సామెతల ఊట- సునందమ్మ నోట:- వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు, ఖమ్మం
 సామెత -56- అరటిపండొలిచి చేతిలో బెట్టినట్టు
*****
"అవ్వా !అవ్వా! గియ్యాల మా బల్లె లెక్కల సారు మస్తు దిట్టిండు. "గీ పోరగాండ్లకి ఎంత జెప్పినా మెదడకెక్కట్లే. "అరటి పండొలిచి చేతిల బెట్టినట్టు జెప్పినా నోట్లె బెట్కొని మింగడం సుత శేత గానట్టుంది గీళ్ళ యవ్వారం" అన్కుంట మస్తు దిట్టిండు. మా కలాసులున్నోళ్ళని. ఇంగ అందరి బొక్కులు దీయించిండు.నిన్న ఇంటికిచ్చిన లెక్కలు జేసిండ్రా లేదాని ఒక్కొక్కల్ని బిలిచి సూశిండు".
"నీను,శీను గాడు, సోనీ,లత, నరేష్ గాడు సారు జెప్పిన ఇంటి లెక్కలు జేసినం. గా బొక్కులు  అందర్కి సూపెట్టి "పిల్లగాండ్లంటె గిట్లుండాలె. మీకేమైందిరా? నా పానానికి బడ్డరు "శెబ్తె యినరు వంట బుట్టదు" ఎట్లరా ఇంగ బాగపడేది.గీ లెక్కలొత్తేనే బతుకు లెక్క సరింగుంటది. గిట్ల ఏమేమో అన్కుంట ఎక్కాల బొక్కులు దీసి సదువుండ్రని గదమాయించిండు.
ఇంగేమన్నడో తెల్సునా?"ఏవైనా సరే చెవులు బెట్టి ఇనాలె. మన్సుబెట్టి ఆలోచించాలె.తెల్వితోని చెయ్యాలె. గట్ల వొల్లు దెగ్గర బెట్కొని చెప్పినయ్ చేత్తె అన్ని మా బాగొత్తయి" అన్నడు. గని... 
గా "అరటిపండు వొలిచి చేతిల బెట్టుడంటేందో" అస్సల్కి సమజవ్వలేదవ్వా? అయిన గని అరిటిపండు లొల్లి నోట్లె బెట్కొన్నంక ఇంగ మింగమా ఏంది? సారంటుంటె నాకు నవ్వొచ్చింది గని సూత్తె తిట్టుకుంట మొట్టికాయేత్తడని ఊకున్న." అంటుంటే...
 "అవ్వా! అవ్వా! నాకు అరటి పండు కావాల్నే! నువ్వు పండు సేతికిత్తే నేనే వొల్సుకోని నోట్లె బెట్కొని తింట.అక్కోల్లకి గది సుత రాదంట "అంటున్న బుడ్డోడి మాటల్కి భూలచ్మి అడ్డొచ్చి... 
"ఒరేయ్! బుడ్డోడా! మా సారన్న గా అరటిపండు మాటేందో దెల్వక నేనేడుత్తుంటే నువ్వేంద్రా మద్దెల" అన్కుంట...
"అవ్వా! సూడు! గీడు సుత మా కలాసు పొల్లగాండ్ల లెక్కనే అయ్యిండే. పైంగ ఏందో పేద్ద తెల్సినోడిలా యాచ్చన్ చేత్తాండు".
గాళ్ళిద్దరి అల్లరికి,లొల్లికి నవ్ కుంట...బుడ్డోడు గద.గట్లనే చేత్తడుగని. మీ సారు "అర్టిపండొలిసి చేతిల బెట్టినట్టు" అన్నడా? అర్టిపండొలిసి నోట్లె బెట్టినట్టన్నడా"? ఏదైతేంది తీ. గీ మాటల్కి అర్తం ఎంత మంచిగ మెదడుకెక్కేల యివురంగ శెప్పినా మీ పొల్లగాండ్లు గాటి మీద మన్సు బెట్టట్లేదన్న మాట. గందుకే మీ సార్కి కోపమొచ్చింది.
 "అంత యివురంగ మీ సారు జెప్పిందిని నువ్వు మిగిలిన నల్గురు సక్కంగ అర్తం జేసుకుని గా లెక్కల్ని జేస్కోని పోయిండ్రు.గట్ల మీకు ఆ లెక్కలు అర్టిపండు వొల్సి సేతికిచ్చినంత అల్కగా అర్థమైనయి. మిగుతోళ్లు పండొల్సి నోట్లె బెట్టినా మింగడం శేతగానోళ్ళన్న మాట.గిప్పుడు గా మాటకర్తం సమజైందానె బంగారూ!" అనంగనే... 
"ఓ నాకు సుత " అంటున్న బుడ్డోడి వొంక నవ్ కుంట జూస్తూ  ఇగ్గో గీ అర్టిపండ్లని వొల్సి చేతిల బెట్టాల్నా? నోట్లె బెట్టాల్నా?
"పో అవ్వా! గట్ల అక్కకే బెట్టాలె! నాగ్గాదు" అంటున్న తమ్మొనొంక గుర్రుగ జూసింది భూలచ్మి.
గదండీ సంగతి! "అరటి పండొలిచి చేతిల బెట్టినట్టు" అన్న దాన్కి "అరటి పండొలిచి నోట్లె పెట్టినట్లు" అన్న దాన్కి జెర్ర ఫరకున్నా అర్థం మాత్రం "వివరంగ జెప్పుడు అన్నట్లు".

కామెంట్‌లు