బాల్యం కావ్యం! జీవనం శ్రావ్యం!:- డా. పివిఎల్ సుబ్బారావు. విజయనగరం,-9441058797
 1.
ఇష్టం అమ్మ చల్లనిఒడి,
   శ్రేష్టం నాన్న వెచ్చనిమడి!
సద్గురువులతో నిండిన,
     మా బడే విజ్ఞానం గుడి! 
మా చిలిపితనం ఆనందాల, ఆటలకు అదే చక్కని చావడి!
నేర్చిన అక్షరాల వరవడి,
భావి జీవితాన సరి ముడిపడి!
ఆ తలపులొచ్చినప్పుడల్లా,
ఏనాడు ఆగదు ఈ కళ్ళతడి!
ఆ తలుపులకు జీవితాన ఏనాడు పడదు అడ్డగడి
నేటి సమస్యల రాపిడి, అనుక్షణం ఆరడి అలజడి! 
మా బడి నేర్పిన విలువలే,
 నా బతుకున పట్టుబడి! 
నా వ్యక్తిత్వానికి గట్టి,
 పునాది అక్కడే వేయబడి! 
ఈనాడు నా అస్తిత్వంతో, లోకాన నాదే ఏలుబడి! 
2.
మా గురువుల నిరంతర, బోధన నా అనన్య సాధన! 
నేటికీ వెన్నంటి ఉంది,
     నాపై వారి దివ్య దీవెన!
వారిచ్చిన రక్షణ కవచం, కర్తవ్యాన సమయపాలన! 
బతుకంతా కట్టుబాటే,
ఒక్కటే అలవాటు సత్యశోధన!
బతుకు నదిలా సాగిపోవాలని,
చేస్తున్నా దృఢ ప్రతిన! 
3.
మానవ జీవన ,
మకరంద మాధుర్యం బాల్యం! 
బాల్య మధుర స్మృతులే, జీవనపథ గమన శ్రుతులు!
 నాడు చవిచూసిన ఆపేక్షే, జీవితాన శ్రీ రామరక్ష!
 పట్టిన అక్షర దీక్షే ,
గెలిపిస్తోంది ప్రతి పరీక్ష !
సరి జీవనసౌధ పునాది,
 మరి నిత్యం బ్రతుకు ఉగాది!
4.
పసితనం జడిసిపోతే ,
జీవితం చెల్లాచెదురైపోతుంది! 
వసివాడని బాల్యం జీవన, పసిడివాడ సుందర హర్మ్యం!
 పుణ్యపురుషుల బాల్యం, నేటికీ అనుసరణీయం !
రేపటి పౌరుల నిర్మాణమే, మానవజాతి ప్రథమ లక్ష్యం!
 బాల నేరస్తులు లేని భావి, సమాజమే శ్రేయోరాజ్యం!
__________________________________________
బాలల దినోత్సవం ,
నవంబర్ 14 
గ్రంథాలయ వారోత్సవాల,
ప్రారంభ దినం.
శుభాకాంక్షలతో


కామెంట్‌లు