పాటనై నే బ్రతికి ఉంటా..!:- కవి రత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్.


( డా. అందెశ్రీకి అశృనివాళి )

పాటనై నే బ్రతికి ఉంటా...
ప్రతి తెలంగాణింటా ప్రతిధ్వనిస్తుంటా...
అన్న మట్టి మనిషికి మరణమెక్కడిది..?

తల్లి ప్రేమకు దూరమైనా...
తండ్రి ఒడిని చేరకపోయినా...
అన్నా చెల్లెళ్ల మమతల నెరగకున్నా...
ప్రకృతిని తల్లిగా...అక్షరాన్ని గురువుగా...
పల్లెపాటను పాఠ్యంగా మార్చుకోగా...!

తాపీ మేస్త్రి చేతిలో
పదాల ప్రతిమ వెలసింది...
చెమటచుక్కల్లో కవిత్వం మొలిచింది...
పీడిత తాడిత ప్రజల కన్నీటి గాథల
నుండి పుట్టిన "ఆశుకవి లోకకవి"
అందెశ్రీ కలం నుండి జాలువారిన ఆ
"పాటల పూదోట"...
"అందెల సందడి"...
"నిప్పుల వాగు"...
బృహత్ గ్రంధాలు నేడు తెలుగుతల్లి 
మెళ్ళో మెరిసే మణిహారాలాయె..!

బాల్యంలోనే అందె ఎల్లయ్యపై
విధి విషంచిమ్మే...విరోధియాయె...
ప్రకృతియే పాఠశాలాయె...
మానవ హృదయమే ఓ పుస్తకమాయె...
జీవితమే ఒక విశ్వవిద్యాలయమాయె..!

శృంగేరి పీఠాధిపతి
శంకర్ మహరాజ్ ఆశీస్సులు పొంది
బిరుదురాజు రామరాజు సన్నిధిలో 
"సాహిత్య యజ్ఞం" మొదలు పెట్టిన మన
అందెఎల్లయ్య "అందెశ్రీ"గా అవతరించె..!

మలిదశ తెలంగాణ ఉద్యమంలో
కామారెడ్డి మట్టిలో మొలకెత్తిన
“ధూం ధాం” విరితోటలో విరిసిన...
2002 సెప్టెంబర్ 30న ఉదయించిన
యువతను ఉర్రూతలూగించిన
“జయ జయహే తెలంగాణ
"జననీ జయకేతనం”... గీతం
నేడు లక్షల హృదయాల్లో
జనజాగృతికి స్ఫూర్తిమంత్రమాయె..!

ఇరవై మూడేళ్ళ క్రితం బాసర సరస్వతి అమ్మవారికంకితమిచ్చిన ఆ గీతం నేడు
తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతమాయె..!

2025 జూన్ 2 న గౌరవ వేదికపై
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిచే
కోటి రూపాయల నగదుతో ఘన
సన్మానం పొందిన ఘనుడు డా.అందెశ్రీ..!

“మాయమైపోతున్నాడమ్మా...”
"మనిషన్నవాడూ...
"మచ్చుకైనా లేడు చూడూ...
అంటూ అక్షరఅద్దంలో మనసుల 
మలిన్యాన్ని...నిజజీవిత
నిత్యసత్యాల్ని...ఎత్తిచూపి
నేడు కన్నుమూసి కనుమరుగైపోయిన..!

ఓ కవిరేడా...
ఓ అక్షర యోధుడా...
ఓ ధిక్కార స్వరమా...
ఓ సాహితీ శిఖరమా...
ఓ తెలంగాణ తేజమా...
ఓ ఉద్యమ సూర్యుడా...
మట్టిలో పుట్టిన నీ పదాలు...
ఆకాశంలో మెరిసే నక్షత్రాలాయె..!
ఆర్తితో నిండిన నీ ఆలోచనలు
అక్షరరూపంలో అమరమాయె....!

ఓ అక్షర శిల్పి...
ఓ అమరజీవి అందెశ్రీ...
నీ ప్రస్థానం ఒక కవిత్వం...
నీ జీవితం ఒక విప్లవగీతం...
నీ మరణం ఒక మౌనోద్యమం...
నీ కిదే నా అక్షర అశ్రునీరాజనం...
నీ పవిత్రాత్మకు శాంతి కలుగునుగాక..!


కామెంట్‌లు