వేణునాదం :- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
నిశ్శబ్దం నిద్రలేస్తే —
వేణువే పలుకరిస్తుంది,
గాలిలో గాథలై
గుండెలను తడుపుతుంది.

చెవులలో దూరి
చెమ్మగాలై, పాటలై,
శ్రోతల మదుల్లో
శ్రావ్యమై మార్మోగుతుంది.

వేణునాదము తరంగమై
ప్రేమరాగాలు వెలువరిస్తుంది.
తనువుమరిచి తేలే తీయదనమై
తలపులై మనసులకెక్కి మత్తెక్కిస్తుంది.

పొదల్లో పుట్టిన మ్రోగు కర్ర —
దేవతల దివ్యనాదమయ్యింది.
గాలి స్పర్శతో గానం చేసే
ప్రకృతి ప్రాణమయ్యింది.

వేణువు — గాలికి ప్రాణం,
మనసుకు మధుర స్మరణం.
వేణునాదమే వసుధ హృదయధ్వని -
వేయిరాగాల వెన్నెలలోని సౌందర్యనిధి

వేణువు కృష్ణుని వాయిద్యం, హస్తభూషణం,
రాధకు ప్రియాతిప్రియం, ప్రేమకు చిహ్నం,
గోపికలకు ఆనందాల కారణం, మహిమాన్వితం,
గోవులకు సంతోషదాయకం, భక్తులకు పూజ్యనీయం


కామెంట్‌లు