వెలుగును తాగి
నీడ నిలబడ్డట్లు
చీకటిని కనీ
దీపం ఆరిపోయినట్లు
చేప ఈదటం
పక్షి ఎగరడం సహజం!!
విత్తు విసిరివేయబడ్డట్లు
కిరణం రాలిపోయినట్లు
నీరు పారినట్లు
మట్టి పగిలినట్లు
మొక్క మొలకెత్తడం
పంట పండడం సహజం!!
గాలి వీచినట్లు
పర్వతం ఒరిగినట్లు
లోయ లోతయినట్లు
వాగు వంపు తిరిగినట్లు
పుడమి పులకరించటం
పడతి కంటబడడం సహజం!!
ఆకు చిగురు తొడిగినట్లు
చెలిమే ఊరినట్లు
పైరు పడి పడి లేచినట్లు
చినుకు ఆగి ఆగి ఊగినట్లు
మనిషి మెతుకు తినడం
రుతువు బ్రతకడం సహజం!!
భూమిపై పంట పసిడైనట్లు
భూగర్భన పసిడి పంటైనట్లు
భూమి చుట్టూ తిరిగి చంద్రుడు వెన్నెలైనట్లు
సూర్యుని చుట్టూ తిరిగి భూమి కాంతి అయినట్లు
ఆకాశంలో చుక్కలు
భూమిపై చక్కని చుక్కలు సహజం!!?

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి