సునంద భాష్యం:- వురిమళ్ల సునంద ఖమ్మం,
 న్యాయాలు-916
అభి భూతి భయా దసూనతః సుఖముజ్ఝంతి న ధామ మానినః న్యాయము
*****
అభిభూతి అనగా  ఓటమి,పరాభవము, అవమానము. భయాద అనగా భయము. అసూనతః అనగా అసూయ, ఓర్వలేని తనము.సుఖము అనగా ఆనందము, సంతోషము, సౌఖ్యము.ఉజ్జంతి అనగా విడిచి పెట్టు, వదిలిపెట్టు తప్పించుకొను.అధామ అనగా నీచమైన, హీనమైన,చెడ్డదైన.మానిన అనగా అభిమానము గలవాడు,గర్వితుడు అనే అర్థాలు ఉన్నాయి.
మానవంతులయిన వారు అవమాన భయము చేత సుఖమును, ప్రాణములను గూడ వదిలి పెడతారు గానీ తమ కీర్తిని వదిలిపెట్టలేరు.
ధనుడు అంటే సంపద కలవాడు. ఇక్కడ అభిమానమనే ఒక గొప్ప సద్గుణమును ఒక ధనంగా,సంపదగా చేసుకున్న వాడు. ఆ విధంగా అతడు కీర్తిని సంపాదించుకున్నవాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తన కీర్తిని పోగొట్టుకోవడానికి ఇష్టపడడు అనే అర్థంతో మన పెద్దలు ఉదాహరణగా ఈ అభిభూతి భయాద సూనతః సుఖముజ్ఝంతి న ధామ మానినః" న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
 దీనికి సంబంధించిన ఓ అద్భుతమైన పద్యాన్ని బమ్మెర పోతనామాత్యుడు శ్రీ మహా భాగవతం రాశాడు.ఇది వామన చరిత్ర ఘట్టంలోనిది. వామనునకు ఇచ్చిన దానము వెనక్కి తీసుకోమని చెప్పినప్పుడు బలి చక్రవర్తి మాట్లాడిన మాటలు ఇవి.
" బ్రతుకవచ్చు గాక బహుబంధనము లైన/ వచ్చు గాక లేమి వచ్చు గాక/ జీవధనములైన జెడుగాక పడుగాక/మాట దిరుగ లేరు మానధనులు!"
అనగా మన జీవితంలో బాగా సిరిసంపదలతో బతుక వచ్చు గాక! మన జీవన గమనంలో ఎన్నో అడ్డంకులు- ఆటంకాలు కలిగితే కలుగవచ్చు గాక! జీవితంలో దారిద్ర్యం కూడా రావచ్చు గాక.జీవితం అష్టకష్టాలలో పడవచ్చు గాక!జీవితమనే ధనమే పోవచ్చు గాక! అంటే మరణమే సంభవించ వచ్చు గాక!  లేదా జీవితం-ధనం రెండూ కూడా నష్టమై పోవచ్చు గాక! చివరికి నేలపై పడి పోవచ్చు గాక.. ఇలా ఇన్ని జరిగినా సరే.గౌరవమే ధనముగా జీవిస్తున్న మహాత్ములు ఇచ్చిన మాట తప్పరు.
అనగా అభిమానమే ధనముగా కలవారు మానవంతులయిన వారు అవమానానికి ఇష్టపడరు. అవమానం పొందుతామో ఏమో అని మొదలే ఆ భయము వల్ల సుఖవంతమైన జీవితమును, తప్పనిసరి పరిస్థితుల్లో తమ ప్రాణములనైనా వదిల పెడతారు గానీ తమ కీర్తిని మాత్రం వదిలిపెట్టలేరు.
 మరి మనం ఈ న్యాయము ద్వారా నేర్చకోవలసిన విషయం ఏమిటంటే ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ఇలా ఇచ్చిన మాట తప్పకుండా బ్రతకాలి. అలాగని  ఎవరో ఏదో అన్నారని,ఆవమానించారని వారి మాటలకు భయపడాల్సిన అవసరం లేదు. ప్రాణాలు పోగొట్టు కోవాల్సిన బలహీనత కూడదు.ఎల్లప్పుడూ మనదైన ఉన్నతమైన వ్యక్తిత్వమే మనల్ని సమాజంలో ఉన్నతమైన వ్యక్తిత్వం గల వాడిగా గుర్తిస్తారు. మనషులుగా బతికేది అలాగే కదా!  మరి మీరు నాతో ఏకీభవిస్తారు కదూ!

కామెంట్‌లు