సుప్రభాత కవిత : - బృంద
ఏటికి ఎదురుచూపు లేదు 
రాతికి రేపు పై ఆశ లేదు 
నీటికి నిన్నలు  లేవు 
నింగికి కాలంతో పనిలేదు 
వాటి తావున అవి పదిలం!

జన్మ ఎక్కడో తెలియదు 
కర్మ ఏమిటో తెలియదు 
మర్మమేమిటో తెలియదు 
పరము చేరుకునే విధి తెలియదు 
తానే సర్వమను అతిశయం.

పాప భీతి లేదు 
పుణ్య రీతి లేదు
తనకు లాభమున్న చాలు
ఏదైనా సమ్మతమే
తాను తనదన్న స్వార్థం!

ఊపిరెప్పుడు ఆగునో 
ఆత్మ ఎప్పుడు సాగునో 
ఊహకందక  పోయినా
ఉన్న సమయమంతా
అన్నీ పోగేసుకోవాలనే ఆరాటం

కుంగుబాటులోన తప్ప 
గుర్తురాని దైవము 
కుటిలమంత ముగిసి
పట్టి కుడుపు వేళ
పరమాత్ముడిని తలచు తెలివి

మట్టిరేణువంటి మనిషి
గట్టిగా గాలి విసరికొడితే
నెట్టి వేయబడును నిర్దాక్షిణ్యముగా
ఇట్టి మర్మమెరుగని నరులు
వట్టి మట్టిబొమ్మలు కాదే!

రేపులెన్ని వచ్చినా పాపములాగునా?

🌸🌸 సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు