ఒక అడవిలో ఒక నక్క వుండేది. అది పెద్ద దొంగది. ఎవరెవరిని ఎప్పుడెప్పుడు ఎట్లెట్లా మోసం చేయాల్నా అని చూస్తా వుండేది. ఒకసారి ఆ నక్కకు అడవిలో మోసం చేయడానికి ఎవరూ దొరకలేదు. వెదికీ వెదికీ అలసిపోయింది. ఎట్లాగబ్బా అని ఆలోచిస్తా వుంటే దానికి భూమమ్మ కనబడింది. భూమమ్మ చానా మంచిది. అమాయకురాలు. ఎవరేమడిగినా కాదనకుండా సాయం చేస్తా వుండేది.
నక్క భూమమ్మను చూడగానే వురుక్కుంటా దగ్గరికొచ్చి ''అమ్మా... అమ్మా... చానా ఆకలిగా వుంది. నాలుగురోజుల నుండీ తిందామంటే తిండి లేదు. కొందామంటే డబ్బులు లేవు. ఆకలితో నేనూ, నా పెండ్లాం బిడ్డలు చచ్చిపోయేటట్లున్నాము. ఒక వెయ్యి రూపాయలు అప్పివ్వమ్మా... వారంలోగా తిరిగిచ్చేస్తా'' అనింది. భూమమ్మకు నక్క దొంగఎత్తులు తెలీవు గదా... దాంతో నిజమని నమ్మి వెయ్యి రూపాయలు ఇచ్చేసింది.
ఇంగచూడు నక్క ఒకటే జల్సా... లడ్లు, కర్జికాయలు, కారాలు, బూందీలు, పనసపండ్లు, మామిడిపండ్లు, నన్నారీలు, నారింజరసాలు ఒకటని గాదులే... ఏది కనబడితే అది... ఎంత చెబితే అంత... ఒకటే తినేది. తాగేది. అట్లా వారానికల్లా పైసాగూడా మిగల్చకుండా నున్నగా కాజేసింది.
వారం దాటగానే భూమమ్మ వచ్చింది. ''నక్కా... నక్కా... వారం దాటగానే నా వెయ్యి రూపాయలు నాకిస్తానంటివి గదా... ఇయ్యి'' అనింది. ఇంకెక్కడి వెయ్యి రూపాయలు అన్నీ ఎప్పుడో పొట్టలోనికి వెళ్ళిపోయినాయి గదా.... దాంతో ఆ నక్క ''అమ్మా... అమ్మా... నీ డబ్బులు తేవడానికే నా పెండ్లాం వాళ్ళ పుట్టింటికి పోయింది. ఇట్లా తీసుకోని రావడం ఆలస్యం అట్లా నీ చేతిలో పెట్టేస్తాలే... ఈ ఒక్కవారమాగు'' అనింది. భూమమ్మ సరేనంటూ వెళ్ళిపోయింది.
వారం దాటగానే భూమమ్మ మళ్ళా వచ్చి ''నక్కా... నక్కా... ఈ రోజు నా వెయ్యి రూపాయలు నాకిచ్చేస్తానంటివి గదా... ఇయ్యి'' అనింది. ''అరే... ఇదేందిరా నాయనా ఇట్లా తగులుకుంది ఫారం కంపలెక్క'' అని నోట్లోనే తిట్టుకుంటా ''అమ్మా... వారం నుండీ ఒకటే జ్వరం. లెయ్యడానికీ లేదు. కూచోడానికీ లేదు. డబ్బులన్నీ మందులకే అయిపాయ. ఇంకొక్క వారమాగు. ఇస్తాలే'' అనింది. భూమమ్మ సరేనంటూ వెళ్ళిపోయింది.
భూమమ్మ అట్లా పోవడం ఆలస్యం ''ఈడుంటే ఇది వదిలేటట్లు లేదు'' అనుకోని వున్నవన్నీ మూటగట్టుకోని శ్రీశైలం అడవుల్లోకి పారిపోయింది. ఆడ హాయిగా తిరుగుతా వుంటే వారం దాటగానే భూమమ్మ వచ్చేసింది. 'అరే ఇది ఈడికి గూడా తగలబడిందే... దీని కన్నుగప్పి తప్పించుకోవటం ఎట్లారా నాయనా' అని గొణుక్కుంటా ''అమ్మా... నా కొడుక్కి కాలు నొప్పంటే కిందామీదా పడతా బండి బాడుగకు కట్టుకోని ఈడికొస్తి. డబ్బులంతా బాడుగకే అయిపాయ. ఇంకోవారమాగు ఇస్తా'' అనింది. భూమమ్మ సరేనంటూ వెళ్ళిపోయింది.
భూమమ్మ అట్లా పోవడం ఆలస్యం ''ఇదేందిరా నాయనా... ఇది ఇట్లా పట్టుకోనింది. దీన్ని వదిలిచ్చుకోవాలంటే ఇట్లా దగ్గర దగ్గర వూర్లు కాదు. కనుచూపు మేరలో ఆనవాలు గూడా కనిపించనంత దూరం వెళ్ళిపోవాల'' అనుకోని తట్టా బుట్టా సర్దుకోని ఈసారి ఏకంగా ఏడు జిల్లాలు దాటి పారిపోయింది. ఆడ హాయిగా కాలు మీద కాలేసుకోని ఆడుకుంటా పాడుకుంటా తిరుగుతా వుంటే వారం దాటడం ఆలస్యం భూమమ్మ ఎప్పట్లాగానే దాని దగ్గరికి వచ్చేసింది.
ఆమెని చూసి నక్క అదిరిపడింది. ''అవురా... ఎంత అమాయకంగా తిక్కదానిలెక్క తిరుగుతా వున్నా. ఐనా భూమమ్మ లేనిదెక్కడ. ఇక దీన్ని తప్పించుకోవడం అంటే మాటలు కాదు. ఎవరైనా సరే కలలో గూడా వూహించనంత ఎత్తు వేయాల'' అనుకోని ''అమ్మా.. నీకు వారం వారం అంటా ఇట్లా తిప్పించుకోడానికి నాకే సిగ్గేస్తా వుంది. కానీ ఏం చేద్దాం. కాలం అట్లా వుంది. ఈ వూర్లో ఒకడు నాకు మూడువేలు అప్పు వున్నాడు. అవి వసూలు చేసుకోడానికే ఇంత దూరం వచ్చినాను. నాలుగు రోజులాగు. వడ్డీతో సహా తిరిగిచ్చేస్తానన్నాడు. ఈ ఒక్కవారమాగు'' అనింది. దానికి భూమమ్మ 'సరే కానీ... ఇదే ఆఖరిసారి... ఏమోలే పాపం అనుకుంటా వుంటే ఏదో ఒకటి చెబుతా వూరికే తిప్పిస్తా వున్నావు. ఇంగోసారిలా చేస్తే మర్యాదగా వుండదు. అడవిలో అందరినీ పిలిచి పంచాయితీ పెట్టి పరువు తీస్తా'' అని హెచ్చరించి పోయింది.
నక్కకు ఎట్లా తప్పించుకోవాల్నో తోచలేదు. అట్లాగని డబ్బులూ ఇయ్యబుద్ధి కాలేదు. ఇంతవరకూ ఎప్పుడూ ఎవరికీ లొంగలేదు. ఇదేంది ఇప్పుడిట్లా అయింది అని ఆలోచించుకుంటా అడవిలోనికి పోయింది. ఒకచోట ఒక జొన్నదంటు కొశ్శగా కనబడింది. ఏదయితేనేం అనుకోని దాన్ని తీసుకోని ఎవరూ చూడకుండా ఒక పెద్ద చీకటి గుహలోనికి పోయి కంటికి ఒక పక్కగా, కన్ను దెబ్బ తినకుండా కసుక్కున పొడుచుకోనింది. అంతే.. దెబ్బకు సుర్రుమని రక్తం కారి రెప్పంతా ఎర్రగా వాచిపోయి కన్ను మూసుకోనిపోయింది. వారం తిరిగేసరికి భూమమ్మ మళ్ళా నక్క దగ్గరకు వచ్చేసింది. ''నక్కా... నక్కా... ఈ సారి నా వెయ్యి రూపాయలు నాకు ఖచ్చితంగా ఇచ్చేస్తానంటివి గదా...ఇయ్యి'' అనింది.
నక్క అమాయకంగా ముఖం పెట్టి ''వెయ్యి రూపాయలా... నేను నీకు ఇవ్వాల్నా.. ఎందుకు'' అనింది. ఆ మాటలకు భూమమ్మ అదిరిపడి ''అదేంది... అట్లా అంటివి. నా దగ్గర వెయ్యి తీసుకోని పదివారాల నుండి రేపు రేపంటూ తిప్పుతా ఇప్పుడు ఏమీ ఎరుగని నంగనాచి లెక్క మాట్లాడతా వున్నావు'' అనింది.
ఆ మాటలకు నక్క కోపంగా ''ఏందీ... నేనా... నంగనాచినా... చూడమ్మోవ్... నువ్వెవరని ఎవరి దగ్గరికొచ్చినావో గానీ నువ్వు చెప్పేది ఒక్క ముక్కా అర్థం కావడం లేదు. ఇంతకీ నువ్వు ఇచ్చింది ఒక్క కన్నున్న నక్కకా, రెండు కళ్ళున్న నక్కకా'' అనింది.
ఆ మాటలకు భూమమ్మ ''రెండు కళ్ళ నక్కకే'' అనింది. వెంటనే ఆ నక్క ''అదీ అట్లా చెప్పు. చూడు... నాకుండేది ఒక్క కన్నే.. రెండోది చిన్నగున్నప్పుడే దంటుదెబ్బ తగిలి పోయింది'' అంటూ చూపిచ్చింది. ఎర్రగా మాడిపోయిన ఆ కన్ను చూసి భూమమ్మ నిజమని నమ్మి ''అరెరే... పొరపాటయిపోయింది. ఏమీ అనుకోవద్దు. అనవసరంగా నిన్ను అనరాని మాటలన్నాను'' అని బాధపడి వెళ్ళిపోతా వుంటే ఆ నక్క.
''అమ్మా... అమ్మా... నువ్వు అడిగిన వాళ్ళకంతా కాదనకుండా సాయం చేస్తా వుంటావంట కదా... అడవంతా తెగ చెప్పుకుంటా వుంటారు. గుడ్డిదాన్ని... ఒక కన్ను అసలు లేనిదాన్ని... వచ్చేవారం మా పిల్లకు పెళ్ళిచూపులు. ఒక ఐదువేలుంటే ఇవ్వమ్మా... పంట రాగానే తిరిగిచ్చేస్తాను'' అనింది. దాని దొంగ మాటలకు ఆ అమాయకపు భూమమ్మ జాలిపడి ''సరే... తీసుకో... కానీ ఆ దొంగనక్క లెక్క నన్ను మోసం చెయ్యొద్దు'' అనింది. నక్క సంతోషంగా సరేనంటూ దొంగ వినయం నటిస్తా ఐదువేలు తీసుకోనింది.
భూమమ్మ అట్లా పోవడం ఆలస్యం సంబరంగా ఆ డబ్బు తీసుకోని వురుక్కుంటా పక్కూరులోని పేరు మోసిన ఒక వైద్యుని దగ్గరకు పోయి వేయి రూపాయలు ఖర్చుపెట్టి మంచి మంచి మందులు తెచ్చుకోనింది. భూమమ్మకు కనబడకుండా ఒక పెద్ద కొండ ఎక్కి గుహలో దాక్కోని రోజూ మందులు వేసుకోసాగింది. పదిరోజులు దాటగానే కన్ను వాపంతా తగ్గిపోయి మళ్ళా మామూలయిపోయింది. దాంతో నాలుగువేలూ తీసుకోని మళ్ళా తన వూరికి వచ్చేసింది.
నక్కను చూడగానే భూమమ్మ వురుక్కుంటా వచ్చి ''యాడికి పోయింటివే నువ్వు. నా వెయ్యి రూపాయలు నాకియ్యకుండా'' అని పట్టుకోనింది. దానికా దొంగనక్క ''ఎంత మాటంటివమ్మా నువ్వు. నిన్ను మోసం చేయడమా... పురుగులు పట్టిపోతారు అట్లా చేస్తే. నీకు డబ్బులివ్వడం కోసమని మా అత్తోళ్ళ వూరికి పోయి రోజూ కూలీ చేసి ఈ డబ్బులు సంపాదించుకోనొస్తి. తీసుకో'' అంటా వెయ్యిరూపాయలు చేతిలో పెట్టింది. భూమమ్మ సంతోషంగా వెళ్ళిపోయింది.
అదట్లా పోవడం ఆలస్యం నక్క నవ్వుకుంటా మిగతా మూడువేలు ఖర్చు పెట్టి జల్సా చేసుకోసాగింది. ఐదువేలు తీసుకున్న గుడ్డినక్క ఏమయిపోయిందో, యాడికి పోయిందో అర్థం గాక భూమమ్మ వెదుక్కుంటా తిరగసాగింది.
***********


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి