కోతలు కోస్తే : సరికొండ శ్రీనివాసరాజు

 సోము చదువులో అంతంత మాత్రమే. గణితంలో చాలా వీక్. రాజు తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులను ఇంటికి ఆహ్వానించాడు. రాజు తల్లి విమల ఆ స్నేహితులు చదువులో ఏ స్థాయిలో ఉన్నారో నిజాయితీగా చెప్పమంటుంది. సోము తాను చాలా తెలివైన వాడినని కోతలు కోస్తాడు. విమలమ్మ తన చిన్న కొడుకు మోహన్ 7వ తరగతి చదువుతున్నాడని, గణితంలో చాలా వీక్ అని సోమూను రోజూ తమ ఇంటికి వచ్చి, మోహనుకి లెక్కలు చెప్పి, అతణ్ణి చాలా తెలివైన విద్యార్థిని చేయాలని వేడుకుంటుంది. సోము షాక్. తనకు అర్జెంట్ పని ఉందని అక్కడ నుంచి జారుకుంటాడు. 
     రెండు మూడు రోజులు గడిచాయి. విమలమ్మ ఒకరోజు సోము ఇంటికి వస్తుంది. సోము తల్లిదండ్రులకు తనను పరిచయం చేసుకొని, "మీ అబ్బాయి చదువులో చాలా తెలివైన వాడట కదా! మా పెద్ద అబ్బాయి పుట్టినరోజు నాడు మీ అబ్బాయి స్వయంగా నాతో చెప్పాడు. మా చిన్న అబ్బాయి చదువులో చాలా వెనుకబడినాడు. మీ ఇంటికి రోజూ మా అబ్బాయిని పంపుతాను. మీ అబ్బాయి మా అబ్బాయికి గణితం బోధిస్తే, మీ అబ్బాయికి ఏది కావాలంటే అది ఇస్తాం." అంటుంది విమల. ఆశ్చర్యపోతుంది సోము తల్లి కమల.
      'మా వాడికి ఇంత దృశ్యం ఉందా! తెగ కోతలు కోసి, తీయగా నమ్మించాడు కదా!' అననుకుంది కమల. "మా అబ్బాయి రోజూ మీ ఇంటికే వస్తాడు. మీ ఇంట్లోనే మీ అబ్భాయికి లెక్కలు నేర్పుతాడు. మా అబ్బాయి ప్రతిభా పాటవాలు మీరే కళ్ళారా చూడండి." అన్నది కమల. చచ్చింది గొర్రె. సోమూ ప్రతిభా పాటవాలు రాజుకు తెలుసు. వాళ్ల తమ్ముడికి లెక్కలు చెప్పడానికి తాను వెళితే ముందు రాజు పగలబడి నవ్వుతాడు. ఆ తర్వాత తాను ఎంత తెలివి తక్కువ వాడినో బయట పెడతాడు. ఇప్పుడు దిక్కేంది? తాను అనవసరంగా కోతలు కోసి పెద్ద చిక్కుల్లో పడ్డాడు. తాను కోతల రాయుడినని ఇంట్లో తెలిసిపోయింది. ఇప్పుడు దిక్కేమిటి? " ఇప్పుడు ఏమి చేయాలో తోచక జుట్టు పీక్కున్నాడు సోము.

కామెంట్‌లు