శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ :- భాగం - 28
 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
7.చతుర్బాహుసమన్విత(అష్టాక్షరీ)8.రాగస్వరూపపాశాఢ్యాయ
                          (అష్టాక్షరీ)
ఎనిమిదవ నామ మంత్రము -  ఓం రాగస్వరూప పాశాఢ్యాయై నమః 
"పాశాఢ్య" అంటే, పాశమును ధరించినది.
అమ్మ అయిన లలిత, తన స్వస్వభావమైన అనురాగానికి గుర్తుగా, తన నాలుగు చేతులలో, ఎడమవైపు క్రింది చేతిలో "అనురాగ పాశాన్ని" పట్టుకుని దర్శనం ఇస్తోంది. అటువంటి అనురాగ మూర్తికి నమస్కారము.
రాగస్వరూప పాశాన్ని పట్టుకుని అమ్మ, తనను భక్తితో, శ్రద్ధగా కొలిచే వారిని తన బిడ్డలుగా దగ్గరకు తీసుకొని, వారి కోరికలను తీర్చి, సంతోషాలను అందిస్తోంది.
బంధము=పాశము=రాగము=అనురక్తి ఇవి ఒకదానికొకటి పర్యాయ పదాలు. ఇది మనసుకు సంబంధించిన లక్షణము. ఒక వస్తువు లేదా వ్యక్తి మీద మనకు కలిగే ఇష్టమే "రాగము". ఈ "ఇష్టం" కారణంగానే మనిషి, మళ్ళీ మళ్ళీ పుట్టడం, మరణించడము జరుగుతోంది. దీనినే శంకరభగవద్పాదులు "పునరపి జననం పునరపి మరణం! పునరపి జననీ జఠరే శయనం" అని చెప్పారు. ఈ "ఇష్టాన్ని" తన దైవభక్తి చేత బంధించగలిగిన వారు, ముక్తిని పొందారు.
ఈ సంసార చక్రంలో పడి, ఇష్టాల ప్రవాహం లో కొట్టుకుపోతే ఏమౌతుందో చెప్పే కథలే "సన్యాసి - కౌపీనం" మరియు "జడభరతుని కథ".
మానవుని మనసులో/బుద్ధిలో ఏర్పడే అరిషడ్వర్గాలను తాను అదుపులో వుంచేందుకు అంకుశాన్ని తన క్రింది ఎడమచేతిలో ధరించింది అమ్మవారు. ఈ "అనురాగ అంకుశాన్ని" వుపయోగించి తన భక్తులను తన దగ్గరకు రప్పించుకుని, వారికి మరో జన్మ లేకుండా చేసి, మోక్ష ప్రాప్తి కలిగిస్తోంది, అమ్మలగన్నయమ్మ.
జగన్మాతను స్మరించి నమస్కరించేడప్పుడు ఓం రాగస్వరూప పాశాఢ్యాయై నమః అని అనాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు