒప్పుకున్నారు. చిత్తశుద్ధి నిజాయితీ పట్టుదలతో పనిచేసే వర్మ అతి కొద్దిగా కాలంలోనే ఆ ప్రజల నమ్మకాన్ని చూరగొనగలిగాడు. తమ దుస్థితికి  కారణము తమ అజ్ఞానం ఉదాసీనతేనన్న ఎరుకను తన అనుచరులలో కలిగేటట్టు చేయగలిగాడు వర్మ గారు.              
           మనుషులంతా పుట్టుకతో సమానమని ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదనే సత్యాన్ని తెలుసుకునేటట్లు చేశాడు. కానీ అప్పటికే ఆ సమాజంలో ఇంకిపోయిన మూఢనమ్మకాలు, తొలగించడం,  అజ్ఞానాన్ని తొలగించడం అంత సులువు కాదన్నది వర్మ గారు గ్రహించారు, ఆధునిక కాలంలో కూడా చంద్ర లక్ష్మీనారాయణ గారు చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ( నేను ఇప్పుడు చెప్పే మాటలు విని ఆచరించకపోవచ్చు కానీ తర్వాత మీరే వాటికి కోరస్ అందుకుంటారు ) అయినా అంటరాని వర్గాలలో మార్పు తేవాలంటే ముందుగా చదువు నేర్పాలని అనుకుని చదువుపై శ్రద్ధ వహించాడు వర్మగారు. ఆ తర్వాత కొన్ని దురాచారాలు మాయం కావడం జరిగింది. ఆనాడు సమాజంలో ఉన్న దురాచార్యులు వేశ్య,దేవదాసి, మురళి, ఆడ మగ చిన్న పిల్లలను దేవునికి వదిలేయడం అనే సంప్రదాయాలను రూపుమాపడానికి ఎంతో శ్రమించడం జరిగింది. ఆ వర్గాలలో ఉన్న ఇంకొక అలవాటు తాగుడు,  దానిని మానిపించడం అనేది అక్కడ పెద్దల సహకారంతో సాధ్యమైంది. వీటి కోసం నిరంతర కార్యాచరణ, అతనికి దొరికే సహకారంతో ఆయన కొన్ని కుటుంబాల నైనా మాన్పించగలిగాడు. 
      1925లో ఆది హిందువులకు ఆటల పోటీలు పెట్టి అందులో అందరూ సమానంగా రాణిస్తారని నిరూపించాడు. వీటి కోసం ఆయన అనేక సభలకు హాజరయ్యేవారు,   దాని ద్వారా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాడు. అందులో ఆంధ్ర మహాసభ ఆది హిందూ మహాసభ. ప్రతి సభలో తన జాతి ఎదుర్కొంటున్నటువంటి దుర్భర పరిస్థితులను వివరించేవాడు. అతని జీవితంలో మొత్తము 3348 ఉపన్యాసాలు ఇచ్చినట్లు తెలిసింది. ఈ సభల ద్వారా వారిలో చైతన్యం  తేవడానికి ప్రయత్నించాడు, 
         వర్మ గారు చేపట్టిన నిరంతర కార్యాచరణ వలన ఎందరో ఒక పెద్దల మన్ననలను చూరగొనగలిగాడు. వర్మ గారి నిరంతర కార్యచరణ వలన,  సభల ద్వారా ఆ సమాజం జాగరుకమైంది. ఆది హిందువుల సొంత కాళ్ల ఫై నిలబడడానికి చదువు ఒకటే మార్గం అని అన్నారు. అదే తర్వాత కాలంలో డా " బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అమలు చేశారు. ఈ విషయంలో కూడా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి వారి బాధ్యతను గుర్తు చేశాడు.
      వర్మ గారి కృషి ఫలితం గా ప్రభుత్వం ఆది హిందువుల కోసం ఎన్నో పాఠశాలలను నెలకొల్పింది. 1931లో జనాభా లెక్కల సందర్భంగా వర్మ గారు ఎంతో శ్రమపడి అంటరాని వర్గాలను ఆది హిందువులుగా నమోదు చేయించాడు. అది ఆయన నాయకత్వ పటిమకు మచ్చుతునక. ఇప్పటికీ ఎప్పటికీ హిందూ సమాజం మొత్తంగా ఇతనికి రుణపడి ఉండాల్సిందే. ఆచర్యతో ఆనాటి హిందూ సమాజాన్ని  చీలికలు పేలికలు కాకుండా కాపాడగలిగాడు. 
       ఇతనికి ముందే  ఉత్తర భారత దేశంలో ఈ మార్గాన్ని అనుసరించిన వారు మహాత్మా జ్యోతిరావు పూలే గారు, వర్మ తర్వాత ఆ మార్గంలో నడిచినటువంటి వారు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు.  వీరందరి తర్వాత ఇప్పటికీ ఈ వర్గాలకు,  ఈ సమాజానికి అంతటికి రక్షణ కల్పిస్తున్నది రాజ్యాంగం. అయినా ఇప్పటికీ మన సమాజంలో ఆజాడలు (అంటరానితనం )విపరీత ధోరణులు తొక్కుతున్నాయి. ఆనాడు చదువుకుంటే సమాజంలో ఉన్నటువంటి ఇలాంటి ఆచార సంప్రదాయాలు అంతం చేయవచ్చు అన్నారు పెద్దలు. ఈనాడు సమాజం చదువు పెరిగే కొద్దీ చెడు ఆచారాలకు, సంప్రదాయాలకు ప్రజలు దగ్గరవుతున్నారు. అలా కాకుండా ఆనాటి మహనీయులనాదర్శo తీసుకుని, ఈ నాటి  సమాజo సమసమాజంగా వర్ధిల్లాలని మనమంతా కోరుకుందాం. అప్పుడే వారి శ్రమ నిష్ఫలం  కాకుండా ఉంటుంది. వారిని గౌరవించినట్టుగా ఉంటుంది. 
     
     
కామెంట్‌లు