చారిత్రక ధ్రువతార రుద్రమదేవి :- -- కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి- సెల్ : 9441561655

  తెలుగు జాతి చరిత్రలోనే కాదు యావత్ దక్షిణ భారతదేశ చరిత్రలో ఒక ప్రముఖ రాజవంశం కాకతీయుల వంశం. తెలంగాణను పరిపాలించిన రాజవంశాలలో కాకతీయుల పాలనా కాలం ఒక స్వర్ణయం. శాతవాహనుల అనంతరం తెలుగు ప్రాంతాలను, తెలుగు జాతిని  ఏకం చేసి ఒక్క తాటి మీదకు తెచ్చిన రాజవంశీయులు కాకతీయులు. కాకతీయుల రాజులలో అగ్రగన్యుడు గణపతి దేవుడు.  అతడికి పుత్ర సంతానం లేనందున తన రెండో కూతురైన రుద్రమదేవికి  చిన్నప్పటి నుండే శివదేవయ్య  సారథ్యంలో     పరిపాలనాపరమైన  విలువిద్యను,  గుర్రపు స్వారీని నేర్పించాడు. గణపతి దేవుడి మంత్రి అయిన జాయపసేనాని  వద్ద రుద్రమదేవి నాట్య శాస్త్రాన్ని, పాలనాపరమైన శిక్షణను  అభ్యసించింది. అంతేకాకుండా  సంగీత,  సాహిత్య కళలలో నైపుణ్యం సాధించింది. రుద్రమదేవి పుట్టుక గూర్చి చరిత్రకారులలో ఏకాభిప్రాయం లేనప్పటికీ , క్రీస్తుశకం 1220లో గణపతిదేవ చక్రవర్తి,  సోమాంబ దంపతులకు  జన్మించినట్లు గణపతి దేవుని "మార్కాపురం " శాసనం తెలియజేస్తుంది.
        క్రీస్తుశకం 1259లో  గణపతి దేవుడు తదనంతరం  పుత్ర  సంతానం  లేనందున  తన కూతురు రుద్రమదేవిని  పురుషుడిగా పెంచి  కాకతీయ సింహాసనంపై  అధిష్టింప చేశాడు.  ఆ క్రమంలోనే  తండ్రి గణపతి దేవుడు పరిపాలనాపరమైన  అంశాలలో,  శక్తివంతమైన యుద్ధ విద్యలలో తర్ఫీదునిచ్చాడు. యుద్ధ విద్యలతో పాటు రాజనీతి, న్యాయ, రాజ్య పాలన, అర్థశాస్త్రలలో సుశిక్షితురాలైంది. రాణి రుద్రమదేవి కాకతీయ వంశానికి చెందిన గొప్ప ధైర్యశాలి అని చెప్పవచ్చును.  మహిళలు అబలలు మాత్రమే కాదు,  సబలలు అని నిరూపించిన వీర వనిత. మంచి పరిపాలనదక్షురాలు. రణరంగంలో కత్తి పట్టి యుద్ధం చేసి విజయ దుందుభి మోగించింది. తన తండ్రి వద్ద రాజనీతి విద్యలు నేర్చుకుని , గణపతి దేవుడి మరణానంతరం క్రీస్తు శకం 1262లో పట్టాభిషేక్తురాలై కాకతీయ సామ్రాజ్యాన్ని దేదీప్యమానంగా   పరిపాలించింది.  రాజ్యపాలనలో మెలకువలను  నేర్చుకుని పరాయి రాజుల వ్యవహారాలపై ఎట్ల దృష్టి పెట్టాలనో చూసి విజయాలు సాధించింది. స్త్రీ సాధికారిత,    ధీరత్వానికి   ప్రతీకగా నిలిచిన ఆమె  పురుష వేషం ధరించి  యువరాజు వలె శత్రు సైన్యాన్ని గడగడలాడించింది. భారతదేశ  రాజ్య పరిపాలనలో  ఒక స్త్రీ అధికారం చేపట్టడం ఆనాటి రోజులలో  ఒక రికార్డు. దాదాపు 750 సంవత్సరాల క్రితం  పురుషాధిక్యత కల్గి  ఎదురులేని ఆ కాలంలో,  రుద్రమదేవి ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. రుద్రమదేవి  తన పరిపాలన కాలమంతా ప్రధానంగా యుద్ధాలలో గడిచిపోయింది. ఆమె ఒక స్త్రీ అనే నెపంతో అనేకమంది హరిహర, మురారి దేవులు వంటి సామంత రాజులు ప్రతిఘటించారు. యాదవుల వంటి   శత్రు రాజ్యాల వారు దండెత్తినారు. ఆ తిరుగుబాట్లను రుద్రమదేవి తనకు విశ్వాస పాత్రులైన రేచర్ల ప్రసాదిత్యుడు,   కాయస్థ జన్నిగదేవుడు, గోనగన్నారెడ్డి మొదలైన సేనానుల సహాయంతో తిరుగుబాటులను         అణచివేసింది.  ఎంతో శక్తిసామర్థ్యాలతో  వాటిని  తిప్పికొట్టింది. అనేకమంది సామంత రాజులు తిరుగుబాటు చేసి స్వాతంత్ర్యం  ప్రకటించుకున్నారు. అయినప్పటికీ రుద్రమదేవి మొక్కవోని ధైర్యంతో తన రాజ్యాన్ని కాపాడుకోవడంలో సఫలీకృతురాలయింది.  ఇప్పటి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు పాలకుడైన చాళుక్య వీరభద్రుడికి రుద్రమదేవితో  భద్రకాళి, కాకతమ్మ, ఏకవీర దేవతల సాక్షిగా, అంగరంగ వైభవంగా స్వయం  భూదేవాలయ   సువిశాల ప్రాంగణంలో  వివాహం జరిగింది. ఆమెకు ముమ్మడాంబ, వీర రుద్రమ , రుయ్యమ్మ  అనే  ముగ్గురూ కుమార్తెలే. తన కూతురుకు కూడా మగసంతానం లేనందున గణపతి దేవుడు కలత చెందాడు. మరొక ప్రక్క గణపతి దేవుడుని వృద్ధాప్యం వెంటాడుతుంటే,  తన కూతురు రుద్రమ్మ దేవి భర్త  చాళుక్య వీరభద్రుడు దుర్వ్యసనాలకు లోనై  అనారోగ్యానికి గురై  అతి కొద్ది కాలంలోనే  చనిపోవడం జరిగింది. ఈ సంఘటనలు రుద్రమదేవికి ఆశని పాతం లాగా మారాయి. కానీ ఆమె ధైర్యం చెక్కుచెదరలేదు.  మూడో కుమార్తె ముమ్మడమ్మకు మహాదేవరాజుకు కలిగిన సంతానమే ప్రతాపరుద్రుడు. తన మనుమడైనా ప్రతాపరుద్రుడిని దత్తత తీసుకుంది. ఆమె మరణానంతరము ప్రతాపరుద్రుడు కాకతీయ రాజ్యాన్ని  క్రీస్తు శకం 1289లో  అధిష్టించాడు.
        రుద్రమదేవి నిరంతరం యుద్ధాల్లో మునిగితే వెళ్ళినప్పటికీ, పాలనాపరంగా ప్రజలను నిర్లక్ష్యం చేయలేదు. ఓరుగల్లును శత్రు దుర్భిథ్యం   చేయడానికి  ఓరుగల్లు కోట చుట్టూ కందకాలు,  బురుజులు ఏర్పాటు చేసింది. శత్రు సైన్యం దాడి చేయకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసుకుంది. రుద్రమదేవి పరిపాలన కాలంలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించిన ఇటలీ దేశానికి చెందిన నౌకయాత్రికుడు   "మార్కోపోలో " సందర్శించి ఆమె పరిపాలన కాలాన్ని  స్వర్ణ యుగమని వేన్నోళ్ల పొగిడాడు. దీన్నిబట్టి రుద్రమదేవి పరిపాలన  ఎలా కొనసాగిందో అంచనా వేయవచ్చు.  మూర్తీభవించిన        ధైర్యసహాసాలకు ప్రతిరూపం రుద్రమదేవి. ఆమె దాయాధిరాజులను , శత్రు వర్గాలను ఓడించి  ముచ్చమటలు పట్టించిన ధీర పరాక్రమశాలి. అన్ని వర్గాల ప్రజలను సమానంగా పరిపాలించి ప్రజా రంజక పాలన అందించిన వీరవనిత రుద్రమదేవి. అనేకసార్లు ఓటమి పాలైన వెల్లూరునేలే అంబ దేవుడు  రుద్రమదేవి పై కక్ష కట్టాడు. అతని కుట్ర తెలుసుకున్న రుద్రమ అపర భద్రకాళి అయి పోరాటం చేసింది. రుద్రమదేవిని ప్రత్యక్షంగా ఎదుర్కోలేని అంబదేవుడు కుట్ర పన్ని, కార్తీక మాసం సందర్భంగా పరమ భక్తురాలైన రుద్రమ  ప్రత్యేక పూజలో  నిమగ్నమై ఉండగా అంబ దేవుడి మనుషులు దాడి చేసి వెనుక నుంచి పొడిచారు.  క్రీస్తుశకం 1289 నవంబర్ 27న  నల్లగొండ (తెలంగాణ) జిల్లాలోని నకిరేకల్ సమీపంలోని  చందుపట్ల వద్ద రుద్రమదేవి మరణించినట్లు మనకు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన "చందుపట్ల శాసనం" తెలియజేస్తుంది.  రుద్రమదేవి పరిపాలన కాలం స్త్రీ ఆత్మగౌరవానికి ప్రతీక. అసమాన ప్రతిభ పాటపాలతో కాకతీయ రాజ్యాన్ని పరిపాలించి  పరిపాలన పరంగా  ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. ఆమె చరిత్ర నేటి తరం  తెలుసుకోవాల్సిన  అవశ్యకత  ఎంతైనా ఉంది. 
========================================

 గమనిక:  నవంబర్ 27 రుద్రమదేవి వర్ధంతి సందర్భంగా....
కామెంట్‌లు