కంటతడి!!:- డా ప్రతాప్ కౌటిళ్యా.
మేఘం కరుగుతుంది 
నదులు పారుతున్నవి 
పంటలు పండుతున్నవి 
అడవులు పెరుగుతున్నవి 
ఋతువులు మారుతున్నవీ
మారనిది మనిషి కంటతడి 
విడిపోనిది మనిషి నీడ 
కనబడనిది మనిషి జాడ!!!

పరిగెత్తే గాలి తిరిగే భూమి 
కురిసే వెన్నెల మెరిసే కిరణం 
పొంగే కడలి 
కారణం లేకుండానే కారణం అడక్కుండానే 
పనిచేస్తున్నవీ!!

పారే రక్తం తీసే ఊపిరి 
పిలిచే గుండె చూసే చూపు 
చెప్పే శబ్దం పలికే పెదవి 
కదిలే అడుగు ఆహ్వానించే చేతులు 
ఏం చెప్తున్నాయి 
బ్రతుకు నీది మా బ్రతుకంతా నీదే అని!!

గుండెను తవ్వి మనసును చంపి 
తలను తెంపి మొడాన్ని విడదీసి 
శరీరానికి 
రెక్కలిచ్చి ఎగురమని చెప్పి 
ఆడ మగను వేరుచేసి మనిషిని చంపేసి 
అడవినితిని ఆకులు అలములు విసిరేసి 
గూడును కూల్చి గుహలుగా మార్చి 
ఏం నేర్చుకుంటున్నారు 
మంచి మనిషిని జంతువుగా మార్చుకుంటున్నారు!!

భూమిని తవ్వి బొగ్గుని తీసి 
వెండి బంగారమని నూనెలని 
గనులు తవ్వి మట్టిని పాతిపెట్టి 
చెట్టును చంపి కాగితం చేసి 
కరెన్సీగా మార్చి కరెన్సీ కోసం 
ఏం నేర్చుకుంటున్నారు 
మంచి మనిషిని జంతువుగా మార్చుకుంటున్నారు.!!

మేఘం కరుగుతుంది వర్షం కురుస్తుంది 
నదులు పారుతున్నవి పంటలు పండుతున్నవి 
ఋతువులు మారుతున్నవి 
మారనిది కంటతడి 
వీడిపోనిది మనిషి నీడ కనబడనిది మనిషి జాడ!!

డా ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు